BRS Vs Congress: ఇంటింటికీ బాకీ కార్డులు పంపిణీ
గ్రేటర్‌లో బస్సు ఛార్జీల పెంపుపై ఛలో బస్సు భవన్
గ్రూప్ -1పై నిరుద్యోగులతో భేటీ
స్లమ్ ఏరియా ప్రజలతో భేటీలు
ప్రభుత్వ వైఫల్యాలపై మీడియా వేదికగా విమర్శలు
ఉపఎన్నికల్లో గెలుపు కోసం ఆరోపణలకు పదును
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టూ బీఆర్ఎస్ పార్టీ రాజకీయం మొదలైంది. ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఉపఎన్నికల్లో విజయం సాధించి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ప్రభుత్వం ప్రజలకు 22 నెలల్లో బాకీపడిందని, మహిళలకు నెలకు రూ.2500 చొప్పున ఇప్పటికి రూ.55 వేలు ఇవ్వాలంటూ ప్రచారం చేస్తోంది. ఇక, వృద్దులకు 4వేల చొప్పున మొత్తం రూ. 44 వేలు, వికలాంగులకు 6వేల చొప్పున రూ.44 వేలు, ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాల్సి ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ఇచ్చిన డోఖాకు బదులు తీర్చుకునే సరైన మోకా తెలంగాణ ప్రజకు వచ్చిందని వివరిస్తున్నారు. ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బకాయిపడిందో అడగడానికే ఈ బాకీ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు నేతలు చెబుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి కార్డులు పంపిణీ (BRS Vs Congress) చేస్తున్నారు.
Read Also- Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. నర్సింగ్ స్కూల్స్ దందాపై విచారణ.. తనిఖీలకు ఆదేశించిన డీఎంఈ
మరోవైపు జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగులు ఉండటంతో గ్రూప్-1లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పరీక్ష రాసిన విద్యార్థులతో భేటీ అయ్యారు. మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. మరోవైపు నియోజకవర్గంలో ఉన్న యువతతోనూ భేటీలు నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లు వివరిస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాల హామీని విస్మరించిందని విస్తృత ప్రచారం చేస్తున్నారు. అదే విధంగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను గ్రేటర్ రూ.10 పెంచడంతో దానిపైనా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ప్రభుత్వ తీరును ఎండగట్టిన విధానాన్ని సైతం జూబ్లీహిల్స్‌లో వివరిస్తున్నారు. అంతేకాదు, గ్రేటర్ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉందనే మన్ననలు పొందే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
నియోజకవర్గంలో ఎక్కువగా స్లమ్ ఏరియాలు ఉండటంతో ఆయా ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేశారు. స్థానిక నేతలు, కార్పోరేటర్లతో కలిసి పర్యటిస్తున్నారు. సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు స్థానిక నేతలు వాటిని పరిష్కరించాలని వారికి అండగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. వారు నిత్యం అందుబాటులో ఉండాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం సైతం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఓటర్ ను కలిసేలా ప్లాన్ చేశారు. రాష్ట్రంలోని సమస్యలు వదిలి కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే పరిమితం కావడం ఇప్పుడు పార్టీలోనూ చర్చజరుగుతుంది. ఎందుకు ఆ నియోజకవర్గంను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. డివిజన్లకు ఇన్ చార్జులను నియమించడం పార్టీ అధిష్టానం మానిటరింగ్ చేయడం.. అసలు ఇంత కష్టపడి పార్టీని గెట్టెక్కిస్తారా? చతికిలపడతారా? అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
