Riaz Encounter: నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో ఎవరూ ఊహించని సంచలనం జరిగింది. నిందితుడు రియాజ్‌ను పోలీసులు సోమవారం (అక్టోబర్ 20) ఎన్‌కౌంటర్ (Riaz Encounter) చేశారు. హాస్పిటల్ చికిత్స పొందుతున్న రియాజ్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడని, ఒక ఏఆర్ కానిస్టేబుల్ వద్ద ఆయుధాన్ని లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో రియాజ్ మృతి చెందినట్టు చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి రియాజ్ పారిపోయే ప్రయత్నం చేశాడు. చుట్టూ పోలీసులు ఉన్నప్పటికీ, వారందరితో పెనుగులాడి మరీ పారిపోయే ప్రయత్నం చేసినట్టుగా, ఈ క్రమంలోనే ఆయుధాన్ని లాక్కునేందుకు చూసినట్టుగా తెలుస్తోంది. రియాజ్ దాడిలో ఒక ఏఆర్ కానిస్టేబుల్‌కు గాయాలు అయినట్టుగా సమాచారం.
నిజామాబాద్ జీజీహెచ్ 4వ ఫ్లోర్‌లో మిగతా పెషెంట్లు ఎవర్నీ ఉంచకుండా చికిత్స అందిస్తున్నారు. కాగా, హాస్పిటల్‌లో కూడా రియాజ్ నేరప్రవృతిని ప్రదర్శించాడని చెబుతున్నారు. ఏమాత్రం జాలి, దయ లేకుండా నడుచుకున్నాడని, పోలీసుని హత్య చేశాననే భయం లేకుండా, తనను ఎవరూ ఏమీ చేయలేరన్న విధంగా నడుచుకున్నాడని తెలుస్తోంది.
డీజీపీ స్పందన
ఈ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా స్పందించారు. రియాజ్ చికిత్స పొందుతున్న రూమ్ బయట భద్రత కాస్తున్న ఓ ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడని ఆయన వెల్లడించారు. పోలీసులపై కాల్పులు జరపాలని చూశాడని, అతడు గన్‌ఫైర్ చేసి ఉంటే అమాయకులు ప్రాణాలు కోల్పోవారని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగా పోలీసులు కాల్పులు జరిపారని అన్నారు.
కానిస్టేబుల్ హత్య కేసులో కీలక పరిణామాలివే..
నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో రియాజ్ నిందితుడిగా ఉన్నాడు. పాత నేరస్తుడైన రియాజ్‌ను విశ్వసనీయ సమాచారం మేరకు, నిజామాబాద్ సీసీఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రమోద్ శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యంలో అకస్మాత్తుగా కత్తితో ప్రమోద్ ఛాతీలో పొడిచి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ కన్నుమూశారు. ఈ హత్య ఘటన సంచలనం రేపింది.
కానిస్టేబుల్‌పై గత శుక్రవారం కత్తితో దాడి చేయగా, నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. మొత్తం 9 పోలీసు బృందాలతో గాలిస్తుండగా, ఎట్టకేలకు సారంపూర్ గ్రామ శివారులో చిక్కాడు. శిథిలావస్థలో ఉన్న ఒక లారీ క్యాబిన్‌లో రెండు రోజులు తలదాచుకున్న అతడిని పోలీసులు చెమటోడ్చి పట్టుకోవాల్సి వచ్చింది. లారీ క్యాబిన్‌లో ఉన్నట్టుగా సమాచారం అందడంతో పికెటింగ్ ఏర్పాటు చేసి మరీ పట్టుకున్నారు. లారీ క్యాబిన్‌లో ఉండి పోలీసులను చూసి పారిపోతుండగా, ఒక షెడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. రియాజ్‌పై సుమారు 7 పోలీస్ స్టేషన్లలో 40కి పైగా కేసులు ఉన్నాయి. కనీసం 10 నుంచి 11 సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతడిపై రూ.50 వేల రివార్డ్ కూడా ఉంది. వాహనాలు విక్రయించి మహారాష్ట్రలో విక్రయించేవాడు.
Read Also- Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దుతున్నాం: మంత్రి పొంగులేటి
డీజీపీ, పోలీసు యంత్రాంగం ఆగ్రహం
కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. వీలైనంత త్వరగా రియాజ్‌ను పట్టుకోవాలని ఆదేశించారు. మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని నిజామాబాద్‌కు పంపించారు. కాగా, నిందితుడు రియాజ్ వాహనాల చోరీలు, చెయిన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.
ఈ హత్యపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి, రియాద్‌ను పట్టుకునేందుకు వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాలని నిజామాబాద్ కమిషనర్‌ను ఆదేశించారు. ఆధారాలను బట్టి గాలింపు చేపట్టాలని, నిందితుడిని వెంటనే పట్టుకోవాలని సూచించారు. మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని సంఘటనా స్థలికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, వారికి అవసరమైన సహాయం చేయాలని కూడా డీజీపీ సూచించారు. డీజీపీ ఆదేశాల మేరకు నిజామాబాద్ సీపీ 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పరారీలో ఉన్న రియాద్ ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డ్‌ను కూడా ప్రకటించారు.
