Raghunandan Rao: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీచేసే ఎంఐఎం, ఆ పార్టీ పుట్టిన ప్రాంతమైన హైదరాబాద్ లో జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం ఎందుకు పోటీ చేయడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) ప్రశ్నించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుందని, మరి ఎవరి లబ్ధి కోసం ఈ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేయడంలేదని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ పుట్టిన హైదరాబాద్ లో పోటీ చేయకుండా బీహార్ లో పోటీ చేస్తుండటం దేనికి నిదర్శనమని నిలదీశారు. దేశంలో గతంలో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం ఎన్నో రాష్ట్రాల్లో పోటీ చేసిందని, మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎందుకు తమ అభ్యర్థిని బరిలోకి దించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
Also Read: Vaccination Drive: తల్లిదండ్రులకు అలర్ట్.. ఈ తేదీ గుర్తు పెట్టుకోండి.. లేదంటే పిల్లలకు ఇబ్బందే!
అసదుద్దీన్ కాంగ్రెస్ కు మద్దతు
దీనిపై ఓటర్లు ఆలోచన చేయాలని రఘునందన్ రావు కోరారు. ఆ పార్టీకి జూబ్లీహిల్స్ లో ఓటు బ్యాంకు ఉందని, 2014లో రెండోస్థానంలో నిలిచిందని ఆయన గుర్తుచేశారు. అసదుద్దీన్ కాంగ్రెస్ కు మద్దతివ్వాలని చూస్తున్నట్లు తెలిసిందని, అక్బరుద్దీన్ బీఆర్ఎస్ కు ఇద్దామంటున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని డిక్లేర్ చేస్తే ఎవరు చెబితే అతడిని ఫైనల్ చేశారనేది తేలుతుందని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంకు చెందిన వారిని మేయర్ పదవి ఇవ్వాలనే లోపాయికారి ఒప్పందంలో భాగంగా ఎంఐఎం ఈ పోటీలో నిలబడటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటే
జూబ్లీహిల్స్ లో ఇప్పటికిప్పుడు ఖబర్ స్తాన్ ఎందుకు కట్టాల్సి వచ్చిందని ఎంపీ నిలదీశారు. రాత్రికి రాత్రే జీవోలు ఎవరి లబ్ధి కోసం తీస్తున్నారని ప్రశ్నించారు. గతంలో ఎంఐఎంలో ఉన్నవాళ్లే వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటేనని, ఒక్క తాను ముక్కలేనని ఆయన విమర్శలు చేశాఉ. ఎంఐఎం నుంచి మేయర్ అయితే భైంసాలో ఏం జరిగిందో అదే హైదరాబద్ లో జరిగే అవకాశముందని రఘునందన్ రావు స్పష్టంచేశారు. కాంగ్రెస్ కూడా ముస్లింల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని విమర్శలు చేశారు. కేవలం ఓట్ల కోసమే అక్కున చేర్చుకుంటోందన్నారు.
కనీసం ముస్లింలకు మంత్రి పదవి అయినా ఇచ్చిందా?
ముస్లింలకు ప్రియారిటీ ఇస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఏం చేసిందని, కనీసం ముస్లింలకు మంత్రి పదవి అయినా ఇచ్చిందా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ప్రజలు అవకాశం ఇచ్చారని, ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని, మార్పు ఏంటో చూడాలని కోరారు. తాము ఒక్కరం గెలిచినా.. ముగ్గురు గెలిచినా, 8 మంది గెలిచినా ఎవరికీ తల వంచలేదని, వంచబోమని ఆయన స్పష్టంచేశారు. అదే బీఆర్ఎస్ లో కొందరు అటు.. ఇంకొందరు ఇటు మారారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు సీజేఐపై జరిగిన దాడిని రఘునందన్ రావు ఖండించారు.
Also Read: MCMC Committee: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎంసీఎంసీ కమిటీ ఏర్పాటు
