Teachers Inspections: స్కూళ్లకు ఇక టీచర్ల ‘పరీక్ష’!
పాఠాలు చెప్పేవారే పరీక్ష పెడతారు!
టీచర్ల చేతిలో స్కూల్స్ క్వాలిటీ చెక్
విద్యా ప్రమాణాల పెంపుపై ఫోకస్
ప్రతి 3 నెలలకు 100 స్కూళ్లలో తనిఖీ
ప్రతివారం డీఈవోకు నివేదికలు, చర్యలు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తనిఖీలు (Teachers Inspections) చేపట్టాలని నిర్ణయించింది. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఇకపై స్కూళ్ల తనిఖీల బాధ్యతను టీచర్లకే అప్పగించారు. తనిఖీల కోసం జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ టీచర్ల ఎంపిక ప్రక్రియలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డీఈవో, కలెక్టర్ నియమించిన మరో అధికారి సభ్యులుగా ఉంటారు. తనిఖీకి వెళ్లే టీచర్‌కు కనీసం పదేళ్ల సీనియారిటీ ఉండాలి, సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌కు హాజరై ఉండాలనే నిబంధనలను విద్యాశాఖ తప్పనిసరి చేసింది. ప్రతి మూడు నెలలకోసారి ఈ బృందాలు కనీసం 100 పాఠశాలల్లో తనిఖీ చేయాల్సి ఉంటుంది.
Read Also- Ind Vs WI: ఐదవ రోజుకు చేరిన రెండో టెస్ట్.. భారత్ గెలుపునకు సమీకరణం ఏంటంటే?
స్కూల్ స్థాయిని బట్టి..
తనిఖీ బృందాలను పాఠశాల స్థాయిని బట్టి ఏర్పాటు చేశారు. ప్రైమరీ స్కూళ్ల తనిఖీ బృందంలో ముగ్గురు సభ్యులు ఉంటారు, ఇందులో ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ నోడల్ ఆఫీసర్‌గా, ఇద్దరు ఎస్జీటీలు మెంబర్లుగా ఉంటారు. అప్పర్ ప్రైమరీ స్కూళ్ల తనిఖీలోనూ ముగ్గురికి చోటు కల్పించగా, స్కూల్ అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. హైస్కూళ్ల విషయంలో ఏకంగా 9 మందితో కూడిన టీమ్ ఉంటుంది. గెజిటెడ్ హెడ్‌మాస్టర్ నోడల్ ఆఫీసర్‌గా ఉండగా, ఏడుగురు టీచర్లు (లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్), ఒక స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) మెంబర్లుగా ఉంటారు.
Read Also- Mallu Ravi: గద్వాల్ భవిష్యత్తుకు బలమైన హామీలు.. ఎంపీ మల్లురవి కీలక నిర్ణయాలు
అకడమిక్ అంశాలకే..
తనిఖీకి వెళ్లే బృందాలు ప్రధానంగా అకడమిక్ అంశాలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నాయి. టీచర్లు పాఠాలు ఎలా బోధిస్తున్నారు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందా? లేదా? అనే అంశాలపైనే ప్రధానంగా దృష్టిసారించనున్నారు. దీంతో పాటు మౌలిక సదుపాయాలు, ఇతర ఇబ్బందులపై కూడా ఆరా తీసే అవకాశముంది. హైస్కూళ్ల తనిఖీ బృందాలు ప్రతి వారం డీఈవోకు నివేదిక పంపించాల్సి ఉంటుంది. డీఈవోలు ఆ వివరాలను విద్యాశాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేస్తారు. ఈ నివేదిక ఆధారంగా విద్యాశాఖ తగు చర్యలు తీసుకోనుంది. తెలంగాణలో మొత్తం ప్రైమరీ స్కూళ్ల సంఖ్య 16,474 ఉన్నాయి. కాగా, ప్రతి మూడు నెలలకు 100 స్కూళ్ల చొప్పున 168 బృందాలు తనిఖీ చేయనున్నాయి. అప్పర్ ప్రైమరీ స్కూళ్లు రాష్ట్రంలో 3100 ఉండగా వీటి తనిఖీకి 35 బృందాలు వెళ్లనున్నాయి. తెలంగాణలో మొత్తం హైస్కూళ్లు 4672 ఉండగా వీటి తనిఖీకి 96 బృందాలు వెళ్తాయి.
