NBK-Ministry
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Nandamuri Balakrishna: బాలకృష్ణకు ‘మంత్రి పదవి డిమాండ్’.. చంద్రబాబు ఒప్పుకోగలరా?.. సమీకరణలు ఇవేనా?

Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక స్థానమున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు (Nandamuri Balakrishna) మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఊహించని, అధికార టీడీపీని అంతర్మథనానికి గురిచేసే పరిణామం ఒకటి సోమవారం చోటుచేసుకుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం, హిందూపురం  నియోజకవర్గానికి వెళ్లిన బాలయ్యకు తెలుగు తమ్ముళ్లు వినూత్న నిరసన తెలిపారు. ‘మంత్రివర్గంలో బాలకృష్ణకు చోటు ఇవ్వాలి. మంత్రి పదవి ఇవ్వాలి’ అనే డిమాండ్లతో  ప్లకార్డులు ప్రదర్శించారు. స్వయంగా బాలకృష్ణకే తమ నిరసన సెగ తెలియజేశారు. హిందూపురంలో బాలయ్య కాన్వాయ్‌కి అడ్డు కూడా తగిలారు. పార్టీ శ్రేణులు, అభిమానుల డిమాండ్లను దగ్గర నుంచి చూసిన బాలయ్య, కారు దిగి నవ్వారు. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. నిజానికి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఇప్పుడే కొత్తగా తెరపైకి వచ్చింది కాదు. కొన్నాళ్లుగా ఈ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా గతేడాది ఎన్నికల ఫలితాల తర్వాత బాలయ్యకు మంత్రి పదవి ఖరారైనట్టుగా ఊహాగానాలు గుప్పుమన్నాయి. నిజరూపం దాల్చలేదు.

కొత్తగా డిమాండ్‌ వెనుక కారణం అదేనా?

ఎమ్మెల్యే బాలకృష్ణ ఇటీవల ఏపీ అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి పరుష పదజాలంతో మాట్లాడడం, అది తీవ్ర వివాదానికి దారితీసిన పరిణామాలు తెలిసినవే. అయితే, అదే సందర్భంలో బాలయ్య మాట్లాడుతూ, ‘‘ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి నాకు కూడా ఆహ్వానం అందింది. అందులో నాది 9వ పేరు. ఈ విషయాన్ని గౌరవ సినిమాటోగ్రపీ మంత్రి కందుల దుర్గేశ్‌ను కూడా అడిగాను. ఏం… మనం ఏమన్నా ప్రతిపక్షంలో ఉన్నామా!’’ అని బాలకృష్ణ అసహనంతో మాట్లాడారు. సభ సాక్షిగా బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు అసంతృప్తితో కాదని, వాటి వెనుక  ఆవేదన దాగివుందని అభిమానులు చెబుతున్నారు. ముఖ్యంగా, చిరంజీవి ఫ్యాన్స్, వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించడంతో ‘ మా బాలయ్యకు ఇదేం ఖర్మ, మంత్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తికి ఈ అవమానాలేంటి?’ అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రెండు మూడు వారాలక్రితం సోషల్ మీడియా వేదికగా ఈ తరహా పోస్టులు పెద్ద సంఖ్యలోనే కనిపించాయి. ఆయనకు తగిన స్థానం, గౌరవం దక్కడం లేదనే అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఈ పోస్టులు పెట్టారు.

Read Also- Heavy Rains: దీపావళికి ముందు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

డిమాండ్లను చంద్రబాబు పరిశీలిస్తారా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ కొడుకు.. చంద్రబాబుకు బావ అనే కోణాలను పూర్తిగా పక్కకు పెట్టేస్తే.. టీడీపీలో మంత్రి పదవికి అర్హత ఉన్న నేతల పేర్లను వడపోస్తే, ఆ జాబితాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తప్పనిసరిగా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు. 2014, 2019, ఆ తర్వాత ముచ్చటగా మూడోసారి 2024లో హిందూపురం నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో వరుస విజయాలు సాధించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముందుంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలోనైతే, పార్టీ కార్యకర్తలను క్రియాశీలకం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అండగా నిలబడ్డారు. అంతేకాదు, పార్టీ శ్రేణుల్లో ఆయన ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. ఈ విషయాలను పార్టీ కార్యకర్తలు గమనిస్తున్నారు కాబట్టే, బాలకృష్ణకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన చెందుతున్నట్టుగా ప్రస్తుత డిమాండ్లను పరిగణించవచ్చు.

బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్‌ ఒక్క హిందూపురానికే పరిమితం అవుతుందని భావించలేం. మరో వేదిక, ఇతర సందర్భాల్లో వినపడే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి, పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఈ డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటారా?, పరిశీలిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇటు జనసేన, అటు బీజేపీని కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, మంత్రి పదవిపై నిర్ణయం అంత ఆషామాషీగా జరగదని మాత్రం ఊహించవచ్చు. ఎమ్మెల్సీ నాగబాబు వ్యవహారాన్నే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొనవచ్చు. నాగబాబుకు మంత్రి పదవి వచ్చేసినట్టేనని, రేపో మాపో ప్రమాణస్వీకారం చేయబోతున్నారంటూ ఊహాగానాలు గట్టిగానే వచ్చాయి. వాస్తవరూపం దాల్చకపోవడానికి అసలైన కారణం ఏంటో తెలియదు గానీ, ప్రస్తుతానికి ఎలాంటి కదలిక లేదు.

మొత్తానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలచుకుంటే బాలయ్యకు మంత్రి పదవి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చేమో, కానీ, కూటమి లెక్కలు, సమీకరణాల మధ్య ఇప్పటికిప్పుడు అది జరిగే పనిలా కనిపించడం లేదని, అంత తేలికైన విషయం కాదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.  మరి, టీడీపీ కేడర్‌ డిమాండ్‌ను చంద్రబాబు, నారా లోకేశ్ ఏవిధంగా రిసీవ్ చేసుకుంటారు?, శ్రేణులను ఎలా బుజ్జగిస్తారనేది చూడాలి.

Read Also- IRCTC Scam Case: బీహార్ ఎన్నికలకు ముందు.. లాలూ ఫ్యామిలీకి బిగ్ షాక్.. కోర్టు సంచలన ఆదేశాలు

Just In

01

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?

Aryan second single: విష్ణు విశాల్ ‘ఆర్యన్’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. చూసేయండి మరి..