MLC Kavita backlash in liquor scam
Politics

King Pin MLC Kavita : కింగ్ పిన్ కవితే..!

Delhi Liquor Scame King Pin Kavita : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అన్నీ తానై వ్యవహరించి డీల్‌ను ముందుకు నడిపించారని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో కుట్రదారు, ప్రధాన లబ్దిదారు కూడా ఆమేనని ఈడీ నివేదిక తేల్చిచెప్పింది. ఇప్పటివరకు తాము జరిపిన విచారణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. స్పష్టమైన పథకం ప్రకారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారని సాక్షాధారాలతో రుజువైందని ఈడీ తన కస్టడీ నివేదికలో స్పష్టం చేసింది. కవిత అనుచరుడు బోయినపల్లి అభిషేక్‌ రావు సూచనల మేరకు దినేశ్‌ అరోరా కార్యాలయం నుంచి తాను 2 పెద్ద గోనెసంచుల్లో డబ్బును తీసుకెళ్లి వినోద్‌ చౌహాన్‌ అనే వ్యక్తికి అప్పగించినట్లు కవిత వ్యక్తిగత సిబ్బంది విచారణలో అంగీకరించారు. మరో సందర్భంలో దిల్లీ నారాయణ తోడాపూర్‌ సమీపంలోని చిరునామాకు రెండు గోనె సంచుల్లో డబ్బును తీసుకెళ్లి వినోద్ చౌహాన్‌కు అందించినట్లు కూడా సిబ్బంది ఈడీకి తెలిపారు. ఈ సొమ్మునే వినోద్‌ చౌహాన్‌ హవాలా మార్గంలో గోవాలో ఆప్‌ ఎన్నికల ఖర్చుల కోసం పంపినట్లు ఈడీ విచారణలో తేలింది.

నివేదిక ఇదీ..

‘ఢిల్లీ కేంద్రంగా జరిగిన మద్యం కుంభకోణంలో అత్యంత కీలక సూత్రధారుల్లో కవిత ఒకరు. అంతేగాక ఈ కేసులో ఆమె ప్రధాన కుట్రదారుగానే గాక లబ్ధిదారు గానూ ఉన్నారు. ఆమె మాటమేరకే శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డితో కలిసి ఆప్ నేతలకు రూ.100 కోట్లు లంచంగా అందజేశారు. మార్జిన్ మనీని 12 శాతానికి పెంచి.. అందులో సగం ముడుపుల రూపంలో ఆ మొత్తాన్ని ఆప్ నేతలకు అందజేశారు. అంతేగాక, లిక్కర్ కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు, జాప్యం చేయడానికి అనేక తప్పుడు కేసులను ఆమె దాఖలు చేశారు. సమన్లు జారీచేసిన తర్వాత ఆమె తన 4 ఫోన్లలోని డేటాను ఫార్మాట్ చేశారు. నేరుగా కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో ఒప్పందం కుదుర్చుకుని, ప్రభుత్వం తాను లబ్దిపొందేలా నిబంధనలు ఉండేలా చేశారు. అరుణ్ పిళ్లై అనే వ్యక్తిని బినామీగా చూపుతూ ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారు. అంతేగాక, డిల్లీలో మద్యం వ్యాపారం కోసం కవిత తనను సంప్రదించారని.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనతో చెప్పినట్లు మాగుంట రాఘవ రెడ్డి ఈడీకి స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చారు’ అని కస్టడీ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

Read More: ప్రజా పాలనకే పునరంకితం..!

పాలసీనే మార్చేశారు..

కొత్త లిక్కర్ పాలసీ పేరుతో ఢిల్లీ ప్రభుత్వం భారీగా మద్యం షాపుల లైసెన్సుల జారీ చేయటమే గాక పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్‌ హోల్‌సేల్‌ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్‌ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. చూసేవారికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. ఈ పాలసీ రూపకల్పనలో కవిత బృందం కీలకంగా పనిచేసింది. దీనికోసం ఆమె రూ. 100 కోట్లు లంచమిచ్చారు. అలాగే కవిత బినామీ అరుణ్‌రామచంద్రపిళ్లైకి ఇండోస్పిరిట్‌లో ఎలాంటి పెట్టుబడి లేకుండానే భాగస్వామ్యంతోపాటు మద్యం ఉత్పత్తిలో దేశంలోనే పేరొందిన పెర్నాడ్‌రికార్డ్‌ సంస్థలో డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం దక్కింది. ఈక్రమంలోనే 2021-22 దిల్లీ మద్యం పాలసీలో ఎల్‌1గా నిలిచిన ఇండోస్పిరిట్‌కు అత్యధిక లాభాలు దక్కాయి. మద్యం పాలసీలో హోల్‌సేలర్లకు లాభాలవాటాను 12శాతానికి పెంచడం ద్వారా తన సౌత్‌గ్రూప్‌నకు కవిత బృందం లబ్ధి చేకూరేలా చూసుకొని, ఆ లాభాల్లోంచి ఆప్‌ నేతలకు లంచాలిచ్చారు. దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్‌ వ్యక్తులు/ సంస్థలకు అప్పగించింది.

హైదరాబాద్ కేంద్రంగానే డీల్..

కవిత బృందానికి అనుకూల విధానల రూపకల్పన కోసం 2021 మార్చి19న కేజ్రీవాల్‌, మనీశ్‌ సిసోదియా ప్రతినిధి విజయ్‌నాయర్‌ హైదరాబాద్‌‌లో కవిత బృందాన్ని కలిశారు. సరిగ్గా ఆయన హైదరాబాద్ వచ్చిన రెండు రోజులకే అంటే.. మార్చి 22న మద్యం విధానం నివేదికకు ఆప్ ప్రభుత్వం తుదిరూపం ఇచ్చింది. ఈ విషయాలన్నీ ఆ మరుసటి రోజు హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్‌ బుచ్చిబాబు ఫోన్‌లో వాట్సప్‌ ఛాటింగ్‌ల విశ్లేషణలో బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అటు కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ రంగంలోకి దిగాయి.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు