Uttam Kumar Reddy: ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ సృష్టించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 22 వేల నుంచి 23 వేల కోట్లు వెచ్చించి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల పై బుధవారం సచివాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సున్నితమైన అంశమని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. 148.03 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో వ్యవసాయ చరిత్రలోనే రికార్డ్ నమోదు చేసుకోవడమే కాకుండా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం కూడా సరికొత్త రికార్డ్ అవుతుందన్నారు.
8,342 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
వ్యవసాయంపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతోనే ఈ స్థాయి ఉత్పత్తి సాధ్యమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 66.8 లక్షల ఎకరాలలో ఉత్పత్తి అయిన ధాన్యం కొనుగోలుకు 8,342 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 4,259 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా,3,517 ఐకేపీ కేంద్రాల ద్వారా,ఇతర సంస్థల ద్వారా మరో 566 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తరలించేందుకు పూర్తి స్థాయిలో రవాణా వసతి ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు నమోదైన 48 గంటల్లోనే చెల్లింపులు ఉంటాయన్నారు. మద్దతు ధరతో పాటు సన్నాలకు బోనస్ ను అందిస్తామన్నారు.
‘సమస్య ఉంటే.. కాల్ చేయండి’
కామారెడ్డి, నిజమాబాద్, మెదక్,సిద్దిపేట, నల్లగొండ జిల్లాలో 1205 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొనుగోళ్ల నుంచి డేటా ఎంట్రీ వరకు సమయపాలన పాటించాలన్నారు. వాతావరణం మార్పులు, వర్ష సూచనలను పౌర సరఫరాల అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. టార్బలిన్ లను అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులుంటే 1800-425-00333/1967 హెల్ఫ్ లైన్ నెంబర్ కి ఫోన్ చేయాలన్నారు. ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
Also Read: CM Revanth Reddy: హనుమకొండలో సీఎం రేవంత్ పర్యటన.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఫ్యామిలీకి పరామర్శ
ఎన్నో సవాళ్లను ఎదుర్కొని..
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లుగా ఎన్నో సవాళ్ళను ఎదురు కుంటేనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేశామన్నారు. వానాకాలంలో ముందెన్నడూ లేని రీతిలో ధాన్యం దిగుబడి వచ్చిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ, సహకార శాఖలు సమన్వయం చేసుకొని క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణా రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, రవాణాశాఖ కమిషనర్ రఘునందన్ రావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
