Children Riot In The Name Of School
Editorial

School Childrens: బడి పేరుతో చిన్నారుల్లో అలజడి

Children Riot In The Name Of School: కారణాలేమైనా మనిషి రోజువారీ జీవితం యాంత్రికంగా మారిపోయింది. జీవన వేగమూ పెరిగిపోయింది. ఒక పదినిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మన చుట్టూ ఏం జరుగుతుందని పరిశీలించటం గానీ, అందమైన ప్రకృతిని ఆస్వాదించటం అనేదే మన జీవితాల్లో కరువైపోయింది. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రోజంతా ఉరుకులు పరుగులే. ఇది పెద్దల పరిస్థితి. ఇక.. పిల్లల పరిస్థితి మరింత దారుణం. ఆటపాటలు లేవు. స్నేహితులతో ముచ్చట్లూ లేవు. తోబుట్టువులతో తగాదాలూ లేవు. కుటుంబసభ్యులతో ఓ అరగంట మాట్లాడే వీలు అసలే లేదు. అంతా చదువే. ఉదయం నిద్రలేవటం, హడావుడిగా రెడీ అవుతూనే కాస్త టిఫిన్ చేసి, లంచ్ బాక్స్, మోయలేనంత పుస్తకాల బ్యాగ్ తీసుకుని స్కూలు బస్సెక్కి పోవటం, అప్పటి నుంచి వరుస క్లాసులు, మధ్యాహ్నం ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్స్‌ తెరచి, అందులో చల్లారిపోయిన తిండేదో తిన్నామనిపించటం, మళ్లీ క్లాసులు. సాయంత్రానికి ఇంటికి రాగానే గుప్పెడు స్నాక్స్ తిన్నాక, మళ్లీ ట్యూషన్. రాత్రి 8 తర్వాత ఇంటికి రావటం, తిని నిద్రపోవటం. మర్నాడు ఉదయం మళ్లీ ఇదే కథ. ఈ యాంత్రిక జీవితంతో పిల్లలకు చదువు తప్ప మరొకటి లేకుండా పోతోంది. ఆటపాటలు లేకపోవటంతో శారీరక శ్రమా లేదు. కాస్త అటూఇటుగా కార్పొరేట్ స్కూ్ళ్లలోని విద్యార్థులందరి పరిస్థితీ ఇదే. ఈ విధంగా సాగుతున్న మన ఆధునిక విద్యావ్యవస్థ విద్యార్థుల బాల్యాన్ని కబళించటమే గాక వారి మానసిక ప్రవర్తనపై ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. దీంతో వీరు అనేక రకాల మానసిక సమస్యల బారిని పడుతున్నారని సైకాలజిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. తమ పిల్లలకు ఎన్ని మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు చూస్తున్నారే తప్ప చదువు ఎంత ఒత్తిడిగా సాగుతుందనే విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. ఈ క్రమంలో ప్రతి పదిమందిలో ఒక విద్యార్థి తీవ్రమైన మానసిక సమస్యల బారిన పడుతున్నాడు. చదువు తాలూకూ ఒత్తిడి వల్ల డిప్రెషన్‌, చదువులో వెనుకబడడం, మొండిగా ప్రవర్తించటం, విపరీతమైన అల్లరి, పెద్దల మాట వినకుండా ఎదురుతిరగటం వంటి లక్షణాలూ విద్యార్థుల్లో పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాల్లో మునిగిపోవడం, పిల్లలతో టైం తక్కువగా గడపటం వల్ల పిల్లలు ఒంటరి తనానికి అలవాటైపోతున్నారు. సింగిల్‌ పేరెంట్స్‌ ఉండే పిల్లల పరిస్థితి మరీ దయనీయం. ఇక.. సెలవు రోజు లేదా కాస్త విరామం దొరికితేనో.. పిల్లలు సెల్‌ఫోన్ లేదా టీవీతో కాలం గడుపుతున్నారు. దీంతో వారు కుటుంబ, మానవ సంబంధాలకు దూరమై వారికి తెలియకుండా ఒంటరివారుగా మారిపోతున్నారు.

