Monkeys Attack: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో వానరాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. నిత్యం ఎవరో ఒకరికిపై దాడి చేస్తుండడంతో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. గత వారం రోజుల్లో ఒకే కాలనికి చెందిన ఏడుగురిపై కోతులు దాడి చేశాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోతుల బారి నుండి కాపాడాలని ఎన్ని సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కోరిన పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే కోతుల బారి నుండి తమను కాపాడతారో వారికే ఓటేసి గెలిపిస్తామని పట్టణవాసులు తెగేసి చెబుతున్నారు.
వందల సంఖ్యలో కోతులు..
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని మామిండ్లవాడ, పోచమ్మ కాలనీ, గొల్లవాడ, ప్రతాపవాడ, విద్యానగర్, సూపర్ బజార్ ప్రాంతాల్లో కోతుల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. గతంలో పదుల సంఖ్యలో ఉన్న కోతులు ఇప్పుడు వందల సంఖ్యకి చేరి పట్టణంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. కూరగాయలు, కిరాణా షాపులు, ఇండ్లలో చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇండ్లు పీకి పందిరి వేస్తున్నాయి. చేతిలో ఏదైన వస్తువు ఉంటే దాడి చేసి మరి లాక్కుంటున్నాయి. ఒకటి, రెండు కోతులు కాకుండా మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నాయి.
ఒకే కాలనీలో ఏడుగురిపై దాడి..
గతంలో కోతుల దాడి కారణంగా ఒక వ్యక్తి మరణించిన సంఘటన కూడా ఇదే ప్రాంతంలో చోటు చేసుకుంది. గత వారం రోజుల నుండి ఒకే కాలనికి చెందిన ఏడుగురిపై వానరాలు దాడికి పాల్పడ్డాయి. కోతుల బాధకు ఇంట్లో నుండి బయటికి రావాలంటేనే పట్టణవాసులు భయపడుతున్నారు. అంతే కాకుండా కోతులు కరిచినప్పుడు హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఇంజెక్షన్ లు లేక ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. మరోవైపు గాయాల తీవ్రతను బట్టి బాధితులను జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్నట్లు హుజూరాబాద్ ఆస్పత్రి సూపరిండెంట్ తెలిపారు.
Also Read: Bigg Boss Promo: తెరపైకి పవర్ అస్త్రా.. టెన్షన్‌లో కంటెస్టెంట్స్.. బిగ్ బాస్‌లో ఏం జరగబోతోంది?
కోతులను తరమండి.. ఓట్లను అడగండి
అయితే కోతుల బెడద నుండి తమను కాపాడాలని ఎన్నోసార్లు అధికారులను మెురపెట్టుకున్నట్లు స్థానిక ప్రజలు చెబుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్ని దరఖాస్తులు చేసుకున్న ఫలితం మాత్రం లేదని వాపోయారు. మాయ మాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నారు తప్ప తమ బాధలు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ సారి కోతుల బారి నుండి కాపాడిన వారికే ఓట్లు వేసి గెలిపించుకుంటామని పట్టణవాసులు స్పష్టం చేస్తున్నారు.
