Woman Assaulted In Train: రైళ్లలో మహిళ భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్లు భారతీయ రైల్వే తరుచూ చెబుతూ వస్తోంది. ప్రతీ రైలులో మహిళల కోసం ప్రత్యేక బోగీని ఏర్పాటు చేసి.. వారి భద్రతకు భరోసా కల్పిస్తున్నట్లు పేర్కొంటోంది. అయితే రైళ్లలో స్త్రీల భద్రతపై ఎప్పుడూ ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. తాజాగా జరిగిన మరో ఘటన ఈ అంశాన్ని మరోమారు చర్చకు లేవనెత్తింది. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తోన్న రైలులో ఓ మహిళపై అత్యాచారం జరగడం షాక్ కు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
బాధిత మహిళ హైదరాబాద్ వెళ్లేందుకు రాజమహేంద్రవరంలో సంత్రగచి స్పెషల్ ట్రైన్ (Santragachi Special Train) ఎక్కింది. భద్రంగా ఉంటుందని భావించి.. మహిళల కోచ్ లో ఎక్కింది. అయితే అప్పటివరకూ ప్రయాణికులతో రద్దీగా ఉన్న బోగి.. గుంటూరుకు చేరుకోగానే ఖాళీగా మారిపోయింది. ఈ క్రమంలో రైలు ముందుకు కదలగా.. ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి మహిళా కోచ్ లోకి ప్రవేశించాడు. ఆమెను ప్రాధేయపడి బోగిలో ఉండేందుకు అనుమతి కోరాడు.
ఒంటరిగా ఉండటంతో..
అయితే మహిళా కోచ్ మెుత్తం ఖాళీగా ఉండటాన్ని ఆ వ్యక్తి గమనించాడు. ఈ క్రమంలోనే అతడిలోని మృగం నిద్ర లేచింది. గుంటూరు – పెదకూరపాడు మధ్య రైలు ప్రయాణిస్తుండగా అతడు రెచ్చిపోయాడు. తన వద్ద ఉన్న కత్తిలో బాధితురాలిని బెదిరించాడు. కదులుతున్న రైలులోనే ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. శ్రీ ఆదిత్య భవన నిర్మాణాన్ని పరిశీలించిన హైడ్రా యంత్రాంగం
రైల్వే పోలీసులకు ఫిర్యాదు
మరోవైపు రైలు హైదరాబాద్ లోని చర్లపల్లి స్టేషన్ కు చేరుకోగానే.. బాధిత మహిళ అప్రమత్తమైంది. జీఆర్పీ పోలీసులకు నిందితుడిపై ఫిర్యాదు చేసింది. రైలులో తనకు జరిగిన దారుణాన్ని వారికి వివరించింది. నిందితుడ్ని ఎలాగైన పట్టుకొని.. శిక్షించాలని ప్రాధేయపడింది. దీంతో రంగంలోకి దిగిన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడు రైలు ఎక్కిన, దిగిన స్టేషన్ల సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితుడ్ని పట్టుకుంటామని బాధితురాలికి రైల్వే పోలీసులు హామీ ఇచ్చారు.
