– లోకో పైలట్ సహా కనీసం 15 మంది మృతి
– మృతుల సంఖ్య పెరిగే చాన్స్
– కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న గూడ్స్ ట్రైన్
– పట్టాలు తప్పిన వెనుక మూడు బోగీలు
– ఉదయం నుంచే సిగ్నల్‌లో లోపం!
– పశ్చిమ బెంగాల్‌లో దుర్ఘటన
– పీఎం మోదీ, సీఎం దీదీ దిగ్భ్రాంతి
– మృతులు, బాధితులకు పరిహారం ప్రకటన
Kanchanjunga Express: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. త్రిపురలోని అగర్తల నుంచి బయల్దేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను బెంగాల్‌లో రంగపాని స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ ట్రైన్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఎక్స్‌ప్రెస్‌కు చెందిన చివరి మూడు బోగీలు అదుపుతప్పాయి. పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మంది మరణించారు. ఇందులో గూడ్స్ ట్రైన్ పైలట్, కో పైలట్ కూడా ఉన్నట్టు ఓ రైల్వే అధికారి తెలిపారు. 60కిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని చెబుతున్నారు.
త్రిపుర నుంచి కోల్‌కతాలోని సెల్దాకు వెళ్తున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ ట్రైన్ న్యూ జల్‌పైగురి సమీపంలో ఉదయం 9 గంటల ప్రాంతంలో ఢీకొట్టింది. అక్కడ ఉదయం 5.50 గంటల నుంచి ఆటోమేటిక్ సిగ్నల్ ఫెయిల్ అయిందని చెబుతున్నారు. ఈ కారణంగానే గూడ్స్ ట్రైన్ ముందుకు వెళ్లి కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టి ఉంటుందని అనుమానిస్తున్నారు. సాధారణంగా ఇలా సిగ్నల్ వ్యవస్థలో లోపాలు వచ్చినప్పుడు స్టేషన్ మాస్టర్ టీఏ 912 అధికారాన్ని పైలట్‌కు ఇస్తాడు. అప్పుడు రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ నిర్దిష్టమైన వేగంతో ట్రైన్ వెళ్లడానికి ఇది అనుమతిని పైలట్‌కు కల్పిస్తుంది. ఈ అనుమతిని సెల్దా వెళ్తున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 1374)కు ఇచ్చినట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే.. గూడ్స్ ట్రైన్‌ను కూడా ఇచ్చారా లేదా? అనేది తెలియదు.
డ్యామేజీ అయిన బోగీలను అక్కడే వదిలి మిగిలిన పోర్షన్ ట్రైన్ తన లక్ష్యం వైపు ప్రయాణాన్ని ప్రారంభించింది.
కాగా, గూడ్స్ ట్రైన్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం అని రైల్వే బోర్డు చైర్‌పర్సన్ జయ వర్మ తెలిపారు. గూడ్స్ ట్రైన్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా ముందుకు వెళ్లాడని, అందుకే ప్రమాదం జరిగిందనీ వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని, గాయపడినవారిని నార్త్ బ్లాక్ మెడికల్ కాలేజీకి తరలించినట్టు తెలిపారు.
ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ ట్రైన్ ఢీకొట్టిందని, కలెక్టర్, ఎస్పీ, వైద్యులు, రక్షక సిబ్బంది స్పాట్‌కు వెళ్లారని, సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన తీసుకుంటున్నామని వివరించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ. 2.5 లక్షలు, మైనర్ గాయాలు జరిగిన వారికి రూ. 50 వేలు పరిహారం అందిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. మృతులకు ప్రధానమంత్రి కార్యాలయం రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000లు అందిస్తామని ప్రకటించారు.