Also Read: వానొస్తే వణుకుతున్న భాగ్యనగరం

బాలలందరికీ సక్రమంగా ప్రాథమిక విద్య సక్రమంగా అందితేనే ఆ జాతికి భవిష్యత్తులో ఆర్థికాభ్యున్నతి కలుగుతుందని యునెస్కో చెబుతోంది. ‘విజ్ఞానం కోసం పెట్టే పెట్టుబడి ఏనాటికైనా తిరిగి సత్ఫలితాలనే ఇస్తుంది’ అని అమెరికా రాజ్యాంగ రూపశిల్పి బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌ సూత్రీకరించారు. అయితే.. ఈ పెట్టుబడి నేడు మన దేశంలో పిల్లలను ధనార్జన యంత్రాలుగా మార్చేస్తోంది. దీంతో ప్రాథమిక విద్య నుంచే పిల్లలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో స్కూల్‌బ్యాగ్‌ కూడా ఎంత బరువుగా ఉంటే తమ పిల్లలు అంతగా చదువుతారనే నమ్మకం తల్లిదండ్రుల్లో పెరిగిపోయింది. విద్యను వ్యాపారం చేసిన కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు తమ లాభాల కోసమే.. ఈ భారాల చదువే అసలైన చదువు అని నమ్మించే యత్నం చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా విద్యావేత్తలు, మేధావులు, వైద్యనిపుణులు, సామాజిక కార్యకర్తలు ఈ భారీ స్కూలు బ్యాగ్‌ల మీద ఆందోళన చేసిన మీదట కేంద్రం 2006లో బాలల స్కూల్‌బ్యాగ్‌ చట్టాన్ని తీసుకొచ్చింది గానీ, విద్య అనేది రాష్ట్రాల జాబితాలోని అంశం కావటంతో అనేక రాష్ట్రాల్లో ఈ చట్టం అమలుకు నోచుకోలేదు. విద్యార్థి బరువులో పుస్తకాల బ్యాగు బరువు పదిశాతానికి మించకూడదని నిపుణులు చెబుతుంటే.. ఇప్పుడు దానికి మించి రెండు, రెండున్నర రెట్లు ఎక్కువ బరువున్న బ్యాగులను చిన్నారులు మోయాల్సి వస్తోంది. దీనివల్ల వారికి వెన్ను, కండరాల సమస్యలు తలెత్తి జీవితాంతం వాటిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా.. పిల్లల తెలివితేటలు వారి బ్యాగ్ బరువు మీద ఆధారపడవనే వాస్తవాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోతున్నారు.

ప్రాథమిక విద్య బాలలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, జిజ్ఞాసను కలిగించాలి తప్ప అదొక భారంగా, శిక్షగా మారకూడదని జాతిపిత గాంధీజీ మొదలు అనేకమంది విద్యావేత్తలు సూచించారు. 1947 ప్రాంతాల్లో ఐదేళ్లు దాటిన తర్వాతే పిల్లలను బడిలో చేర్చేవారు. కానీ, నేడు మూడేళ్లు నిండగానే బడి అనే జైలులో వీరు ఖైదీలవుతున్నారు. చిన్నారుల విద్య విషయంలో నేడు ప్రపంచమంతా ఫిన్లాండ్‌ను ఆదర్శంగా తీసుకుంటోంది. ఆ దేశంలో శిశువు పుట్టగానే, తల్లిదండ్రులకు పిల్లల పెంపకానికి సంబంధించిన 3 పుస్తకాలను ప్రభుత్వం ఇస్తుంది. తల్లి సంరక్షణలోనే పిల్లలు తొలి ఏడాది గడుపుతారు. తల్లికి 8 నెలల ప్రసూతి సెలవు తప్పనిసరి. ఏడాది నిండిన పిల్లలను ఇద్దరు నర్సుల పర్యవేక్షణలో నడిచే డే కేర్ సెంటర్లలో చేరుస్తారు. ఇక్కడ పిల్లలకు ఆటలు, పాటలు, కథలు, పెయింటింగ్, డ్రాయింగ్ తదితర అంశాల్లో ప్రాథమిక శిక్షణ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ భాషా సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై దృష్టి సారిస్తారు. వీరిచేత చిన్న చిన్న యంత్రాలను విడదీయడం, బిగించడం, బంకమట్టితో బొమ్మలు చేయడం, పాదులు తీయడం, మొక్కలకు నీరు పోయడం వంటి పనులు చేయించి, వారిలో చురుకుదనం, శారీరక, మానసిక వికాసాలు కలిగేలా చేస్తారు. ఆరేళ్లు నిండేవరకు చదవటం, రాయడం ఉండవు. అప్పటి వరకు ఆడియో విజువల్ పరికరాల ద్వారానే బోధన సాగుతుంది. ఈ దేశంలో కేజీ నుంచి డిగ్రీ వరకు చదువు బాధ్యత సర్కారుదే. ఇక్కడ ప్రైవేటు విద్య అనేది పూర్తిగా నిషేధం. పైగా.. దినసరి కూలీ నుంచి దేశాధినేత బిడ్డ వరకు అందరూ సర్కారీ బడిలో చదవాల్సిందే. పల్లె నుంచి రాజధాని వరకు అన్ని స్కూళ్లలో ఒకే శిక్షణ, సౌకర్యాలుంటాయి. అన్ని యూనివర్సిటీల్లో ఒకే తరహా నిధులు, ఒకే తరహా విద్యార్హతలు, సామర్థ్యాలున్న ఉపాధ్యాయులుంటారు.

