Airports: దేశవ్యాప్తంగా 40 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సహా 40 ఎయిర్‌పోర్టుల మెయిల్ ఐడీకి బాంబు ఉన్నట్టు మంగళవారం బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీఐఎస్ఎఫ్ బలగాలు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లు విమానాశ్రయాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కానీ, అనుమానిందగిన వస్తువులేవీ కనిపించలేవని స్పష్టం చేశారు. ఈ బెదిరింపు మెయిల్స్ వల్ల పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఒకే రోజు 40 ఎయిర్‌పోర్టులకు బాంబులు ఉన్నాయని, పేలిపోతాయని బెదిరింపులు రావడం కలకలం రేపింది.
మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈ బెదిరింపు మెయిల్స్ వెళ్లినట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు ఢిల్లీ, పాట్నా, జైపూర్, వడోదర, చెన్నై, కోయంబత్తూర్ విమానాశ్రయాలకూ బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టుకు మంగళవారం ఉదయం ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో దుబాయ్‌కు వెళ్లే ఫ్లైట్ నిలిచిపోవాల్సి వచ్చింది. ఆ దుండగుడే ఇతర విమానాశ్రయాలకు బెదిరింపు మెయిల్స్ పంపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ బెదిరింపుల వల్ల చాలా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు కొంతకాలం నిలిచిపోయాయి.