TG Congress Ministers: ప్రభుత్వం చేసే పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. తనకు, సర్కారుకు మంచి పేరు తీసుకురావాలి. పార్టీకి, సీఎంకు సైతం ప్రతిష్టను పెంచాలి. మంత్రులకు ఉండే బాధ్యతల్లో ఇవి చాలా కీలకం. కానీ, కొందరు మాత్రం వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నారు. ఒకరి శాఖ విషయంలో మరొకరు జోక్యం చేసుకోవడం, ఒకరికి తెలియకుండానే మరొకరు రివ్యూలు నిర్వహించడం, టెండర్లు పిలవడం, ఏకంగా ప్రెస్ మీట్లలోనే ఒక మంత్రిపై మరో మంత్రి కామెంట్లు చేయడం చేస్తున్నారు. డైలీ సీరియల్ మాదిరి జరుగుతున్న మంత్రుల వ్యవహారాలన్నీ సీఎం దగ్గరకు వెళ్లడం, ఆయన పరిష్కారం చూపడం జరుగుతున్నదని తెలిసింది.
మంత్రుల మధ్య సమన్వయ లోపం!
రాష్ట్ర మంత్రుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. తరచూ జరుగుతున్న ఘటనలే అందుకు నిదర్శనం. దీనివల్ల కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కాంగ్రెస్(Congress) నేతలే అభిప్రాయపడుతున్నారు. ఒక శాఖకు చెందిన ఉన్నతాధికారులతో మరో మంత్రి వివేక్(Minister Vivek) సమీక్ష చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. దీంతో ఆ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) సీరియస్ కాగా, సమీక్ష చేసిన మంత్రి సారీ చెప్పినట్లు సమాచారం. దీంతో సమీక్షలంటేనే అధికారులు సైతం హడలిపోతున్నట్లు తెలిసింది. మేడారం జాతరపై ఆ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొంగులేటి(Min Ponguleti) రివ్యూ చేయడం, దీనికి సీతక్క(Seethakka), సురేఖ హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.
ఆ తర్వాత ఆ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య పొసగడం లేదని, అందుకే జాతర పోస్టర్ ఆవిష్కరణలో ఒక మంత్రి పాల్గొనలేదని, రివ్యూలో సైతం పాల్గొనలేదని ప్రచారం జరిగింది. తర్వాత ఇద్దరు మంత్రులు తమ మధ్య విభేదాలు లేవని మీడియా ముఖంగా సంజాయిషీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం జాతర టెండర్ల విషయంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రికి మధ్య పంచాయితీ నడిచింది. ఇన్‌ఛార్జ్ మంత్రి తన అనుచరులకే కాంట్రాక్ట్ అప్పగించారని పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారని సమాచారం. తాజాగా మరో మంత్రి కూడా ఇన్‌ఛార్జ్ మంత్రి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తమ ఇంటి సమస్యను తామే పరిష్కరించుకుంటామని పీసీసీ చీఫ్ సైతం స్పష్టం చేశారు. తానెవ్వరి మీద ఫిర్యాదు చేయలేదని మంత్రి సీతక్క ట్వీట్ చేయడం, తనపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదని, తనను పార్టీలో ఎవరూ ఏమీ అనలేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. తనపై వస్తున్నవార్తల్లో నిజం లేదని వెల్లడించారు.
