Coldref Syrup Deaths: డాక్టర్లు సూచించిన ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు సిరప్ తాగి ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చాలామంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన వ్యవహారం (Coldref Syrup Deaths) తెలిసిందే. దీంతో, ఆ సిరప్‌పై నిషేధం విధించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు విచారణ కూడా చేపడుతున్నాయి. ఈ క్రమంలో పలు సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. దగ్గు సిరప్ కారణంగా మధ్యప్రదేశ్‌లో మొత్తం 23 మంది చిన్నారులు పిట్టల్లా రాలిపోగా, అందులో అత్యధిక పిల్లలకు కోల్డ్రిఫ్ సిరప్ వాడాలని ప్రిస్కిప్షన్ రాసిచ్చిన ప్రవీణ్ సోనీ అనే పిడియాట్రిక్ డాక్టర్‌ను పోలీసులు ప్రశ్నించారు. చాలామంది పిల్లలకు ఈ సిరప్‌ను సూచించినట్టు ఒప్పుకున్న ఆయన, ఒక్కో సిరప్‌పై తనకు రూ.2.54 కమిషన్ వస్తుందని వెల్లడించాడు.
శ్రేషన్ ఫార్మాష్యూటికల్ కంపెనీ తయారు చేసిన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ ఒక్కో బాటిల్‌పై 10 శాతం కమిషన్ వస్తుందని వివరించారు. ఈ సిరప్ మార్కెట్ ధర రూ.24.54గా ఉంటుందని చెప్పాడు. ఈ వివరాలు విన్న విచారణ అధికారులు నిర్ఘాంతపోయారు. డాక్టర్ ప్రవీణ్ సోని, మధ్యప్రదేశ్‌లోని పరాసియా గవర్నమెంట్ హెల్త్ సెంటర్‌లో చిన్నపిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నాడు. 4 ఏళ్ల లోపల పిల్లలకు ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులు ఇవ్వకూడదంటూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన తర్వాత కూడా అతడు పట్టించుకోలేదు. తన ప్రైవేట్ ప్రాక్టీసులో అదే కోల్డ్రిఫ్ సిరప్‌ను చాలామంది పిల్లలకు సూచించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి.
Read Also- Tollywood movie leaks: షూటింగ్ సమయంలో లీకైన వీడియోలు, ఫోటోలు సినిమాపై ప్రభావం చూపుతాయా?.. ఎంతవరకూ?
డాక్టర్ సోనీ కమిషన్ తీసుకున్నట్టుగా అంగీకరించినట్టు పోలీసుల రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. అయితే, ఆయన లాయర్ పవన్ శుక్లా మాత్రం ఇదంతా అసత్య ప్రచారం అంటున్నారు. కల్పిత ప్రచారమని ఖండించారు. డాక్టర్ సోనికి వ్యతిరేకంగా ప్రత్యక్షసాక్ష్యం ఏదీ లేదని, అందుకే పోలీసులే ఈ కథనాన్ని సృష్టించి, ఆధారంగా నిలవని ఒక మెమోరాండాన్ని తయారు చేశారని న్యాయవాది ఆరోపించారు. 10 శాతం కమిషన్ అనేది అసత్య ఆరోపణ అని అన్నారు.
చిన్నపిల్లల ఆరోగ్యం ఏవిధంగా మెరుగుపడుతుంది?, ఏ మందు మెరుగ్గా పనిచేస్తుందనే దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం రూ.2.54 కమిషన్ కోసం సిరప్‌ను ప్రిస్కిప్షన్ రాసివ్వడంతో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. కాగా, కోల్డ్రిఫ్ సిరప్‌ను తమిళనాడు కేంద్రంగా ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగిస్తున్న శ్రేషన్ ఫార్మాష్యూటికల్ తయారు చేసింది. ఈ సిరప్‌లొ డైథిలిన్ గ్లైకాల్ (Diethylene Glycol) అనే విషపూరిత రసాయనం పరిమితికి మించి ఉన్నట్టుగా ఉన్నట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ కెమికల్ కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణమయ్యే ముప్పు ఉంటుంది.
మరో షాకింగ్ విషయం ఏంటంటే, పసిపిల్లలు చనిపోయిన వ్యవహారంలో తాను ఉన్నట్టు తెలిసిన తర్వాత కూడా, నిర్లక్ష్యంగా ఈ సిరప్‌ను సూచించాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. చనిపోయిన 23 మంది చిన్నారుల్లో ఎక్కువమందికి ఇతడే సిరప్‌ను రాశాడని పేర్కొన్నారు. ఈ కేసులో డాక్టర్ సోనీతో పాటు శ్రేషన్ ఫార్మాష్యూటికల్ యజమాని రంగనాథన్‌ను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఆ కంపెనీని మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఇప్పటికే శ్రేషన్ ఫార్మాష్యూటికల్ కంపెనీ ఆఫీసులపై దాడులు చేపట్టంది.
Read Also- Suryapet Police: సామాన్యులకేనా.. నిబంధనలు పోలీసులకు వర్తించవా?
