Damodar Rajanarasimha: రాష్ట్రంలోని ప్రజలకు మరింత క్వాలిటీ వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రధానంగా పేషెంట్ల సంఖ్య అధికంగా ఉన్న 13 స్పెషాలిటీ విభాగాలను మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. నెఫ్రాలజీ, ఆంకాలజీ, ఆర్థోఫెడిక్, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆప్తమాలజీ, న్యూరాలజీ, జనరల్ సర్జరీ, పిడియాట్రిక్, గైనకాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ వంటి విభాగాలను ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్ట్రెంతెన్ చేయాలని భావిస్తున్నది. ఈ విభాగాలకు డాక్టర్లు సంఖ్యతో పాటు ఇతర స్టాఫ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా పెంచనున్నారు. దీంతో పాటు ఈ విభాగాలకు పీజీ సీట్లను కూడా పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
ఈ మేరకు సీట్ల సంఖ్యను పెంచాలని నేషనల్ మెడికల్ కమిషన్‌ను కూడా కోరనున్నది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ విభాగాలు మరింత స్ట్రాంగ్‌గా తయారైతే.. పేద ప్రజలకు క్వాలిటీ వైద్యం అందుతుందని సర్కార్ భావిస్తున్నది. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా(Minister Damodar Rajanarasimha) ఆదేశాలతో అధికారులు ఈ విభాగాలకు కావాల్సిన సౌకర్యాలు, స్టాఫ్, ఎక్విప్‌మెంట్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మిషన్లు, తదితర అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. ఇక నిమ్స్‌తో పాటు కొత్తగా అందుబాటులోకి రానున్న టిమ్స్ హాస్పిటల్స్‌లోనూ ఆయా విభాగాలను మరింత అడ్వాన్స్‌డ్‌గా తీర్చిదిద్దనున్నారు.
పేషెంట్లు.. డబ్బులూ ఎక్కువే?
గడిచిన ఐదేళ్లుగా ఆరోగ్య శ్రీ ద్వారా ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లిన వారి సంఖ్యే అధికంగా ఉన్నది. ప్రధానంగా పైన పేర్కొన్న 13 విభాగాలకు పేషెంట్ల రద్దీ అత్యధికంగా ఉన్నది. 2020–25 వరకు ఆరోగ్య శ్రీ ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ పొందిన పేషెంట్ల సంఖ్యను ప్రభుత్వం స్క్రీనింగ్ చేసింది. దీనిలో అత్యధికంగా కిడ్నీ పేషెంట్లు, క్యాన్సర్(Cancer), ఆర్థోపెడిక్(Orthopedic) సమస్యలు, గుండె సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. ఒక్కో ఏడాది ప్రభుత్వం నుంచి కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ (Private Hospitals) లో ఈ విభాగాల ట్రీట్మెంట్ నిమిత్తం ఏకంగా దాదాపు రూ.640 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. అంటే ఐదేళ్లలో సుమారు 3 వేల కోట్లకు పైనే చెల్లించాల్సి వచ్చింది. ఇవే డబ్బులతో ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తే సర్కార్‌కు మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు. దీని వలన పేదలకు అత్యధికంగా మేలు జరుగుతుందనే ప్రభుత్వం నమ్మకం.
Also Read: IRCTC Scam Case: బీహార్ ఎన్నికలకు ముందు.. లాలూ ఫ్యామిలీకి బిగ్ షాక్.. కోర్టు సంచలన ఆదేశాలు
గ్రామీణ ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం
రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళికలు రచిస్తున్నది. ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్ ద్వారా గ్రామీణా ప్రాంతాల్లోనూ క్వాలిటీ సేవలు అందనున్నాయి. ప్రధానంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఎముకల సమస్యలు, గుండె జబ్బుల బారిన పడుతున్న వారికి ఆర్థిక భారం తగ్గనున్నది. అత్యధికంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 104 ఉన్నాయి. వీటికి అదనంగా మరో 70 కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రతీ 25 కి.మీలకు ఒకటి చొప్పున కేంద్రాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక క్యాన్సర్ నిర్ధారణ, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి చికిత్సలు జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. యాక్సిడెంట్ కేసుల్లో వేగంగా వైద్యం అందించేందుకు ట్రామా కేర్ సెంటర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. గుండె జబ్బుల నిర్ధారణ, చికిత్స కోసం జిల్లా ఆసుపత్రుల్లో క్యాథ్ ల్యాబ్స్ వంటి అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి.
గడిచిన ఐదేళ్లుగా ప్రైవేట్, కార్పొరేట్‌లలో పేషెంట్లు(ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స 2020–25)
విభాగం పేషెంట్ల సంఖ్య
నెఫ్రాలజీ 3,63,197
ఆంకాలజీ 3,06,702
ఆర్థోపెడిక్ 1,91,852
కార్డియాలజీ 1,45,814
జనరల్ మెడిసిన్ 73,697
అప్తమాలజీ 57,639
న్యూరాలజీ/సర్జరీ 40,667
జనరల్ సర్జరీ 31,214
పిడియాట్రిక్ 28,924
గైనకాలజీ 9517
ఈఎన్ టీ 7251
గ్యాస్ట్రో ఎంట్రాలజీ 1636
ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ 1272
Also Read: Teachers Inspections: విద్యా రంగానికి సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