Also Read; Uttam Kumar Reddy: నీటిపారుదల శాఖ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు: మంత్రి ఉత్తమ్
రచ్చకు దారి తీసిన పొన్నం వ్యాఖ్యలు
ఈ మధ్య మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొంత గందరగోళానికి దారితీశాయి. మంత్రి లక్ష్మణ్(Min Laxman) తీవ్రస్థాయిలో స్పందించారు. దీంతో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించింది. అయితే, మంత్రి వివేక్ ఇదే ఇష్యూపై తాజాగా మాలల ఐక్యతా సదస్సులో స్పందిస్తూ, తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కొందరు రెచ్చగొడుతున్నారని అన్నారు. మంత్రి పదవిపై తనకు వ్యామోహం లేదని, సేవ చేయడమే లక్ష్యమని వివేక్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలకు వెంటనే లక్ష్మణ్ స్పందించారు. ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్లీ తెరపైకి తెస్తున్నారని అన్నారు. ఈ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని, తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
అంతకుముందు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి(Minster Komati Reddy Venkat Reddy) మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. జూలై 29న సాగర్ పర్యటన నేపథ్యంలో మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోగా మంత్రి ఉత్తమ్(Minister Uttam) సమయానికి రాలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసి కోమటిరెడ్డి రిటన్ వెళ్లిపోయారు. ఉత్తమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం క్రితం కోమటిరెడ్డి ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝూ కు ఆర్ అండ్ బీ శాఖలో పోస్టింగ్ ఇవ్వొద్దని సీఎంకు లేఖ రాశారనే ప్రచారం ఉన్నది. మరోవైపు, జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులుగా ఉన్నవారికి, ఆ జిల్లా మంత్రులకు పలు అంశాల్లో తరచూ అభిప్రాయ విభేదాలు వస్తుండడం, ఒకరి రివ్యూకు మరొకరు హాజరు కాకపోవడంతో ఇవన్నీ చర్చనీయాంశాలుగా మారాయి. జిల్లాల్లో అభివృద్ధి పనులు సైతం కుంటుపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Also Read: Kishan Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కిషన్ రెడ్డి ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా?
ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇస్తున్నారా?
సమన్వయ లోపంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా మంత్రులు స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఏ శాఖపై విమర్శలు వస్తే ఆ శాఖ మంత్రి మాత్రమే స్పందిస్తుండడం, మిగిలిన వారు తమకేంటి, స్పందించాల్సిన అవసరం లేదు, తమ శాఖ కాదు కదా, అలాంటప్పుడు ఎందుకు స్పందించాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అలా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారనేది స్పష్టమవుతున్నది. రుణమాఫీ విషయంలో, ఉద్యోగాల కల్పన విషయంలో, ఆ మధ్య యూరియా అంశంలో, గ్రూప్ 1 విషయంలోనూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేసినా ఆశించిన స్థాయిలో మంత్రులు స్పందించ లేదని కాంగ్రెస్ నేతలే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి విషయానికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తే తప్ప సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. మంత్రుల మధ్య విభేదాల పరిష్కారం సీఎం జోక్యంతో జరుగుతున్నట్టు సమాచారం. ఏ మంత్రి అయినా క్యాబినెట్‌లో ఉన్నప్పుడు విమర్శలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ, ఆ దిశగా కొందరు మంత్రులు స్పందించకపోవడం శోచనీయం. ఫలితంగా ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇస్తున్నట్టు అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
శాఖలపై పట్టు ఏది?
మరోవైపు, మంత్రులు శాఖలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. మంత్రులు పంపిన ఫైల్స్‌ను అధికారులు పక్కకు పెడుతున్నారని , కొన్నింటిని రిజెక్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. అధికారులకు నచ్చితే తప్ప ఆ ఫైల్స్ ముందుకు సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు శాఖకు సంబంధించిన సమాచారం అడిగినా ఉన్నతాధికారులు ఇవ్వడం లేదనే ప్రచారం జరుగుతున్నది. దీనికి కారణం సంబంధిత శాఖ మంత్రికి ఆ శాఖపై పట్టు లేకపోవడమే కారణమనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మంత్రులు వివాదాలకు వెళ్లకుండా వారికి కేటాయించిన శాఖలపై దృష్టి సారిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆ దిశగా దృష్టి పెడతారా? లేకుంటే వివాదాలకు కేరాఫ్‌గా మారుతారా అనేది చూద్దాం.
Also Read: Prisioner Death: రిమాండ్ ఖైదీ ఆత్మహత్య.. జైలులో ఏం చేసుకున్నాడో తెలుసా?
