Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మెజారిటీ ఓటర్లుగా ఉన్న ముస్లిం కమ్యూనిటీ కాంగ్రెస్(Congress) వైపే నిలుస్తున్నట్లు సర్కార్ సర్వేలో తేలింది. జూబ్లీహిల్స్‌లో మాత్రమే ఉప ఎన్నిక జరుగుతున్నప్పటికీ, స్థానికంగా ఉన్న ముస్లిం మైనారిటీలు ఈ ఎన్నికలను జాతీయ స్థాయి అంశాలతో ముడిపెడుతున్నట్లు తేలింది. దేశంలో మైనారిటీల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి కృషి చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని భావిస్తున్నారు. యూపీఏ 1, 2లో ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం జరిగిందంటూ ఆయా లీడర్లు చెబుతున్నారు. బీజేపీ ప్రభుత్వంతో తమకు నష్టమేనని, ఈ ఎన్నిక దేశంలో కాంగ్రెస్ పవర్‌లోకి వచ్చేందుకు ఇండికేషన్ అంటూ ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. పైగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు చట్టం కూడా ముస్లిం సామాజిక వర్గంలో వివాదస్పదంగా మారింది. దీంతో హస్తం వైపే మెజార్టీ మైనార్టీ ఓటర్లు నిలుస్తున్నట్లు ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో నియోజకవర్గంలో 34 శాతం(లక్షకు పైగా ఓటర్లు) ఉన్న ముస్లిం మైనారిటీలకు చెందిన మత పెద్దలు కాంగ్రెస్‌కు మద్ధతు ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకమే…
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీ(BJP)తో బీఆర్ఎస్(BRS) రహస్య పొత్తు నడుస్తున్నదనే అంశాల్లో ఇది నిరూపితమైదని ముస్లిం ఓటర్లు చెబుతున్నారు. బీజేపీ -బీఆర్ఎస్ పార్టీలు ఒకరి మేలు కోసం ఇంకొకరు అన్నట్టుగా రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడకపోవడం, ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అభ్యర్థిని పోటీ చేయించకుండా బీజేపీ గెలుపు కోసం కృషి చేయడమేనంటూ ముస్లిం నేతలు వివరిస్తున్నారు. పైగా గత లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును గంపగుత్తగా బీజేపీకి మళ్లించిందని ముస్లిం నేతలు బలంగా నమ్ముతున్నారు.
అంతేగాక రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి లాభం చేకూర్చేలా ఓటింగ్‌కు గైర్హాజరవడం వంటి అనేక కారణాలను స్థానిక ముస్లిం ఓటర్లు ఉదాహరిస్తున్నారు. దీంతో పాటు బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేసీఆర్ కుమార్తె కవిత చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీతో బీఆర్ఎస్ రహస్య పొత్తు నడుస్తున్నది, అందుకే జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌ను ఓడిస్తామని స్థానిక ముస్లిం ఓటర్లు తేల్చి చెబుతున్నారు.
బీజేపీతో బీఆర్ఎస్ రహస్య పొత్తును గ్రహించిన ఒవైసీ
ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం బాహాటంగా మద్ధతు ప్రకటించడాన్ని కూడా ముస్లిం ఓటర్లు గుర్తు చేస్తున్నారు. పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా నవీన్ యాదవ్ గెలుపును కాంక్షించడం ముస్లిం ఓటర్లు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్లేందుకు ప్రేరేపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్‌కు బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్-ఎంఐఎం మిత్రపక్షాలు అనే ప్రచారం జరిగినా ..ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్ధతు ప్రకటించడం గమనార్హం. బీఆర్ఎస్‌తో రహస్య పొత్తు వల్లే బీజేపీ తన పార్టీ తరఫున డమ్మీ అభ్యర్ధిని బరిలో నిలిపిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది.
ఆయన చేరికపై విమర్శలు…
హెచ్‌వైసీ సల్మాన్ ఖాన్‌ను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక సీరియల్ అఫెండర్, రౌడీషీటర్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడాన్ని జూబ్లీహిల్స్‌లోని మైనార్టీల్లో కొందరు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ నేతలపై రౌడీల ముద్ర వేయడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన బీఆర్ఎస్ నేతలు చివరికి రౌడీషీటర్ సల్మాన్ ఖాన్‌ను పార్టీలో చేర్చుకోవడం చర్చంశనీయమైంది. బీఆర్‌ఎస్‌లో చేరిన సల్మాన్ ఖాన్‌పై సిటీలోని పలు స్టేషన్‌లలో తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. ఆయనపై ఉన్న 25 కేసుల్లో 23 కేసులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నమోదు కావడం గమనార్హం.
ఈ క్రిమినల్ కేసుల్లో 2020-–2023 మధ్య కాలంలో హుమాయున్ నగర్, నాంపల్లి, బంజారా హిల్స్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, గోల్కొండ, పంచాగుట్ట, ఫలక్‌నామా, బహదూర్‌పురా, బోరబండ పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద నమోదయ్యాయి. హుమాయున్ నగర్ పీఎస్‌లో పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదుకావడం సల్మాన్ ఖాన్ నేర స్వభావానికి నిదర్శనమనే చర్చ ప్రారంభమైంది. అంతేకాకుండా సోషల్ మీడియా క్రౌడ్‌ఫండింగ్ ద్వారా సేకరించిన ఛారిటీ విరాళాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారనే తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.ఈ నేపథ్యంలో తమ రాజకీయ ప్రత్యర్థులపై ‘రౌడీయిజం’ ముద్రవేసి ప్రచారం చేసిన కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ, ఇంత పెద్ద క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తిని పార్టీలోకి ఎలా చేర్చుకున్నారనే ప్రశ్నల్ని జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు చర్చంశనీయమైంది.
Also Read: Lightning Strikes: పొలం పనులు చేస్తుండగా.. కూలీ కుటుంబాల్లో పిడుగుపాటు విషాదం
