India Is In The Throes Of Capitalism| ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామిక దేశమని మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మంచిదే. ఇది గర్వించదగిన విషయమే. అయితే, నేడు మనదేశంలో ఉన్నదానిని పరిపూర్ణమైన ప్రజాస్వామ్యమని చెప్పగలమా? అంటే అనుమానమే. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ‘ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కోసం’ అనే లింకన్ భావనతో బాటు గ్రీకుల మొదలు పలువురు దీనికి చెప్పిన భావనల సారాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ప్రజాస్వామ్యం అనేది సమత, సమానత్వం అనే భావనల మీద ఆధారపడి ఉండే వ్యవస్థ. ఇందులో సమత అనేది మానసికమైన భావన కాగా, సమానత్వమనేది భౌతికమైనది. ఏ దేశంలోని పౌరుల మధ్య తీవ్రమైన ఆర్థిక అసమానతలుండవో, ఏ దేశంలో జన్మత: వచ్చిన, ఆ సమాజంలోని మనుషులు కల్పించుకున్న అసమానతలకు తావుండదో అదే నిజమైన ప్రజాస్వామ్యమని గ్రీకుల భావన. అంటే ఆర్ధిక, మత, కుల, జాతి, లింగ ఆసమానతలు పౌరుల మధ్య ఎలాంటి తేడానీ సృష్టించలేని వ్యవస్థ అన్నమాట. వీటిలో మనం ఇప్పుడు కేవలం ‘ఆర్థిక’ అనే అంశం కోణంలో మన ప్రజాస్వామ్యపు నాణ్యతను అంచనా వేసే ప్రయత్నం చేద్దాం.
తాజాగా ఏర్పడిన లోక్‌సభలోని 543 సభ్యుల ఆర్థిక నేపథ్యాలను మనం ఈ సందర్భంగా పరిశీలించటం మంచి ఉదాహరణ అవుతుంది. మన లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో 93 శాతం మంది.. అంటే 504 మంది కోటీశ్వరులే అని ఏడీఆర్ అనే జాతీయ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఈ సంపన్న ఎంపీల జాబితాలో తొలి రెండు స్థానాల్లోనూ మన తెలుగువారే ఉన్నారు. మొదటి స్థానంలో గుంటూరు లోక్‌సభా స్థానం నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ రూ. 5705 కోట్ల వ్యక్తిగత సంపద గల ఎంపీగా నిలవగా, రెండవ స్థానంలో చేవెళ్ల నుంచి విజయం సాధించిన కొండా విశ్వేశ్వరరెడ్డి నిలిచారు. ఈయన తన సంపద విలువ రూ. 4578 కోట్లుగా అధికారికంగా చెప్పుకున్నారు. ఇక, ఈ లోక్‌సభలోని బిజెపి తరపున గెలిచిన 240 మంది సభ్యులలో 227 మంది కోటీశ్వరులే కాగా, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సభ్యుల్లోని 99 మందిలో 92 మంది కోటీశ్వరులున్నారు. ఇతర పార్టీల విషయానికి వస్తే.. టిడిపి నుండి గెలిచిన 16 మంది సభ్యులంతా కోటీశ్వరులే కాగా, జేడీయూ నుంచి గెలిచిన డజను మందీ అదే కోవకు చెందినవారే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 543 మంది సభ్యులకు గానూ 475 మంది సభ్యులు కోట్లకు పడగలెత్తినవారే కాగా, 2014లో ఈ కోటీశ్వరుల సంఖ్య 443గానూ, 2009లో 315గానూ ఉంది. ఈ గణాంకాలను బట్టి ప్రతి ఐదేళ్లకూ దేశాన్ని పాలించే ఈ సభలోని సభ్యుల సంపద పెరగటంతో బాటు మరింత సంపద ఉన్నవారు సభ్యులుగా దీనికి ఎన్నికవుతున్నారని తెలుస్తోంది.
