Gadwal District: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచిత ఇసుక పంపిణీని ఇసుక రీచ్ దగ్గర స్థానిక అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం తుమ్మిళ్ళ దగ్గర టిప్పర్లు నిలిచిపోయినా, సంబంధిత అధికారులు స్పందించకపోవడం దారుణమని వారు వాపోతున్నారు. గూడు లేని పేద ప్రజలకు ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి 10 ట్రాక్టర్ల వరకు ఉచిత ఇసుకను (రవాణా చార్జీలు మాత్రమే చెల్లిస్తూ) ‘మన ఇసుక వాహనం’ పేరిట సరఫరా చేస్తుంది.
Also Read: Gadwal Collector: అన్నదాతలు ఆర్థికంగా ఎదిగేందుకు అధికారులు కృషి చేయాలి : కలెక్టర్ బి. ఎం. సంతోష్
కమిషన్ల కోసమే ఇసుక వాహనాలను అడ్డుకుంటున్నారు
ఇలా ప్రభుత్వ అనుమతులతో ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను స్థానిక నాయకులు అడ్డుకోవడం శోచనీయమని వాహనదారులు పేర్కొన్నారు. స్థానిక ప్రతిపక్ష నాయకులు, వాహనదారుల ఆరోపణల ప్రకారం ఏఐసీసీ కార్యదర్శి సూచనతో ఆయన అనుచరులు కమిషన్ల కోసమే ఇసుక వాహనాలను అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. గతంలో సైతం తమ వాహనాలు నడపాలని షరతు విధించారని, ఐదు వాహనాలకు జీరో బిల్లింగ్ ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలి మండలంలోని పంట పొలాలను కలుషితం చేసే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతులు జైలు పాలైతే పట్టించుకోని సంపత్ కుమార్, నేడు పేదల ఇళ్ల నిర్మాణాలకు సరఫరా చేసే ఇసుక వాహనాలను నిలిపివేయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు.
గ్రామ యువకుల అభ్యంతరం
ఇసుక రీచ్ సమీపంలోని తుమ్మిల గ్రామ యువకులు కూడా ఇసుక రీచ్ దగ్గరికి వచ్చి పేద ప్రజలకు రవాణా ఇసుకను అడ్డుకోవడం బాధాకరమన్నారు. గతంలో అధికార పార్టీ నాయకులు రవాణా చేస్తూ రోడ్లు దెబ్బతిన్నా పట్టించుకోని వారు, నేడు పేదల ఇళ్లకు సరఫరా చేసే ఇసుకను అడ్డుకోవడం తగదన్నారు. ఈ అడ్డంకుల వల్ల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌ను కలిసి సైతం ఫిర్యాదు చేస్తామని వాహనదారులు తెలిపారు.
Also Read: Gadwal District: ఈ ఎరువులతో పంటలకు జీవం.. వరి సాగులో ఆ జిల్లానే ప్రథమ స్థానం
