Redesignation Of Public Governance: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు. ‘మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ గత తెలంగాణ ఎన్నికల వేళ ప్రజల ముందుకు వెళ్లిందని, ప్రజలు కాంగ్రెస్‌ను విశ్వసించి తెలంగాణలో అధికారమిచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల వేళ ప్రజలకు ఆరు గ్యారంటీలు ఇచ్చామని, ప్రభుత్వ ఏర్పాటు జరిగిన వెంటనే హామీల అమలుపై దృష్టి పెట్టామని గుర్తుచేశారు. గత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ అన్నివిధాలా నష్టపరచారని, గత పాలనలోని తప్పిదాలను ఒక్కొక్కటీ పరిష్కరిస్తూ ఓపికగా ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
‘తన పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను వందేళ్లకు సరిపడా నష్టపరచింది. తెలంగాణను పూర్తిగా అప్పుల ఊబిలోకి దింపింది. నాటి సీఎం దర్శనమే గొప్ప భాగ్యమన్న వాతావరణం ఉండేది. మా వంద రోజుల పాలనలో పూర్తిగా ప్రజలతో మమేకమయ్యాం. ఈ 100 రోజుల అనుభవం సంపూర్ణ సంతృప్తినిచ్చింది. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే తొలి హామీ అమలు చేశాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇళ్ల పథకాన్ని ప్రారంభించాం. గత 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాం. గత భారాస ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీని అవినీతికి అడ్డాగా మార్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన చేపట్టాం. ఉచిత విద్యుత్ హామీ అమలులో భాగంగా 38 లక్షల జీరో బిల్లులు అందజేశాం. ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు లక్ష్యంగా పనిచేశాం. పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించి.. ఆదాయాన్ని స్థిరీకరించాం’’ అని అన్నారు. అధికార భాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రోజుకు 18 గంటల పాటు నిర్విరామంగా పనిచేశానని, ఈ వంద రోజుల్లో ప్రజలు అందించిన సహకారం, సానుభూతి మరువలేనని, ఆరు నూరైనా ఇచ్చిన హామీలను చిట్టచివరి లబ్దిదారుడి వరకు చేర్చుతామని హామీ ఇచ్చారు. ఈ వందరోజుల పాలనా కాలంలో ఇప్పటివరకు తెలంగాణలో 8 లక్షలమందికి రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందించామని, 37 లక్షల మందికి జీరో కరెంటు బిల్లు అందించగలిగామన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని హామీల అమలు ఆగిందని వివరించారు.
Read More: నేతల దారులన్ని తెలంగాణ కాంగ్రెస్ వైపే..
ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారంపైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇంత నాటకీయ పరిణామాల మధ్య కుమార్తె కవితను అరెస్టు చేసి ఎకాఎకి ఢిల్లీ తీసుకుపోయినా, ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ఇంకా నోరుతెరవకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కవితను పార్టీ సభ్యురాలిగా కేసీఆర్ భావించటం లేదేమోనన్నారు. అటు హైదరాబాద్‌లో ఉన్న ప్రధాని సైతం దీనిపై స్పందించలేదన్నారు. కేసీఅర్, మోదీ మౌనం వెనక మతలబు ఏమిటని రేవంత్ రెడ్డి నిలదీశారు. వీరిద్దరూ కలిసి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, ఇకనైనా వీటిని ఆపాలన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు ఇదంతా అని చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కాంపై ఇటు కేసీఆర్ కుటుంబం, అటు కేంద్రం టీవీ సీరియల్ తరహా డ్రామాను నడుపుతున్నారని, సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ ముందు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆమెను అరెస్టు చేయటం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ కలసి ఆడుతున్న నాటకాన్ని తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారన్నారు. గతంలో ముందు ఈడీ వచ్చాక, తర్వాత మోడీ వచ్చేవారనీ, నిన్నమాత్రం ఈడీ, మోడీ ఇద్దరూ కలిసే వచ్చారని సెటైర్ వేశారు. తెలంగాణను అవమానించిన మోదీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు’’ అని రేవంత్ మండిపడ్డారు.