పిల్లల సహేతుకమైన ఆలోచనకు, సృజనాత్మకతకు, మానసిక వికాసానికి ప్రాథమిక దశలోనే మంచి పునాదులు ఏర్పడాలి. అయితే.. పిల్లల అంతర్గత శక్తుల ప్రేరణకు, స్వేచ్ఛగా ఆలోచించేందుకు తగిన భూమికను కల్పించే బాధ్యత ముఖ్యంగా తల్లిదండ్రులు, టీచర్లదే. అయితే నేటి మన విద్యా విధానం సిలబస్‌లోని అంశాలను బట్టీపట్టడానికీ, మార్కులు, ర్యాంకులకే పరిమితమైంది. సృజనాత్మకత లేని ఇలాంటి విద్య మూలంగా పిల్లల్లోని అంతర్గత శక్తి సామర్థాలు బయటికి రావటం లేదు. పిల్లలు హాయిగా, తమకు నచ్చినరీతిలో చదువుకునే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. టీచరు మార్గదర్శకత్వంలో వివిధ అంశాలు, విషయాలపై వారికి అవగాహన కల్పించాలి. వివిధ రకాల వస్తువులను చూపించి వాటిని గురించి వివరించడం ద్వారా తాము సైతం అలాంటివి ఎందుకు తయారుచేయకూడదనే ఆలోచనను వారిలో రేకెత్తించాలి. అప్పుడే సృజనాత్మకత బయటికొస్తుంది. అదే విధంగా.. ఇప్పుడున్న క్లాస్ రూమ్ బోధనా విధానాన్ని కూడా సమూలంగా మార్చాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పుడున్న పద్ధతిలో సిలబస్‌లోని అంశాలు కేవలం పరీక్షలో జవాబులు రాయటానికి తప్ప దేనికో విద్యార్థులకు తెలియని పరిస్థితి. ఇది పిల్లల తార్కికమైన ఆలోచనకు, మానసిక స్వేచ్ఛకు, సృజనాత్మకతకు రవ్వంత కూడా దోహదం చేయటం లేదు. అందుకే.. సిలబస్‌లోని అంశానికి, బయటి ప్రపంచంలో దానికి ఉన్న ప్రాధాన్యత, ఉపయోగం ఏమిటో టీచర్లు వివరించాల్సిన అవసరం ఉంది. అప్పుడు వారు తమ మనసులోని అనుమానాలను టీచర్లకు చెప్పి, అందుకు తగిన జవాబులు తెలుసుకోగలుగుతారు. దురదృష్టవశాత్తూ.. మన స్కూళ్లలో ఈ తరహాలో టీచర్ – విద్యార్థుల మధ్య చర్చ, సంభాషణ అనేదే లేకుండా పోయింది. దీనిని తిరిగి తీసుకురావాలి. అప్పుడు విద్యార్థులకు చదువు కష్టంగా గాకుండా ఇష్టంగా మారుతుంది. ఈ కొత్త విద్యా సంవత్సరంలోనైనా ఈ మార్పులు వస్తాయని ఆశిద్దాం.

– నెక్కంటి అంత్రివేది, సామాజిక కార్యకర్త

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..