Jubilee Hills Bypoll: రెండు, మూడు రోజుల్లో అభ్యర్థి ఫైనల్
జూబ్లీహిల్స్ బైపోల్‌పై బీజేపీ సమాయత్తం
నేడు అభిప్రాయాలు సేకరించనున్న త్రిసభ్య కమిటీ
సాయంత్రానికి రాష్ట్ర నాయకత్వానికి నివేదిక
ఆపై పార్టీ ఎన్నికల కమిటీతో చర్చించనున్న రాష్ట్ర విభాగం
ముగ్గురి పేర్లతో హైకమాండ్‌కు నివేదిక
రాంచందర్ రావును కలిసిన ఆశావహులు
అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని రిక్వెస్ట్
టికెట్ ఎవరికి కేటాయిస్తారనే అంశంపై ఉత్కంఠ
బీఆర్ఎస్ ఇచ్చినట్లు మహిళకా?, మగవారికా?
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills Bypoll) నగారా మోగింది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి కూడా త్వరలోనే తేలిపోనుంది. ఇక, రెండు, మూడు రోజుల్లో జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశముంది. దీంతో, ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆశావహులు టికెట్ కోసం రాష్ట్ర నాయకత్వం, హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికకు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఇద్దరు మహిళా నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కలిసి తమ అభ్యర్థిత్వంపై విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి జూటూరి కీర్తి రెడ్డి, లంకల్ దీపక్ రెడ్డి, వీరపనేని పద్మ టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో లంకల దీపక్ రెడ్డి ఇప్పటికే టికెట్ తనకేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. కాగా, బైపోల్‌కు నోటిఫికేషన్ రావడంతో మహిళా నేతలు జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ సైతం రాంచందర్ రావును కలిసి తమ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ కేటాయిస్తామని స్పష్టంచేసింది. దీంతో బీజేపీ నుంచి సైతం మహిళకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకున్నట్లు సమాచారం.
Read Also- Congress Ticket: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?.. క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ చీఫ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీజేపీ గతంలో మానిటరింగ్ కమిటీని వేసింది. తాజాగా అభ్యర్థి ఎంపికకు త్రిసభ్య కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. ఈ కమిటీ మంగళవారం జూబ్లీహిల్స్ పరిధి డివిజన్ల ముఖ్య నేతలు, ఇతర ముఖ్య నేతల నుంచి ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుందనే అంశంపై అభిప్రాయాలు సేకరించనుంది. మంగళవారం సాయంత్రం నాటికి ఆ అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ రాష్ట్ర నాయకత్వానికి నివేదిక రూపంలో ఆ పేర్లను అందించనుంది. ఆ నివేదికను రాష్ట్ర నాయకత్వం బీజేపీ ఎన్నికల కమిటీకి అందించనుంది. చివరికి మూడు పేర్లను గుర్తించి ఆ జాబితాను కేంద్ర అధిష్టానానికి పంపించనుంది. ఆపై అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ ఫైనల్ చేయనుంది.
Read Also- JubileeHills Bypoll: ఉపఎన్నిక నిర్వహణకు రెడీ.. జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ కీలక ప్రకటన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది కీలక పాత్ర కానుంది. సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉండటమే దీనికి కారణం. అంతేకాకుండా రాష్ట్ర నాయకత్వంతో పాటు ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం ఈ ఎన్నికల పూర్తి బాధ్యత కిషన్ రెడ్డిదేనని స్పష్టంచేశారు. అభ్యర్థి ఎంపిక మొదలు, ప్రచారం, గెలుపు వంటి అంశాలన్నీ కిషన్ రెడ్డిపైనే ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనం. అయితే.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 7 డివిజన్లు ఉన్నాయి. బోరబండ, రహ్మత్ నగర్, షేక్ పేట్, యూసఫ్ గూడ, ఎర్రగడ్డ, వెంగళ్ రావు నగర్, శ్రీనగర్ కాలనీ ఇందులో భాగం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో 407 పోలింగ్ స్టేషన్లు, ప్రస్తుతం 3,98,982 ఓటర్లు ఉన్నారు. తుది జాబితా వరకు 4 లక్షలకు చేరే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఇందులో దాదాపు 1.3 లక్షల వరకు ఓట్లు ముస్లింలవే కావడం గమనార్హం. గెలుపోటములు నిర్ణయించేది ముస్లింలే కావడంతో బీజేపీ ఎలా గట్టెక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. బీజేపీ అంటేనే హిందు పార్టీగా ముద్రపడింది. అలాంటిది ఈ ఎన్నికల్లో గెలచి తమ సత్తా ఏంటో చూపిస్తామని బీజేపీ చెబుతోంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ ముస్లింలుగా ఉండటంతో వారిని కాషాయ పార్టీ వైపునకు ఎలా ఆకర్షిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును ఆశావహులైన మహిళా నేతలు జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ వేర్వేరుగా కలిసి విన్నవించుకున్నట్లు తెలిసింది. మరి వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సైతం బీఆర్ఎస్ మహిళా నేతకు అవకాశమిచ్చినట్లే మహిళకే ఇస్తుందా? లేక మరెవరికైనా కేటాయిస్తుందా? అనేది చూడాలి. ఈ సస్పెన్స్ వీడాలంటే మరో రెండు, మూడ్రోజులు వేచి చూడాల్సిందే.
