Maganti Malini Devi: మాలినీదేవిని ఆపుతున్నదెవరు?
మొదటి భార్య ముందుకు రాకుండా అడ్డుకునే కుట్ర
ఓ కీలక నేత డీల్ చేస్తున్నట్లు టాక్
బై ఎలక్షన్‌లో హాట్ పొలిటికల్ ఎపిసోడ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాగంటి మాలినీదేవి (Maganti Malini Devi) ఎక్కడ? అని నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడంతో అంతర్గతంగా విచారణ మొదలైనట్లు సమాచారం. అయితే, బీఆర్ఎస్‌లోని ఓ కీలక నేత ఆమె సమాచారాన్ని బయటకు తెలియకుండా నిలువరిస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ఉపఎన్నిక వేళ ఆమె బయటకు రాకుండా ఆ కీలక నేత జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. మాగంటి గోపీనాథ్ కుటుంబాల మధ్య నెలకొన్న విభేదాలు, వారసత్వ పోరు బహిర్గతం కాకుండా మాలినీ దేవిని ఆ కీలక నేత రహస్య ప్రదేశంలో దాచినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. గతంలో ఆమె చెన్నైలో ఉండేవారని, ఉపఎన్నికల వేళ ఆమెను మరో చోటుకి తరలించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
Read Also- Pocham Srinivas Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై పోచారం శ్రీనివాసరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు
వివాదాస్పదంగా ఫ్యామిలీ ఎపిసోడ్?
మాగంటి మాలినీ దేవి మొదటి భార్య ఉండగానే సునీతతో గోపినాథ్ లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నారని, హిందూ వివాహ చట్ట ప్రకారం ఇది చెల్లుబాటుకాదనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికల వేళ మాగంటి గోపీనాథ్ వారసత్వాన్ని డిమాండ్ చేస్తూ మాగంటి మాలినీ దేవి రోడ్డెక్కకుండా బీఆర్ఎస్‌కు చెందిన ఆ కీలక నేత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే మాగంటి సునీత వివాదాస్పద వైఖరి కారణంగా ఆయన కుటుంబంలో ఉన్న విభేదాలు రచ్చకెక్కాయనే ప్రచారం కూడా జూబ్లీహిల్స్‌లో జరుగుతోంది. మరోవైపు, గతంలో ఆసుపత్రిలో ఉన్న గోపీనాథ్‌ను చూడడానికి ఆయన తల్లి, సోదరుడు వజ్రనాథ్ రాకుండా సునీత అడ్డుకున్న తీరు సామాన్యులను సైతం బాధించిందనే ప్రచారం ఉన్నది. ఈ తరుణంలో మాలినీ దేవి బయటకు వస్తే బీఆర్ఎస్‌కు తలకుమించిన భారం అవుతుందని బీఆర్ఎస్‌కు చెందిన ఆ కీలక నేత భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మాలినిదేవి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?, ఆమె ఎందుకు బయటకు రావడం లేదు? అనే సందేహాలు జూబ్లీహిల్స్ ప్రజల్లో నెలకొన్నాయి.
Read Also- Collector Rahul Raj: బాల్యవివాహాలపై మెదక్ జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
మొదటి భార్య కుమారుడి సంచలన ఫిర్యాదు
మాగంటి మాలినీ దేవిని బయటకు రాకుండా నిలువరించే ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నా.. ఆమె కుమారుడు తారక్ ప్రద్యుమ్న అనూహ్యంగా తెరమీదకు వచ్చారు. మాగంటి సునీత సమర్పించిన నామినేషన్ అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నాయని తారక్ ప్రద్యుమ్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తన తండ్రి గోపీనాథ్‌కు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న ఏకైక భార్య తన తల్లి మాలినీ దేవి మాత్రమేనని ప్రద్యుమ్న పేర్కొన్నారు. గోపీనాథ్ తన తల్లికి విడాకులు ఇవ్వలేదని, అయినప్పటికీ సునీత తనను తాను గోపీనాథ్ భార్యగా చెప్పుకుంటూ తప్పుడు వివరాలను దాఖలు చేశారని ఆయన ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జూబ్లీహిల్స్‌లో సంచలనంగా మారింది. దీనిపై సదరు బీఆర్ఎస్ కీలక నేత ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఈ కుటుంబ వివాదాల్లో సెంటిమెంట్ వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విజయానికి దగ్గర్లోనే ఉన్నట్లు అభివర్ణిస్తున్నారు.
