Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లు తమవే అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. బీజేపీ బీసీల నోటి కాడ ముద్దను లాగుతుందన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్ ల మాట్లాడుతూ..బీసీ రిజర్వేషన్లపై తమ అడ్వకేట్లు కోర్టులో బలమైన వాదనలు వినిపించారన్నారు. బీసీ రిజర్వేషన్ల కేసు కచ్చితంగా గెలుస్తామన్నారు. 1930 ( దాదాపు 90 సంవత్సరాల) తరవాత తెలంగాణలో కుల సర్వే జరిగిందన్నారు. తమ ప్రభుత్వం పకడ్భందీగా ప్రోసీజర్ ఫాలో అయిందన్నారు. రాజకీయ మైలేజ్ లో భాగంగానే బీసీ బిల్లు, ఆర్డినెన్స్ లకు బ్రేకులు పడ్డాయన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శించిందన్నారు.
Also Read:Naveen Yadav: ఇరకాటంలో నవీన్ యాదవ్?.. ఓటర్ ఐడీ పంపకాలతో ఎఫ్ఐఆర్ నమోదు!
బీజేపీ బీసీల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం
కోర్టుల్లోనూ అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నట్లు పీసీసీ వెల్లడించారు. బీజేపీ బీసీల నోటి కాడ ముద్దను లాగే ప్రయత్నం చేస్తోందన్నారు. బీసీల కోసం మూడు చట్టాలు తీసుకురాగా, అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. కుల మతాలకు అతీతంగా సీఎం రేవంత్,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు, ప్రజాప్రతి నిధులు మద్దతు తెలిపారన్నారు. ఇక పది నియోజక వర్గాల్లో పాత కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లపై ముందుకు వెళ్తామన్నారు. అయితే యధావిధిగా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. గురువారం నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ ప్రాసెస్ లు మొదలవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. గాంధీభవన్ లో ఓట్ చోర్ సంతకాలు
మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓట్ చోర్ సంతకాల సేకరణ జరిగింది. అధ్యక్షురాలు సునీత రావ్ అధ్యక్షతన బుధవారం మహిళ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరుగగా, సంతకాల సేకరణ కార్యక్రమాన్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు సునీతరావు మాట్లాడుతూ..దేశంలో ఓట్ చోరీ చేసి మూడో సారి మోడీ ప్రధాన మంత్రి అయ్యారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ విషయంలో అన్ని రకాలుగా ఆధారాలతో బయటపెట్టడంతో మోడీ, బీజేపీ బెంబేలెత్తిందన్నారు.
మోడీ మూడోసారి ప్రధాన మంత్రి అయ్యేందుకు ఎన్నికల కమిషన్ ను వాడుకున్నారని మండిపడ్డారు. అన్ని రకాలుగా ఆధారాలతో రాహుల్ గాంధీ ఎన్నికల అక్రమాలను, ఓట్ చోర్ లను చూపించినా కూడా ఎన్నికల కమిషన్ ఏ మాత్రం స్పందించలేదన్నారు. మహిళ కాంగ్రెస్ పెద్దఎత్తున సంతకాల సేకరణ చేపడుతుందన్నారు. మహిళ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతకాల సేకరణ చేపట్టి విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.
బీసీల కల నెరవేరనుంది.. కమిషన్ చైర్మన్ నిరంజన్
తెలంగాణ రాష్ట్రంలో బీసీల కలలు నెరవేరే విధంగా 42 శాతం రిజర్వేషన్స్‌తో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఏర్పడిందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ వెల్లడించారు. గురువారం నుంచి నామినేషన్స్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నదన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..బీసీ ల ఏళ్ల తరబడి కల నెరవేరనున్నదన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కోర్టులు కూడా అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ కులాల సర్వే జరిగి 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం ద్వారా నిర్ణయం జరిగినా, ఆ తదుపరి పరిణామాలతో ప్రజల్లో తీవ్రమైన ఉత్కంఠ ఏర్పడిందని, కానీ కోర్టు పాజిటివ్ విధానం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి తదితరులు ఉన్నారు.
Also Read: VC Sajjanar: కొంతమంది అలా డ్రైవింగ్ చేస్తున్నారు.. ఊరుకోబోం.. హైదరాబాదీలకు సజ్జనార్ వార్నింగ్