Also Read:బడి పేరుతో చిన్నారుల్లో అలజడి
అయితే, లక్ష్మీపుత్రులే శాసన కర్తలుగా మారటం అనే ధోరణి ఇప్పటికిప్పుడు వచ్చిందేమీ కాదు. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో.. దేశభక్తి, సమైక్యత, సమగ్రత గల నేతలు, ప్రగతిశీల భావనలున్న వృత్తి నిపుణులు, సామాజిక సేవారంగంలోని వారు సభ్యులుగా ఎన్నికయ్యేవారు. తర్వాతి రోజుల్లో దేశంలోని వ్యాపారవేత్తలు, భారీగా మూలధనం ఉన్న వర్గాలు.. తమ ప్రయోజనాల కోసం శాసన కర్తలను ప్రలోభ పెట్టటమనే ఒరవడి ప్రారంభమైంది. అయితే, అన్ని సందర్భాల్లోనూ తమ ప్రయోజనాలు నెరవేరటం కష్టం కావటంతో తర్వాతి రోజుల్లో ఈ వ్యాపారవర్గాలు నేరుగా తమ పట్ల విధేయత చూపే వారి కోసం ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టి వారిని చట్టసభలకు పంపటం మొదలుపెట్టాయి. కానీ, నేడు వేరొకరిమీద ఆధారపడకుండా తామే నేరుగా వ్యాపారవేత్తలు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. అపారమైన ఆర్థిక వనరులున్న వీరు చట్టసభ సభ్యులైన తర్వాత వారి సంతానం, ఉపసంతానం కూడా ఈ చట్టసభ సభ్యత్వాన్ని ఒక హోదాగా, తప్పనిసరిగా దక్కించుకుని తీరాల్సిన ఒక అవసరంగా భావిస్తున్నారు. దీంతో ఇది అర్హతలతో సంబంధంలేని, ఆర్థిక వనరులుంటే చాలనే వ్యవహారంగా మారిపోయింది. ఒకవైపు పౌరులంతా సమానమని చెబుతూ, ఆ పౌరులను పాలించే అధికారం మాత్రం కొందరికే పరిమితం చేస్తున్న మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని నాణ్యత ఏ పాటితో చెప్పటానికి ఇదొక నిదర్శనం.
మన సమాజం ఒకేలా లేదని, అందులో చెప్పలేనంత వైవిధ్యముందని గుర్తించి, దానిని గౌరవించి, ఆయా వర్గాల వారికీ సమాన హక్కులను ఇవ్వటానికి ముందుకొచ్చే వారే నిజమైన ప్రజాస్వామిక వాదులు. ఈ భావన సమాజంలోని పౌరులందరిలో బలంగా వ్యాప్తి చెందటమే సామాజీకరణ. అదే.. ప్రజాస్వామ్యం అనే భావనకు ప్రాణవాయువు. ఈ భావనను ఆనాడే గుర్తించి, గౌరవించారు గనుకే ‘ఎన్నికల్లో విజయం గొప్పేమీ కాదు.. మన ప్రజాస్వామ్య విలువల నిచ్చెన మెట్లలో ఏ మెట్టుమీద మనం నిలిచామన్నదే ప్రధానం’ అని సాపేక్ష సిద్ధాంతకర్త అల్బర్ట్ ఐన్‌స్టీన్, ‘ నా రాజకీయ ప్రత్యర్థిని నోరెత్తకుండా చేయగల బలం, బలగం, అధికారం నాకున్నా తన అభిప్రాయాలు వెల్లడించే అతని స్వేచ్ఛను నేను ఒక్కనాటికీ హరించను. చివరికి అతడు నామీద ఎలాంటి విమర్శ చేసినా సరే’ అని అబ్రహాం లింకన్ అనగలిగారు. ఈ విలువ విషయంలోనూ మన ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉందనేదీ మనం నేడు పరీక్షించుకోవాలి.
ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో (పాతిక కోట్లమంది) పేదలున్న మన దేశంలో ప్రతి వందమందిలో 12 మంది పేదలేనని నీతిఆయోగ్ లెక్కలు చెబుతున్నాయి. భారతదేశం ప్రపంచపు అతిపెద్ద అయిదవ ఆర్థిక శక్తి అని చెబుతూనే, మరోవైపు దేశంలోని 80 కోట్ల పేదలకు ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’ పథకం కింద ఉచితంగా బియ్యం, గోధుమలు ఇస్తున్నామని మన పాలకులు గర్వంగా చెప్పుకుంటున్నాం. పౌరులను వేర్వేరు వర్గాలుగా విభజిస్తున్న వాటిలో ప్రధాన కారణంగా ఉన్నది ఆర్ధిక వ్యత్యాసమేనని తెలిసీ, ఆ వ్యత్యాసాలను అలాగే కొనసాగిస్తూ, ఏటికేడు మరింత పెంచుతూ.. దీనిని ఫక్తు ధనస్వామ్యంగా మార్చిన మన పాలకులు, దానిని మౌనంగా ఆమోదించే పౌరులు ఇంకా దీనిని ప్రజాస్వామ్యమని చెప్పుకోవటం ఆత్మ వంచన కాక మరొకటి అవుతుందా?
– విలేకరి రాజు బిగ్ టీవీ