BC-Reservations
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BC Reservations: ఇప్పుడేం చేద్దాం?.. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ కసరత్తు ప్రారంభం

BC Reservations: లీగల్ టీమ్‌తో సర్కార్ చర్చలు

ఉత్కంఠగా మారిన రిజర్వేషన్ల వ్యవహారం
కోర్టు ఆదేశాలు పాటిస్తామన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్
ప్రభుత్వ ఆదేశాల కోసం పంచాయతీరాజ్ ఎదురుచూపు
మళ్లీ గ్రామ వార్డు నుంచి, జడ్పీ వరకు రిజర్వేషన్ల ప్రక్రియ?
ఆశావాహుల్లో నిరాశ.. బీసీల్లో ఆందోళన!

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) హైకోర్టు స్టే ఇవ్వడం, 6 వారాలపాటు విచారణను వాయిదా వేయడంతో తదుపరి ఏం చేయాలదానిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎలా ముందుకు పోదాం.. స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిద్దాం.. రిజర్వేషన్లను ఎలా అమలు చేద్దాం.. బీసీ వర్గాలకు ఏం చెబుదాం.. కోర్టుకు ఇంకా ఏయే అంశాలను అందజేద్దాం.. అనే అంశాలపై సుదీర్ఘంగా మంతనాలు ప్రారంభించింది. లీగల్ టీమ్‌తో సర్కార్ చర్చలు ప్రారంభించింది. కోర్టులో ఎలా వాదనలు వినిపించాలి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాకపోతే చేయాల్సి అంశాలపై సీనియర్ న్యాయవాదుల నుంచి సలహాలు తీసుకుంటుంది. మరోవైపు రాష్ట్రంలోని బీసీ మంత్రులు, నేతల అభిప్రాయాలను సైతం సేకరిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన అమలు చేయాలి, హామీని ఎలా నిలబెట్టుకోవాలనేదానిపై న్యాయచట్టంలోని అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. హైకోర్టు జీవో9పై స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే ఎలా ఉంటుందనే అంశంపైన అధ్యాయం చేస్తున్నారు. లేకుంటే, హైకోర్టు ఇచ్చిన గడువు వరకు వేచిచూస్తే ఎలా ఉంటుంది?, అలాకాకుండా గతంలో 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే అంశాలను సైతం సర్కార్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Read Also- Shivadher Reddy: ఇలా ఉండండి.. రాష్ట్ర పోలీసులకు కొత్త డీజీపీ శివధర్ రెడ్డి మార్గనిర్దేశనం

ఇదిలావుంచితే, రాష్ట్ర ఎన్నికల సంఘం గత నెల 29న స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది. 5 విడుతలుగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినట్లుగా గురువారం ఉదయం నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. తొలి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా ఆశావాహులు నామినేషన్ సైతం వేశారు. జడ్పీటీసీకి 16 నామినేషన్లు, ఎంపీటీసీకి సైతం 103 మంది నామినేషన్లు వేశారు. అయితే రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడంతో న్యాయస్థానం మార్గదర్శాకాలను పాటిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది.

ప్రభుత్వం స్థానిక ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పంచాయతీరాజ్ శాఖ సైతం ఎదురుచూస్తోంది. సర్కార్ సూచనలతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది, ఒక వేళ గతంలో ఇచ్చిన మాదిరిగానే 23శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే మళ్లీ గ్రామస్థాయిలో వార్డు, సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీ వరకు అన్ని రిజర్వేషన్లు సమీక్ష  చేయాల్సి ఉంటుంది. దీంతో మరికొంత ఎన్నికలు ఆలస్యం జరిగే అవకాశం లేకపోలేదు. కోర్టు సైతం 6 వారాలు విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో ఈ మధ్య సమయం ఉండటంతో ప్రభుత్వం 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ముందుకెళ్తుందా? అలా వెళ్తే మళ్లీ రిజర్వేషన్లు చేయిస్తుందా? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also- Canara Bank Recruitment 2025: కెనరా బ్యాంక్ లో జాబ్స్.. వెంటనే, అప్లై చేయండి!

మరోవైపు 42 శాతం రిజర్వేషన్లతో గ్రామాల్లో పోటీ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, హైకోర్టు రిజర్వేషన్ల జీవోపై స్టే ఇవ్వడం, ఎన్నికలు సైతం వాయిదా పడటంతో ఆశావాహుల్లో నిరాశ నిస్పృహలు ఆవహించాయి. పోటీకి చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నవారికి స్టే విధింపుతో కొంత నిరాశకు గురవుతున్నారు. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు రిజర్వేషన్లు దోహదపడతాయని అంతా భావించారు. అయితే రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?