Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ లో )Telangana Congress) మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) చేసిన కామెంట్ దుమారం రేపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓ మీటింగ్ లో మీడియా సమావేశానికి ముందు ‘దున్నపోతు ఆయనకు సమయం, జీవితం విలువ’ ఏం తెలుసు? అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో సర్క్యులేట్ అయింది. ఈ కామెంట్ ముగ్గురు మంత్రుల చిచ్చుకు కారణమైంది. మైనార్టీ వెల్ఫెర్ కు సంబంధించిన ప్రెస్ మీట్ కావడంతో, ఆ కామెంట్ తననే చేశారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సీరియస్ గా తీసుకున్నారు. సోషల్ మీడియాలోనూ మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రచారం మొదలైంది.
Also Read: Rinku Gifts Sister: లక్ష రూపాయలతో చెల్లికి విలువైన బహుమతి కొనిచ్చిన రింకూ సింగ్.. ఏం ఇచ్చాడంటే?
దళిత మంత్రిని అవమానిస్తారా?
దళిత మంత్రిని అవమానిస్తారా? ఇదేనా ఓ మంత్రికి సంస్కారం? దురుసు వ్యాఖ్యలు అవసరమా? అంటూ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దళిత సంఘాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీపై ప్రెజర్ పెరిగింది. తమ వర్గానికి చెందిన మంత్రిని అవమానించడం సరికాదంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు దళిత ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. మంత్రి అడ్లూరి కి జరిగిన అవమానం తమ జాతి మొత్తానికి వర్తిస్తుందంటూ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, శామ్యూల్, లక్ష్మీకాంత్, కాలే యాదయ్యలు పీసీసీ చీఫ్ కు వివరించారు. ఇప్పటికే తాను ఇద్దరు మంత్రులకు ఫోన్ చేశారని, మరోసారి ఇదే అంశంపై బుధవారం ఇద్దరు మంత్రులతో వన్ టూ వన్ నిర్వహిస్తానని పీసీసీ చీఫ్ వెల్లడించారు. తప్పకుండా ఈ సమస్యను పరిష్కరిస్తానని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు.
ముగ్గురూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులే..??
మంత్రి పొన్నం ప్రభాకర్ దురుసుగా ప్రవర్తించినప్పుడు పక్కనే ఉన్న మంత్రి వివేక్ ఎందుకు అడ్డుకోలేదని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. మొదట్నుంచి వివేక్ కు కూడా మాదిగలు అంటే ఇష్టం లేదని, ఆయన తన పక్కన కూర్చునేందుకు కూడా ఇష్టం లేదని వ్యాఖ్యానించారు. ఆయన కొడుకు ఎంపీ గెలిచేందుకు, గతంలోనూ ఆయన ఫ్యామిలీ విజయాలకు తాను చొరవ తీసుకున్నట్లు మంత్రి అడ్లూరి వివరించారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటి వరకు తనకు క్షమాపణ చెప్పలేదని మంత్రి అడ్లూరి చెప్తున్నారు. ఎవరు ఫోన్ చేసిన వివరణ కోరినా…తనను ఉద్దేశించి చెప్పలేదని ఆయన దాట వేస్తున్నారని మంత్రి అడ్లూరి సీరియస్ అయ్యారు.
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కు ఫిర్యాదు చేస్తా
తాను మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా సాధారణ స్థాయి నుంచి వచ్చిన వ్య క్తినని, తనకు ఇలాంటి అవమానం జరగడం బాధాకరమన్నారు. మంత్రి పొన్నం క్షమాపణ చెప్పకపోతే తాను ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్ తో పాటు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయితే తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. కావాలనే సోషల్ మీడియాలో దుష్ఫ్రాచారం జరుగుతుందన్నారు. ఇక మంత్రి అడ్లూరి తనను ఎందుకు టార్గెట్ చేశారో తనకు తెలియదని మంత్రి వివేక్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇటీవల మీనాక్షి మీటింగ్ ఉన్న నేపథ్యంలో తాను ఆయన పక్క నుంచి లేచి వెళ్లిపోయానని, ఇదే విషయాన్ని మిగతా మంత్రులకూ వివరించానని వివేక్ తెలిపారు. మంత్రి పొన్నం కూడా ఆ కామెంట్ చేయలేదని వివేక్ క్లారిటీ ఇచ్చారు. అయితే వీరు ముగ్గురు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు కావడం గమనార్హం. పాత విభేదాలతో ఈ ముగ్గురు మంత్రులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఓ ప్రచారం జరుగుతుంది.
ప్రోగ్రామ్ 3.30 కి..?
మైనార్టీ శాఖ మంత్రిగా ఆ ప్రోగ్రామ్ పూర్తి స్థాయిలో తన పర్యవేక్షణలోనే కొనసాగుతుందని, తాను 3.30 కి వస్తానని సంబంధిత కార్పొరేషన్ చైర్మన్లకు క్లారిటీ ఇచ్చానని, మంత్రి పొన్నం, మంత్రి వివేక్ లు ముందు వెళ్లి, వాళ్లకు పనులు ఉన్నాయంటూ హాడావిడి చేయడం ఏమిటని? మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. అప్పటికే ప్రోగ్రామ్ మొదలు పెట్టాలని తాను చైర్మన్లకు చెప్పానని, తాను సరాసరిగా 3.40కు వెళ్లినట్లు మంత్రి వివరించారు. సహచర మంత్రిపై దురుసుగా ప్రవర్తించే సంస్కృతి ఇప్పటి వరకు తెలంగాణలో లేదని, అది మంత్రి పొన్నంతోనే మొదలవుతున్నట్లు అడ్లూరి అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలు చొరవ తీసుకొని పొన్నంతో క్షమాపణ చెప్పించాల్సిందిగా మంత్రి అడ్లూరి డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లోనూ విమర్శల పర్వం కురుస్తుంది. ఆయన నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్లు చేస్తుంటారనే ప్రచారం జరుగుతుంది.
స్థానిక ఎన్నికల ముందు కుల వివాదం..?
మంత్రి పొన్నం వర్సెస్ మంత్రి అడ్లూరి ఎపిసోడ్ కులాల మధ్య చిచ్చుకు దారి తీసింది. ఎస్సీ, బీసీ నేతల మధ్య విబేధాలను సృష్టించినట్లయింది. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పై ప్రభావం పడే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు సమస్యలు ఉండగా, కొత్తగా ఈ సమస్యను సృష్టించడం ఏమిటని? సొంత పార్టీ నేతలు అసహానాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనతో కాంగ్రెస్ పార్టీ మరింత మైలేజ్ పొందేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మంత్రుల మధ్య వివాదం కొత్త సమస్యకు దారి తీసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ మీనాక్షి నటరాజన్ కూడా ఈ వివాదం మరింత ముందుకు సాగకుండా అడ్డుకునేందుకు ఇరు వర్గాల నేతలతోనూ చర్చించినట్లు తెలిసింది.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ నుంచి టికెట్ రేసులో ఉన్నది వీళ్లే!
