Clapboard: సినిమా షూటింగ్ అనగానే, నటీనటులు కెమెరా ముందు నిలబడతారు, అంతలోనే ఒక వ్యక్తి చేతిలో ఉన్న చెక్క పలక (క్లాప్‌బోర్డ్) పైభాగాన్ని వేగంగా కొట్టడం మనం చూస్తుంటాం. కేవలం కొన్ని సెకన్ల పాటు జరిగే ఈ చిన్న పని సినిమా నిర్మాణంలో అత్యంత కీలకమైనదని మీకు తెలుసా? అసలు ఈ క్లాప్‌బోర్డ్‌ను ఎందుకు ఉపయోగిస్తారు, దీని వల్ల కలిగే ఉపయోగాలేమిటో చాలా మందికి తెలియదు. సినిమా వాళ్లు ఈ క్లాప్ బోర్డును కేవలం సీన్ ప్రారంభానికి గుర్తుగా ఏదో ఒకటి ఉండాలని, అలా అటెన్షన్ ఇవ్వడానికి ఈ క్లాప్‌బోర్డు (Clapboard)ను వాడతారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ, ఈ క్లాప్ సినిమా నిర్మాణం (Movie Making)లో చాలా కీలక పాత్ర వహిస్తుంది. అదేంటో తెలుసుకుందామా..
ఆడియో-వీడియో సింకింగ్ కోసం
సినిమా షూటింగ్‌లలో, విజువల్స్ ఒక కెమెరాలో, సౌండ్ వేరే పరికరంతో విడివిడిగా రికార్డ్ చేయబడతాయి. ఈ రెండు విడివిడి ఫైళ్లను పోస్ట్-ప్రొడక్షన్ (Post-Production)లో.. ముఖ్యంగా ఎడిటింగ్ టైమ్‌లో ఒకదానితో ఒకటి ఖచ్చితంగా కలపాలి. క్లాప్‌బోర్డు కొట్టినప్పుడు వచ్చే ‘తటక్’ అనే శబ్దం ఆడియో ట్రాక్‌లో స్పష్టంగా రికార్డ్ అవుతుంది. అదే సమయంలో, క్లాప్‌బోర్డు రెండు భాగాలు కలిసే దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. ఎడిటర్ ఈ శబ్దం, దృశ్యాన్ని ఒకే చోట కలిపి, ఆడియో-వీడియోను సింక్ చేయడానికి ఇది స్పష్టమైన మార్కర్‌గా ఉపయోగపడుతుంది. దీని వల్ల శబ్దానికి, నటుల పెదవుల కదలికలకు మధ్య తేడా లేకుండా ఉంటుంది. క్లాప్ సౌండ్ తర్వాత వెంటనే డైలాగ్ వస్తుందని ఎడిటర్ అలెర్ట్‌గా ఉంటారు.
షూటింగ్ వివరాల గుర్తింపు కోసం
అలాగే క్లాప్‌బోర్డుపై సీన్ నెంబర్, షాట్ నెంబర్, టేక్ నెంబర్, డైరెక్టర్, సినిమా పేరు, కెమెరామెన్ వంటి ముఖ్యమైన వివరాలు చాక్‌పీస్‌తో రాసి ఉంటాయి. సినిమాను కథను ఒక క్రమంలో కాకుండా, లొకేషన్ల సౌలభ్యం మేరకు లేదంటే బడ్జెట్ ప్రకారం విడివిడిగా షూట్ చేస్తుంటారు. ఎడిటింగ్ సమయంలో, ఏ ఫుటేజ్ ఏ సన్నివేశానికి సంబంధించిందో తెలుసుకోవడానికి ఈ సమాచారం ఎంతో అవసరం. క్లాప్‌బోర్డుపై ఉన్న ఈ వివరాలను చూసి.. ఎడిటర్ సరైన క్లిప్‌లను ఎంపిక చేసుకుని, కథకు అనుగుణంగా అమర్చుకుంటాడు. అలా లేదంటే, ఏది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఎడిటర్ (Editor)కి పిచ్చెక్కుతుంది. క్లాప్‌బోర్డుతో అతని పని మరింత ఈజీ అవుతుంది. కాబట్టి.. క్లాప్ కొట్టడం అనేది కేవలం టేక్ ప్రారంభానికి ఇచ్చే సూచన మాత్రమే కాదు, ఎడిటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు.. సమయాన్ని, డబ్బును ఆదా చేసే ఒక సాంకేతిక అవసరం కూడా. క్లాప్‌బోర్డు లేకపోతే, ఎడిటింగ్ చేయడం చాలా కష్టతరమవుతుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
