Most Wanted Criminal: అతడొక అంతరాష్ట్ర దొంగ. ఇప్పటికే 45 కేసులలో నిందితుడు. ‘చిక్కడు దొరకడు’ అన్న రీతిలో పోలీసుల కళ్లుగప్పి గత కొన్నేళ్లుగా తిరుగుతున్నాడు. పట్టుకోవడానికి వచ్చిన అధికారులను ముప్పు తిప్పలకు గురిచేశాడు. కొన్ని సార్లు చిక్కినట్లే చిక్కి.. తెలివిగా పోలీసుల నుంచి పరారయ్యాడు. అతడి మూలాన ఏకంగా 11 మంది పోలీసులు సస్పెండ్ అయ్యారంటే ఆ వ్యక్తి ఏ రేంజ్ దొంగనో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఓ యాక్సిడెంట్ కారణంగా విచిత్రంగా అధికారుల చేతికి చిక్కాడు.
అసలేం జరిగిందంటే?
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి.. 18 సంవత్సరాల వయసు నుండే జల్సాలకు అలవాటు పడ్డాడు. ఏపీలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, చత్తీస్గడ్ రాష్ట్రాలలోనూ చోరీలకు పాల్పడ్డాడు. వేర్వేరు ప్రాంతాల్లో అతడిపై ఏకంగా 45 కేసులు ఉన్నాయి. దీంతో నాగిరెడ్డిని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో పోలీసులు చేర్చారు.
రోడ్డు ప్రమాదం కారణంగా..
2023లో వైయస్సార్ జిల్లా కొండాపురంలో పోలీసులకు చిక్కినా అనుహ్యంగా పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. అప్పట్లో పలువురు పోలీసులు సస్పెండ్ కూడా అయ్యారు. ఈనెల 4వ తేదీ ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు శివారులో కారు నడుపుతూ నాగిరెడ్డి ప్రమాదానికి గురయ్యాడు. ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టడంతో నాగిరెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో కారులోని విశాఖకు చెందిన సుధీర్, లావణ్య ప్రాణాలు కోల్పోగా.. నాగిరెడ్డితో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయాలపాలైన నాగిరెడ్డిని ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Also Read: Dammu Srija Re-entry: సోషల్ మీడియా ఎఫెక్ట్.. దిగొచ్చిన బిగ్ బాస్ టీమ్.. వీకెండ్‌లో శ్రీజా రీఎంట్రీ!
ఉరవకొండ కోర్టులో హాజరు
ప్రమాదానికి గురైన నాగిరెడ్డి కారులో రూ.3.5 లక్షల నగదు, కొన్ని వెండి ఆభరణాలు పోలీసులకు లభ్యమయ్యాయి. దీంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులుకు అనుమానం వచ్చింది. నాగిరెడ్డి గురించి ఆరా తీయగా.. అతని నేర చరిత్ర మొత్తం బయటపడింది. తీవ్ర గాయాల పాలైన అతడ్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. నాగిరెడ్డి గాయాలు మెరుగైన వెంటనే అతడ్ని అరెస్ట్ చేసి ఉరవకొండ కోర్టులో హాజరు పరిచారు. ఇంతకాలం ముప్పు తిప్పలు పెట్టిన ఈ మాయగాడు ఎట్టకేలకు రోడ్డు ప్రమాదం రూపంలో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
