Telangana BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ (Telangana BJP) అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. కొద్దిరోజులుగా జరుగుతున్న చర్చకు పార్టీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మళ్లీ లంకల దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy)కే పార్టీ అవకాశం కల్పించింది. ఈమేరకు జాతీయ నాయకత్వం ఒక ప్రకటనలో తెలిపింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (Telangana BJP) అభ్యర్థిగా పోటీచేసిన లంకల దీపక్ రెడ్డికే పార్టీ మళ్లీ టికెట్ కేటాయించింది. 2023 ఎన్నికల్లో 25,866 ఓట్లు లంకలకు దక్కాయి. 54,683 ఓట్లతో ఆయన మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి చవిచూశారు. కాగా ఈ ఉప ఎన్నికలకు టికెట్ ఆశించిన పలువురు నేతల ఆశలు అడియాసలుగానే మిగిలాయి.
రూట్ క్లియర్ చేసుకోవాలనే వ్యూహం
దీంతో వారిని బుజ్జగించేందుకు పార్టీ పదవులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ సీటును తమ ఖాతాలోకి వేసుకుని లోకల్ బాడీ ఎన్నికలకు రూట్ క్లియర్ చేసుకోవాలనే వ్యూహంతో ఉంది. కాగా బీజేపీ నేతలు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఉప ఎన్నికలను బీజేపీ సెమీ ఫైనల్ గా భావిస్తోంది. అందుకే ఇక్కడ గెలిచి రాబోయే జీహెచ్ఎంసీ, లోకల్ బాడీ ఎన్నికలకు రూట్ క్లియర్ చేసుకునేలా ముందుకు వెళ్లాలని ఆలోచనలో ఉంది.
Also Read: Telangana BJP: బీజేపీ కార్యాలయంలో.. బీసీ సంఘం నేతల మధ్య ఘర్షణ
ముగ్గురు పేర్లను ఫైనల్ చేసి హైకమాండ్
జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై మానిటరింగ్ కమిటీని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వేసింది. ఆపై ఇటీవలే అభ్యర్థి ఎంపికకు త్రీ మెన్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, బీజేపీ సీనియర్ లీడర్, అడ్వకేట్ కోమల ఆంజనేయులుకు రాష్ట్ర నాయకత్వం చోటు కల్పించింది. అభ్యర్థి ఎంపికకు గాను ఈ కమిటీ పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకుని రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు నివేదిక అందించింది. కాగా రాష్ట్ర నాయకత్వం ముగ్గురు పేర్లను ఫైనల్ చేసి హైకమాండ్ కు అందించింది. కాగా ఢిల్లీలో బీహార్ ఎన్నికల ప్రణాళికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారు కోసం ఆదివారం పార్లమెంట్ ఎన్నికల కమిటీ సమావేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగింది. ప్రధాని మోడీ సైతం ఈ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సమావేశంలో చర్చించి బుధవారం జాతీయ పార్టీ అభ్యర్థిని హైకమాండ్ ఖరారుచేసింది.
నాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేసులో ప్రధానంగా లంకల దీపక్ రెడ్డి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకురాలు జూటూరి కీర్తిరెడ్డి మాత్రమే ఉన్నారు. ఒకరిద్దరి పేర్లు చర్చలోకి వచ్చినా ఈ టికెట్ కోసం పోటీ మాత్రం వీరిద్దరి నడుమే జరిగింది. కాగా ఆశావహులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినా వారికి నిరాశే ఎదురైంది. కాగా టికెట్ కోసం సీరియస్ గా ప్రయత్నించి భంగపడిన వారికి పార్టీలో కీలక పదవి అప్పగించి బుజ్జగించే ప్రయత్నంలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారంపై రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసినా అభ్యర్థి తెలియక ఇన్నిరోజులు ఎవరూ ప్రచారం చేపట్టలేదు.
ప్రచారంలో జోరు పెంచుతారా?
ఎట్టకేలకు అభ్యర్థి ఫైనల్ అవ్వడంతో ఇకనైనా ప్రచారంలో జోరు పెంచుతారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ టికెట్ ను దక్కించుకున్న దీపక్ రెడ్డి ఈ ఎన్నికల్లో అయినా గెలుపు జెండా ఎగురవేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. లంకల దీపక్ రెడ్డి బీజేపీలో రాకముందు టీబీపీలో తెలుగు యువత సిటీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆపై టీడీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చి చేరారు. బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియామకమయ్యారు. ఆపై 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి మూడోస్థానానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం పార్టీలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకు పార్టీ మరోసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ప్ర్రకటించింది.
కలిసొచ్చే అంశాలివే
జూబ్లీహిల్స్ బైపోల్ లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి (Lankala Deepak Reddy)కి గత ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కలిసొచ్చే అవకాశంగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా దీపక్ రెడ్డి కొనసాగుతున్నారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్.. బీజేపీ స్టేట్ చీఫ్ గా ఉన్న సమయంలోనూ ఆయనతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇంతేకాకుండా టీడీపీ అగ్రనేత చంద్రబాబుతోనూ దీపక్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. జూబ్లీహిల్స్ పరిధిలో ఏపీ సెటిలర్ల సంఖ్య బాగానే ఉంటుంది. దీనికి తోడు టీడీపీ కేడర్ నుంచి కూడా మంచి సపోర్ట్ లభించే అవకాశముంది.
ప్రతికూల అంశాలు
దీపక్ రెడ్డి స్వతహాగా మాస్ లీడర్ కాకపోవడం మైనస్ గా అయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికలు లేని సమయంలో ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు చేయలేకపోవడం కూడా ఆయనకు ప్రతికూల వాతావరణాన్ని క్రియేట్ చేసే చాన్స్ ఉంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తప్ప మిగతా నేతలతో సరైన సంబంధాలు లేకపోవడంతో కేడర్ కలిసొస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 25 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనికి తోడు ప్రధానంగా పార్టీ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం మైనస్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇతర పార్టీలు బలంగా ప్రచారంలో దూసుకువెళ్తున్నాయి. కానీ బీజేపీ అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం కూడా ప్రతికూలంగా మారే చాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: Telangana BJP: బీజేపీ కార్యాలయంలో.. బీసీ సంఘం నేతల మధ్య ఘర్షణ
