Komatireddy Venkat Reddy: గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) విమర్శలు చేశారు. రోడ్లు, భవనాల శాఖపై ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ హ్యామ్ రోడ్లు, టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణం అంశాలపై చర్చించినట్లు తెలిపారు. హ్యామ్ విధానంలో పెద్దఎత్తున రాష్ట్ర రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెంకట్ రెడ్డి వివరించారు.
దశల వారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ల నిర్మాణం చేపట్టాలనే విషయంలో సీరియస్ గా ఉన్నారన్నారు. కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. వచ్చే 30 నెలల్లో నాణ్యమైన రోడ్లు అంటే తెలంగాణ వైపు చూస్తారని ధీమా వ్యక్తంచేశారు. దేశంలోనే ‘ద బెస్ట్ రోడ్స్ ఇన్ తెలంగాణ’ అనే చర్చ జరుగుతుందని వెల్లడించారు. దశల వారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందే టిమ్స్ హాస్పిటల్స్ పనుల్లో వేగం పెంచి అతి త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఎన్సీలు మోహన్ నాయక్, జయ భారతి, సీఈలు రాజేశ్వర్ రెడ్డి, బీవీ రావు, కిషన్ రావు తదితరులున్నారు.
Also Read: Komatireddy venkat reddy: లక్షల కోట్లు అవినీతి చేసిన వాళ్లు నీతులు చెప్తారా?.. మంత్రి ఫైర్?
