Kavitha: బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటు లో చట్టం చేసే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయానికి వచ్చిన బీసీ జేఏసీ చైర్మన్ , ఎంపీ ఆర్. కృష్ణయ్య, వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, జాతీయ బీసీ సంఘం నాయకుడు గుజ్జ కృష్ణ, బీసీ జేఏసీ నాయకులకు ఘన స్వాగతం పలికారు. బీసీల బంద్ కు మద్దతు కోరగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బంద్ లో భాగంగా ఉదయం 8 గంటలకు ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ లకు అర్హత లేదు
తెలంగాణ జాగృతి బీసీల పక్షపాతిగా ఉందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేశాయని, బంద్ లో తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎక్కడికక్కడ పాల్గొంటారన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీ లకు అర్హత లేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్ లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్ లో పాల్గొంటోంది.. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా? అసెంబ్లీ, కౌన్సిల్ లో బిల్లులు పాస్ చేసి కేంద్రంపై కొట్లాడకుండా ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తామే ముందుండి బంద్ చేయిస్తామంటోందని మండిపడ్డారు.
బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లను ఇవ్వాలి
బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ బీసీల్లో పుట్టి పోరాటం చేయడం సాధారణం అని, కానీ కవిత బీసీల గురించి పోరాటం చేయడం అభినందనీయమన్నారు. కవితను బీసీలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేసిందని, సందర్భాలను బట్టి రిజర్వేషన్లను పెంచుకోవచ్చని కోర్టులు తీర్పు ఇచ్చాయన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యంగ బద్ధత కల్పించాలని కోరారు. ఎస్సీ,ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ల ఉన్నాయని, బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చట్టసభల్లో సైతం రిజర్వేషన్లను ఇవ్వాలి
బీసీలకు స్థానిక సంస్థల్లో మాత్రమే కాదు చట్టసభల్లో సైతం రిజర్వేషన్లను ఇవ్వాలన్నారు. తెలంగాణలో మొదలైన బీసీ ఉద్యమం అన్ని రాష్ట్రాలకు విస్తరించాలన్నారు. బీసీలు అడిగేది శత్రువుల పంచాయతీ కాదు.. అన్న,దమ్ముల వాటాను బీసీలు అడుగుతున్నారన్నారు. వీజీఆర్ నారగోని మాట్లాడుతూ రాజ్యంగ సవరణ తోనే బీసీలకు ప్రాతినిధ్యం వస్తుందన్నారు. కవిత లాగా అగ్రవర్గాల నేతలు బీసీల గురించి మాట్లాడాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంపై,కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెచ్చే విధంగా మనం పోరాటం చేద్దామన్నారు.
Also Read: Kavitha: 25 నుంచి జాగృతి జనం బాట.. కేసీఆర్ ఫొటో లేకుండానే యాత్ర!
