Simhachalam: విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో మరోమారు ఉద్యోగులు చేతివాటం చూపించినట్లు తెలుస్తోంది. శ్రీ వరాహలక్ష్మీ నరసింహా స్వామి బంగారు, వెండి వస్తువులు కొన్ని మిస్ అయినట్లు సమాచారం. రికార్డుల్లో ఉన్న ఆభరణాలకు.. ప్రత్యక్షంగా కనిపిస్తున్న వస్తువులకు మధ్య పొంతన లేకపోవడంతో ఆలయ అధికారులు ఖంగుతిన్నారు. దీంతో ఆలయ మాజీ ఏఈఓతో పాటు ఇద్దరు ప్రధానార్చకులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
సింహాచలం ప్రధాన దేవాలయంతో పాటు ఉప ఆలయాలకు చెందిన బంగారం, వెండి ఆభరణాల రికార్డులు, తూకాల్లో అవకతవకలు జరిగాయంటూ కడపకు చెందిన ప్రభాకరాచారి గత ఏడాది జనవరిలో దేవదాయశాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో దేవదాయశాఖ కమిషనర్ రాజమహేంద్రవరం ఆర్జేసీని విచారణ చేయాలని ఆదేశించారు. ఆర్జేసీ నియమించిన జ్యువెలరీ వెరిఫికేషన్ అధికారి సింగం రాధ ఈ ఏడాది పలు దఫాలు తనిఖీలు నిర్వహించి ఆర్జేసీకి ప్రాథమిక నివేదిక సమర్పించింది. కొన్ని ఆభరణాల లెక్క తేలలేదని అందులో పేర్కొంది. దీంతో ఆర్జేసీ ఐదుగురు సభ్యులతో మరో కమిటీ ఏర్పాటు చేశారు.
ప్రత్యేక కమిటీ దర్యాప్తు
ఆ కమిటీ ఈ ఏడాది ఆగస్టు 9-20, సెప్టెంబరు 14, 15 తేదీల్లో విచారణ జరిపించింది. సింహాచలంతో పాటు ఆలయానికి సంబంధించిన బ్యాంకు ఖాతాలు, అర్చకులు, ఉప ఆలయాల్లోని వస్తువులను తనిఖీ చేసింది. అయితే రికార్డు ప్రకారం ఉండాల్సిన బంగారం, వెండి ఆభరణాలకు.. వాస్తవంగా ఉన్న వస్తువుల మధ్య వ్యత్యాసాన్ని కమిటీ గుర్తించింది. దీంతో అంతకుముందు వరకూ ఏఈఓగా పనిచేసి బదిలీపై వెళ్లిన ఎన్.ఆనంద్ కుమార్, సింహాచలం దేవస్థానం ప్రధానార్చకులు గౌడవర్తి శ్రీనివాసాచార్యులు, కర్రి సీతారామాచార్యులకు తాజాగా నోటీసులు జారీ చేసింది.
Also Read: Cough Syrup: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ రెండు దగ్గు మందులపై నిషేధం
వివరణ కోరిన కమిటీ
సింహాచలం ఏఈవోగా ఆనంద్ కుమార్ బాధ్యతలు చేపట్టిన సమయానికి ఆయన కస్టడీలో ఉన్న బంగారు, వెండి వస్తువులు.. ఇప్పుడు ఎందుకు తక్కువగా ఉన్నాయో వివరణ ఇవ్వాలని ఆలయ డిప్యూటీ ఈవో సింగం రాధ నోటీసుల్లో కోరారు. 2021 నవంబరు 19న నిర్వహించిన తనిఖీల్లో బంగారం, వెండి లెక్కలు సరిపోయాయని.. కానీ ఏఈఓగా ఆనంద్ కుమార్ బాధ్యతలు దిగిన అనంతరం నిర్వహించిన తనిఖీల్లో మాత్రం వ్యత్యాసం స్పష్టంగా కనిపించినట్లు విచారణలో తేలింది. దీనిపై నోటీసులు అందుకున్న వారు ఎలాంటి స్పందన తెలియజేస్తారో చూడాలి.
