Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ పర్వం నేటి సాయంత్రంతో ముగియనుండటంతో, కేంద్ర ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారి దృష్టి అంతా ఇకపై అభ్యర్థుల ప్రచారంపైనే కేంద్రీకరించనున్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS), బీజేపీ(BJP) అభ్యర్థులు ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురిచేయకుండా పకడ్బందీ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక వ్యూహం సిద్ధమైంది. నామినేషన్ల తుది జాబితా కూడా శుక్రవారమే విడుదల కానున్న నేపథ్యంలో, శనివారం నుంచే అభ్యర్థుల కదలికలు, ప్రచార కార్యక్రమాలపై భారత ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే ఏర్పాటైన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ (ఎఫ్.ఎస్.టి), స్టాటిస్టికల్ సర్వైలెన్స్ టీమ్ (ఎస్.ఎస్.టి) సోదాలను మరింత ముమ్మరం చేయాలని వ్యయ పరిశీలకులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ప్రలోభాలకు చెక్
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా పార్టీలు మద్యం, నగదు లేదా ఇతర బహుమతులు పంపిణీ చేస్తే, పౌరులు నేరుగా టోల్ ఫ్రీ నెంబర్ 1950 కి సమాచారం ఇవ్వాలని పరిశీలకులు సూచించారు. దీంతో పాటు, సీ-విజిల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి బృందాలు కేవలం వంద నిమిషాల్లోనే స్పందించి చర్యలు తీసుకోనున్నట్లు పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు.
Also Read: Chhattisgarh: హిడ్మా సరెండర్ కాబోతున్నాడా? ఏటూరు నాగారం, తుపాకులగూడెం అడవుల్లో సంచరిస్తున్నాడా?
అభ్యర్థి ఖాతాలోకే..
ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రల వంటి వాటికి సువిధ యాప్ ద్వారా లేదా రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అనుమతి తప్పనిసరి. దీనికి తోడు ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు విధులు నిర్వహిస్తున్న ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి బృందాల పనితీరుతో పాటు అభ్యర్థుల కదలికలను కూడా వీడియో తీయనున్నారు. అనుమతులు లేకుండా నిర్వహించే ప్రచార కార్యక్రమాలపై చర్యలుంటాయని పరిశీలకులు స్పష్టం చేశారు. అనుమతి లేని ప్రచారాన్ని వీడియో తీసి, అందులో పాల్గొన్న జనాలు, వాహనాల సంఖ్య ఆధారంగా ఖర్చును అంచనా వేసి, ఆ మొత్తాన్ని నేరుగా అభ్యర్థి ఎన్నికల వ్యయ ఖాతాలో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు నిర్వహించే కార్యక్రమాలపై షాడో టీమ్స్‌తో పాటు పరిశీలకులు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో పాటు సీక్రెట్ నిఘా పెట్టనున్నట్లు సమాచారం. జంతువులు లేదా మూగజీవాలను ప్రచారంలో వినియోగించినట్లయితే అందుకు సంబంధించిన చర్యలు కూడా ఉంటాయని జిల్లా ఎలక్షన్ వింగ్ అధికారులు తెలిపారు.
Also Read: Kalvakuntla Kavitha: గ్రూప్-1 నియామకాలపై కవిత సంచలనం.. సుప్రీంకోర్టు సీజేఐకి బహిరంగ లేఖ
