Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు సమన్యాయం లేదనే విమర్శలు కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో సీనియర్ నాయకుల మధ్య జరుగుతున్న పరిణామాలు వరుస విమర్శలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా కొండా సురేఖ ఎపిసోడ్ పరిష్కారం, మరో సీనియర్ నేత జీవన్ రెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి అంశాలు పార్టీలో తీవ్ర అసంతృప్తిని రాజేస్తున్నాయి. కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులు పార్టీ విధానాలపై, క్రమశిక్షణ కమిటీ పనితీరుపై బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.
Also Read: Telangana Congress: ఆ ముగ్గురు మినిస్టర్ల మధ్య దుమారం.. రంగంలోకి దిగిన పీసీసీ చీఫ్
రాజకీయాల్లో కలకలం
కొద్ది రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి సహా కొందరు మంత్రులపై చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. ఈ వివాదం పార్టీ క్రమశిక్షణకు సవాలుగా మారినప్పటికీ, హైకమాండ్ జోక్యంతో కొండా దంపతులు ముఖ్యమంత్రితో సమావేశమవడం, ఆ తర్వాత ఈ వివాదం క్లోజ్ అయినట్లు ప్రకటించారు. అయితే, ఈ వ్యవహారంలో కొండా కుటుంబం వ్యక్తం చేసిన ఆవేదనను పార్టీ , ప్రభుత్వం ఏమాత్రం కన్సిడర్ చేయకుండా, కేవలం రాజీ మార్గంలో వివాదాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేతల గౌరవాన్ని, వారికి ఎదురవుతున్న సమస్యలను ఉపేక్షించడం సరికాదని పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
జీవన్ రెడ్డికి నో ప్రయారిటీ
ఈ వివాదం మరువకముందేమరో సీనియర్ నాయకుడు, శాసనమండలి మాజీ ప్రతిపక్ష నేత టి. జీవన్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం, ప్రాధాన్యత దక్కడం లేదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో బలంగా ఉంది. దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా ఉన్న ఆయనకు ప్రభుత్వంలో గానీ, పార్టీ నిర్మాణంలో గానీ కీలక పాత్ర ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా, నిస్వార్థ రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన జీవన్ రెడ్డి సేవలను కాంగ్రెస్ సరిగా వినియోగించుకోవడం లేదనే భావన కార్యకర్తల్లో ఉంది. కొందరు కొత్త నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, అంకితభావంతో పనిచేసిన పాత తరం నేతలను విస్మరించడం సమన్యాయం కాదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధానంగా బీఆర్ ఎస్ లో గెలిచి, కాంగ్రెస్ కండువా కప్పుకున్న డాక్టర్ సంజయ్ కే పార్టీ, ప్రభుత్వం అత్యధిక ప్రాయారిటీ ఇస్తుందనేది జీవన్ రెడ్డి ఆరోపణ.
కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తల్లో అసంతృప్తి
సీనియర్ నేతల పట్ల పార్టీ వైఖరి, అంతర్గత కలహాల నిర్వహణ తీరు కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని పెంచుతోంది. పార్టీ కోసం జీవితాలను అంకితం చేసిన నాయకులకే విలువ లేకపోతే, ఇక తమ పరిస్థితి ఏంటి?” అని క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. వ్యక్తిగత ఆరోపణలు, వర్గ పోరాటాలు పదేపదే తెరపైకి రావడం ప్రభుత్వ పాలనకు, పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వ్యక్తుల అసంతృప్తి భవిష్యత్ లో పార్టీ నష్టానికి ప్రమాదంగా మారే ఛాన్స్ ఉన్నదని కొందరు సీనియర్ లీడర్లు చెబుతున్నారు.
క్రమ శిక్షణ కమిటీ ఏం చేస్తున్నట్లు..?
పార్టీ ఇంటర్నల్ విషయాలు తరచూ బహిరంగ విమర్శలకు దారితీస్తున్న నేపథ్యంలో, పార్టీలోని క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ లీడర్ల నుంచి వినిపిస్తుంది. సీనియర్ల మధ్య విభేదాలు, వారి ఆవేదనకు సంబంధించిన అంశాలను కట్టడి చేయడం, పరిష్కరించడంలో కమిటీ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీలో క్రమశిక్షణ లోపించడం, కొందరు నేతలు తరచూ బహిరంగ విమర్శలకు దిగడం చూస్తుంటే, క్రమశిక్షణ కమిటీ అనేది కేవలం నామమాత్రంగానే ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.సీనియర్లను గౌరవించడం, వారికి తగిన స్థానం కల్పించడం ద్వారానే పార్టీకి పూర్తిస్థాయిలో బలం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే, అంతర్గత అసంతృప్తి పార్టీ స్థిరత్వానికి, ప్రభుత్వ పనితీరుకు ముప్పుగా మారే అవకాశం ఉంది. మరోవైపు కొందరు లీడర్ల కే క్రమ శిక్షణ కమిటీ నోటీసులు, చర్యలు వంటివి చేపడుతుందనే టాక్ కూడా పార్టీ నుంచి వినిపిస్తున్నది.
Also Read: TG Congress Ministers: వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న మంత్రులు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు

