Big Fraud In The Name Of Gold: పోలీసులు ఎన్ని చట్టపరమైన చర్యలు తీసుకున్నా సరే, కేటుగాళ్ల ఆగడాలకు అద్దు అదుపులేకుండా పోతోంది. ఘరానా మోసాలకు పాల్పడుతూ తమ క్రిమినల్ మైండ్‌కి పదునుపెడుతున్నారు. తాజాగా నగరంలోని మూడుచోట్ల బంగారం పేరుతో బురిడి కొట్టించిన ఘటన రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది.
కేసు 1: తక్కువ ధరకు బంగారాన్ని ఇప్పిస్తామంటూ మోసం చేసిన నలుగురు వ్యక్తులను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 5 కేజీల నకిలీ బంగారం, 6 కోట్ల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను ఎల్బీనగర్ ఎస్ఓటీ, వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కేసు 2: ఎండీఎంఏ డ్రగ్స్‌ని బెంగళూరు నుండి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించిన సిటీ పోలీసులు, 26 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుండి మొత్తం 4 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
కేసు 3: మరోవైపు వైజాగ్ నుండి హైదరాబాద్‌కు హాష్ ఆయిల్ డ్రగ్‌ను రవాణా చేస్తున్న ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను ఎల్బీనగర్ ఎస్‌ఓటీ, భువనగిరి పోలీసులు పట్టుకున్నారు. సుమారు 2 లీటర్ల హాష్ ఆయిల్ డ్రగ్, ఇతర నేరారోపణలు 20 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం రాచకొండ సీపీ ప్రెస్‌మీట్ నిర్వహించారు. నిందితులు మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకు బంగారం విక్రయిస్తామంటూ బురిడీ కొట్టిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బంగారు వ్యాపారం చేసే యజమనులను టార్గెట్‌గా పెట్టుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కావలికి చెందిన రౌడీషీటర్ విజయ్ కుమార్ ఈ ముఠాను ఏర్పాటు చేశాడు. తెనాలికి చెందిన సెంథిల్, కావలికి చెందిన సునీల్ గవాస్కర్, నెల్లూరుకు చెందిన సురేష్‌లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. బోడుప్పల్‌కు చెందిన వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. దిలీప్ అనే వ్యాపారవేత్త తన స్నేహితుడితో కలిసి బెంగుళూరుకు వెళ్ళాడు. బెంగుళూరులో విజయ్‌కుమార్, హరీష్‌లను కలిశాడు. అక్కడ దిలీప్ విజయ్‌కు ఆరు లక్షల రూపాయలు చెల్లించడంతో 81 గ్రాముల బంగారం అందజేసిన విజయ్, మిగిలిన 20 గ్రాముల బంగారాన్ని బోడుప్పల్‌కు వచ్చి హరీష్ ఇచ్చాడు. వారు ఇచ్చిన బంగారం అసలుది కావడంతో వారిని నమ్మాడు బాధితుడు దిలీప్. ఆ నమ్మకంతో రెండు కిలోల బంగారం కావాలని అడుగగా బాధితుడు 20 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. సుమారు కోటి రూపాయలకు పైగా నగదును విజయ్‌కు దిలీప్ ఇచ్చాడు. కానీ బంగారం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన దిలీప్ పోలీసులను ఆశ్రయించాడు. విచారణలో నకిలీ నోట్ల దందాతో పాటు నకిలీ బంగారం బిస్కెట్లు వ్యవహారం బయటపడింది. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే డీల్ కుదుర్చుకునే టైమ్‌లో ఏదైనా తేడా వస్తే ఈ గ్రూప్‌కి చెందిన వ్యక్తే కానిస్టేబుల్‌గా వస్తాడు. వీళ్ళని బెదిరించినట్లుగా నటించి మొత్తం తీసుకొని వెళ్తాడని నిందితుల వివరాలను మీడియా సమావేశంలో రాచకొండ సీపీ తరుణ్ జోషి వివరించారు.