Singareni Bonus 2025: ప్రతీ ఏటా దీపావళి సందర్భంగా సింగరేణి సంస్థ తమ ఉద్యోగులకు బోనస్ ప్రకటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఉద్యోగులకు భారీ మెుత్తంలో బోనస్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సింగరేణి సంస్థ తరపున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) బోనస్ ను ప్రకటించారు. ఈ ఏడాది రూ.400 కోట్లను దీపావళి కానుకగా ఉద్యోగులకు అందిచబోతున్నట్లు వెల్లడించారు. భారీ మెుత్తంలో ఉద్యోగులకు బోనస్ ఇవ్వడంపై ప్రభుత్వం తరపున భట్టి సంతోషం వ్యక్తం చేశారు.
సింగరేణిపై ప్రశంసల జల్లు
దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా రూ.400 కోట్ల బోనస్ అందించడం అభినందనీయమని భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా నుంచి మెుదలైన సింగరేణి ప్రస్థానం.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్థాయికి ఎదిగిందని కొనియాడారు. అటు దేశంలోని థర్మల్ ప్రాజెక్టులకు సింగరేణి కొన్ని దశాబ్దాలుగా బొగ్గును సరఫరా చేస్తోందని గుర్తుచేశారు. సింగరేణి అధికారులు, కార్మికుల కృషి ఫలితంగా దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు కీర్తి ప్రతిష్టలు వచ్చాయని భట్టి ప్రశంసించారు.
‘రిజర్వేషన్లలో బీజేపీదే తప్పు’
ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన బీసీల రిజర్వేషన్ల అంశం గురించి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలిసింది. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతి, ప్రధానిని కలుస్తామని పదే పదే లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేసినా కేంద్రం అనుమతి ఇవ్వలేదు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది’ అని భట్టి స్ఫష్టం చేశారు.
Also Read: Telangana Bandh: రేపే రాష్ట్ర బంద్.. రంగంలోకి కవిత.. జాగృతి తరపున కీలక ప్రకటన
‘రాష్ట్ర బంద్‌లో పాల్గొనండి’
రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు అక్టోబర్ 18న జరుగుతున్న బంద్ లో అందరూ పాల్గొనాలని కాంగ్రెస్ శ్రేణులకు భట్టి విక్రమార్క సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. మరోవైపు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలని భట్టి సూచించారు. ప్రధాని మోదీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి ఒత్తిడి తీసుకురావాలని పట్టుబట్టారు.
