Warangal Gurukulam: విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న హనుమకొండ జిల్లా కేంద్రంలోని నైమ్ నగర్ తేజస్వి స్కూలును విద్యార్థి మృతి మరవకముందే భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు బాలికల గురుకుల పాఠశాల (Warangal Gurukulam)లో పదవ తరగతి విద్యార్థిని వనం శ్రీ వర్షిణి ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రిన్సిపల్ ఆఫ్రీనా సుల్తానా తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, కిడ్నీ నొప్పితో పాటుగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఇంటికి వెళ్లిందన్నారు. ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి నుండి హాస్టల్ కు వచ్చిందని, చదువులో మంచి ప్రతిభ కనబరిచేదని విద్యార్థిని అని తెలిపారు. అప్పటివరకు తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉన్న అమ్మాయి ఉరివేసుకొని చనిపోవడంతో హాస్టల్లోని విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
Also Read:Waragal Gurukulam: గురుకుల ప్రవేశాల్లో నియమాల మాయం.. విద్యార్థులపై అన్యాయం ఎవరి బాధ్యత?
భయం అవుతుంది నాన్న
భయం అవుతుంది నాన్న హాస్టల్లో ఉండలేకపోతున్నా ఇంటికి వస్తా అంటూ తండ్రికి ఫోన్ చేసిన కాసేపటికే కన్న కూతురు హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ తల్లిదండ్రులను శోకసముద్రంలో ముంచింది. విచారంగా ఉన్న కూతురిని కలవడం కోసం ఇంటి నుంచి బయలుదేరిన తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరుకొని ఉరివేసుకొని ఉన్న తమ కూతుర్ని చూసి బోరున విలపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గురుకుల పాఠశాల వద్దకు చేరుకొని వివరాలు సేకరించి,పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పలు సంఘాల ఆందోళన
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన ఘటనపై పలు ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి చర్యలు పునారావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థిని వనం శ్రీ వర్ష (15) భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో అనుమానాస్పదంగా ఆత్మహత్యకు పాల్పడటం శుక్రవారం తీవ్ర సంచలనం రేపింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన మధ్య ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధర్నా చేయడంతో హుజురాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది.
ఘటన వివరాలు
సెలవుల తర్వాత గురువారమే పాఠశాలకు చేరుకున్న శ్రీ వర్ష, శుక్రవారం ఉదయం టీచర్ సెల్‌ఫోన్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి, వెంటనే ఇంటికి తీసుకెళ్లాలని, తాను ఇక్కడ ఉండలేనని వేడుకుంది. వారు తీసుకెళ్లేందుకు వస్తున్నామని బదులిచ్చారు. అయితే, ప్రార్థన సమయానికి విద్యార్థులంతా బయటకు రాగా, శ్రీ వర్ష కనిపించలేదు. అనుమనంతో డార్మెంటరీ హాల్‌లోకి వెళ్లి చూడగా, ఆమె తన చున్నీతో ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించింది. ఈ సంఘటనతో భీమదేవరపల్లి పోలీసులు, బాలిక తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సమాచారం అందించింది.
ఒత్తిడే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ సమాచారం అందుకున్న వెంటనే గురుకులానికి చేరుకున్న తల్లిదండ్రులు వనం తిరుపతి, మమత కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమార్తె ఆత్మహత్యకు ప్రిన్సిపాల్, సిబ్బంది పెట్టిన ఒత్తిడే కారణమని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వంగర పోలీసులు తండ్రి వనం తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ఆధ్వర్యంలో ఎస్సైలు దివ్య, ప్రవీణ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధర్నా
విద్యార్థిని మృతి నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హుజురాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోస్టుమార్టం పూర్తయ్యాక, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వయంగా మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి చౌరస్తా వరకు ర్యాలీగా మోసుకొచ్చి, అక్కడే ఉంచి బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకులాల నిర్వహణను పట్టించుకోవడం లేదంటూ తీవ్రంగా ఆరోపించారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మూడు కీలక డిమాండ్లు వినిపించారు
శ్రీ వర్ష కుటుంబానికి తక్షణమే రూ. 1 కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించిన గురుకుల ప్రిన్సిపాల్, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ డిమాండ్లను తెలియజేయగా, వాటిని ప్రభుత్వానికి తెలియజేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ధర్నాను విరమించారు. అనంతరం ఆయన మృతదేహంతో రాంపూర్ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. విద్యార్థి, ప్రజా సంఘాలు సైతం తక్షణ విచారణ, ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశాయి.
Also Read: Gurukulam Institutions: గురుకులాల్లో సీట్ల బ్లాకింగ్.. తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు
