Shivadher Reddy: శాంతిభద్రతల పరిరక్షణే పరమావధి కావాలి
అధికారులకు డీజీపీ శివధర్ రెడ్డి దిశా నిర్ధేశం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ప్రజల సంరక్షణే పరమావధిగా ప్రతీ ఒక్క పోలీసు అధికారి విధులు నిర్వర్తించాలని డీజీపీ శివధర్ రెడ్డి (Shivadher Reddy) సూచించారు. నిష్పాక్షికత, ధృఢ నిశ్చయంతో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేయాలన్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గురువారం అదనపు డీజీపీలు, పోలీస్ కమిషనర్లు, జిల్లాల సూపరిండింటెంట్లు, డీసీపీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చట్టం ముందు అందరూ సమానమేనన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సమస్యలతో వచ్చేవారికి ఎలాంటి పక్షపాతం లేకుండా న్యాయాన్ని అందించాలని చెప్పారు. శాంతిభద్రతలను పరిరక్షించే విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోపాటు అవసరమైన వారికి సకాలంలో న్యాయం చేయగలిగినపుడే ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరుగుతుందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటంతో పాటు బేసిక్ పోలీసింగ్‌ను కూడా పక్కగా అమలు చేయాలని చెప్పారు.
Read Also- Drug Racket: భారీ డ్రగ్ రాకెట్ బయటపెట్టిన హైదరాబాద్ పోలీసులు.. వామ్మో ఇంత విలువైనవా?
బీట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్, సర్వైలెన్స్, సమాచార సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. దాంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలని సూచించారు. నేరాలకు సంబంధించిన గణాంకాలతో పోలీసింగ్ ఎలా ఉందన్న దానిని కొలవలేమని శివధర్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసుల పనితీరుపై ప్రజల్లో నమ్మకం, సంతృప్తి పెరిగినపుడే సక్సెస్ అయినట్టుగా గుర్తించాలన్నారు. హత్యలు, లైంగిక నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపాలన్నారు. అదే సమయంలో పక్కగా సాక్ష్యాధారాలు సేకరించి కోర్టులకు ఛార్జిషీట్లు సమర్పించడం ద్వారా కేసుల్లో శిక్షలు మరింత ఎక్కువగా పడేలా చూడాలని చెప్పారు. ఇక, విధి నిర్వహణలో అవినీతికి పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైనపుడు ఇతర శాఖలతో సమన్వయాన్ని ఏర్పరుచుకుని పని చేయాలన్నారు. సిబ్బంది సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. దాంతోపాటు ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్స్ వంటి అంశాల్లో ఎప్పటికప్పుడు సిబ్బందికి పునశ్చరణ జరిపించటం ద్వారా వారిలోని నైపుణ్యాలను మెరుగుపరిచేలా చూస్తామన్నారు. రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Read Also- Rinku Singh: రింకూ సింగ్‌కు దావూద్ ఇబ్రహిం గ్యాంగ్ బెదిరింపులు!.. ఏం అడిగారంటే?
యేటా రాష్ట్రంలో 900మంది హత్యకు గురవుతుంటే రోడ్డు ప్రమాదాల్లో మాత్రం 8వేల మంది మృత్యువాత పడుతున్నారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రమాదాలను తగ్గించటానికి అవసరమైన అన్ని చర్యలను అమలు చేయాలని చెప్పారు. రాత్రుళ్లు గస్తీని ముమ్మరంగా జరపాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను మరింతగా జరపాలని చెప్పారు. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డిస్ట్రిక్ట్ రోడ్డు సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి మిగితా ప్రభుత్వ శాఖల సమన్వయంతో యాక్సిడెంట్ల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ ప్రమాదం జరిగినా సంఘటనా స్థలానికి వెళ్లి కారణాలను విశ్లేషించాలని సూచించారు. మరోసారి యాక్సిడెంట్ జరగకుండా చూడాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలు, బలహీన వర్గాల పట్ల జరిగే నేరాలను నియంత్రించటానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. మనం క్రమశిక్షణతో పని చేసినపుడే ప్రజల నుంచి దానిని ఆశించగలమన్నారు. పోలీసింగ్ లో టీం వర్క్ సత్ఫలితాలను ఇస్తుందన్నారు. అదనపు డీజీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో తీసుకున్న ముందస్తు చర్యల గురించి వివరించారు. అదనపు డీజీపీ (ట్రైనింగ్) వీ.వీ.శ్రీనివాస రావు మాట్లాడుతూ కొత్తగా నియమితులు కానున్న డీఎస్పీలకు ఈనెల 27వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం కానున్నట్టు చెప్పారు. ఎంపికైన అభ్యర్థులందరూ ఈనెల 26న తెలంగాణ పోలీస్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని సూచించారు.సమావేశంలో అదనపు డీజీపీలు స్వాతి లక్రా, చారూ సిన్హా, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, ఇంటెలిజెన్స్ ఛీఫ్ విజయ్ కుమార్, హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
