Mahesh Kumar Goud: బీఆర్ఎస్ ప్రభుత్వం విధించిన 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్ వలనే బీసీలకు 42 శాతం అమలు కష్టతరంగా మారిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(PCC Mahesh Kumra Goud) వ్యాఖ్యానించారు. ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోర్టు, చట్టాలను నమ్ముతుందన్నారు. హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై స్టే ఇవ్వడంపై స్పందించారు. కోర్టు తీర్పు డాక్యుమెంట్ కాపీలు వచ్చిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బీసీ(BC)లకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేని బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) నోటికాడి ముద్దలాగుతున్నాయన్నారు. తాము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి చిత్తశుద్దితో అనేక కార్యక్రమాలు చేశామని చెప్పారు.
బ్రిటిష్ కాలంలో చేసిన కుల సర్వే..
కాంగ్రెస్(Congress) పార్టీ చిత్తశుద్దితో పని చేసినందునే, బ్రిటిష్ కాలంలో చేసిన కుల సర్వే తర్వాత దేశంలో మొదటిసారి తెలంగాణలో శాస్త్రీయబద్ధంగా సర్వే నిర్వహించామన్నారు. ఏడాదిన్నర కాలంగా ఎన్నికలు జరగాల్సి ఉన్నా రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సీఎం, క్యాబినెట్, పార్టీ అంతా ఢిల్లీ వెళ్లి ధర్నా చేశామని గుర్తు చేశారు. బీసీ సంఘాలు, కుల సంఘాలు ధర్నా చేస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తమ సీనియర్ నాయకులు వీహెచ్ లాంటి వారు హైకోర్టులో ఇంప్లీడ్ అయితే బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) నేతలు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.
Also Read: Raghunandan Rao: ఎంఐఎం జూబ్లీహిల్స్‌లో ఎందుకు పోటీ చేయట్లేదు?.. రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు
స్టే ఊహించలేదు..
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇస్తుందని తాము ఊహించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) తెలిపారు. బుధవారం హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై చాలా పాజిటివ్‌గా వాదనలు జరిగాయని, బెంచ్ కూడా కన్విన్స్ అయిందన్నారు. గురువారం కూడా అడ్వకేట్ జనరల్ వాదనలను చీఫ్ జస్టిస్ పాజిటివ్‌గా స్వీకరించారన్నారు. కానీ, సడన్‌గా స్టే ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించామన్నారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి, డెడికేటెట్, సబ్ కమిటీ వేసి క్యాబినెట్ ఆమోదంతో పాటు శాసన సభలో చట్టం చేసి గవర్నర్‌కు పంపించామన్నారు. 2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ కూడా చేశామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ అని వివరించారు.
Also Read: Jamaat-ul-Mominaat: మసూద్ మాస్టర్ ప్లాన్.. భారత్‌పైకి మహిళా ఉగ్రవాదులు.. ఆత్మాహుతి దాడులకు కుట్ర!
