Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా నివారించేందుకు గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతృ మరణాల నివారణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడుతూ.. జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా చూడటానికి గర్భిణులకు జనన పూర్వ సంరక్షణ సేవలను మెరుగుపరచాలని ఆదేశించారు. ‘హై రిస్క్ కేసులను సకాలంలో గుర్తించి, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గర్భం, కాన్పు సమయంలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
Also Read: Yadadri-Bhuvanagiri incident: ప్రమాదానికి కారణమయ్యాడు..జైలుకెళ్ళాడు
హై రిస్క్ కేసులను రిఫరల్ ఆసుపత్రులకు పంపాలి
గర్భిణులకు సకాలంలో వ్యాక్సినేషన్, మాత్రలు, చికిత్సలు అందించాలి. ఏఎన్ఎం, ఆశా వర్కర్లు గృహ సందర్శనలు చేసి, గర్భిణుల నమోదు, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. సాధ్యమైనంతవరకు నార్మల్ డెలివరీలు జరిగేలా చూడాలి. అవసరమైతే, హై రిస్క్ కేసులను రిఫరల్ ఆసుపత్రులకు పంపాలి. ప్రభుత్వ ఆస్పత్రులపై గర్భిణులకు నమ్మకం కలిగేలా వైద్య సిబ్బంది ప్రేమ, ఆప్యాయతతో సేవలు అందించాలి. సమావేశంలో జిల్లాలో ఇటీవల జరిగిన నాలుగు మాతృ మరణాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ మరణాలకు కారణాలను విశ్లేషిస్తూ, ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. సరైన సమయంలో చికిత్స అందించడం, ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలించడం ద్వారా మాతృ మరణాలను నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
మరణాల నివారణకు చర్యలు
తల్లి, బిడ్డ ఆరోగ్యం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ముఖ్యమైనది. జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా నివారించడానికి అన్ని చర్యలూ తీసుకుంటాం. వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు సమన్వయంతో పనిచేస్తే, ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు” అని కలెక్టర్ హనుమంత రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కొత్త ఉత్తేజాన్ని నింపి, గర్భిణుల ఆరోగ్య సంరక్షణలో కీలక మార్పులు తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఏఎన్ఎం, ఆశాల పాత్ర కీలకం
ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, హెల్త్ సూపర్‌వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు గర్భిణుల ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ సందర్శనల ద్వారా గర్భిణులకు తగిన సలహాలు, సూచనలు, చికిత్సలు అందించడంలో వారు కీలక పాత్ర పోషించాలని కోరారు. హై రిస్క్ కేసులను ముందుగానే గుర్తించి, అవసరమైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ యశోద, చౌటుప్పల్ డివిజన్ ప్రోగ్రామ్ ఆఫీసర్, భువనగిరి డివిజన్ డిప్యూటీ డాక్టర్ శిల్పిని, స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఇంద్రాణి, పీడియాట్రిషన్ డాక్టర్ కవిత, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రభాకర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ చిన్నా నాయక్, మండల వైద్యాధికారులు, హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Also Read: Grama Dukan: మరో నూతన పథకానికి ప్రభుత్వం శ్రీకారం.. ఇక మహిళలకు పండగే!
