Telangana BJP: స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ(BJP)కి సవాల్ గా మారింది. అన్ని పార్టీలది ఒక దారయితే.. కాషాయ పార్టీది మరో దారి అన్నట్లుగా పరిస్థితి మారింది. లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తాచాటి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న కమలదళం ఆశలు అడియాసలయ్యేలా కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గిరి గీసుకుని ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. బీజేపీకి అన్నీ తామే అన్నట్లుగా వ్యవహరించే నేతలు సైతం ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి కేడర్ లేకపోవడమే కారణమని తెలుస్తోంది. బీజేపీకి రికార్డుల ప్రకారం దాదాపు 45 లక్షల సభ్యత్వాలు ఉన్నా అవన్నీ ఓట్లుగా మారుతాయా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అందుకే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా గిరి గీసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది.
కిషన్ రెడ్డి ఫైనల్ చేసిన అభ్యర్థి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి(Kishan Reddy) సవాల్ గా మారాయి. ఆయన పార్లమెంట్ పరిధిలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక నుంచి గెలుపు వరకు అన్నీ కిషన్ రెడ్డి భుజాలపై ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమే ఇటీవల నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Dharmapuri Arvind) సైతం చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తి బాధ్యత కిషన్ రెడ్డిదే అని స్పష్టంచేశారు. అయితే తాజాగా ఈ టికెట్ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Redddy) వర్సెస్ రాంచందర్ రావు(Ramchender Rao) అన్నట్లుగా పరిస్థితి మారిందనే ప్రచారం జరిగింది. కిషన్ రెడ్డి ఫైనల్ చేసిన అభ్యర్థిని రాంచందర్ రావు తిరస్కరించడంతో ఆ పంచాయితీ కాస్త హైకమాండ్ కు చేరినట్లుగా చెప్పుకొచ్చారు. కాగా దీనిపై స్పందించిన రాంచందర్ రావు అదంతా ఫేక్ అని చెప్పడం గమనార్హం. గ్రేటర్ పరిధిలో లోకల్ బాడీ ఎన్నికలు ఉండబోవు కాబట్టి కిషన్ రెడ్డిని జూబ్లీహిల్స్ బైపోల్ కే పరిమితం చేశారనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కిషన్ రెడ్డికి ఈ బైపోల్ ప్రతిష్టాత్మకంగా మారనుంది. పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపిక నుంచి గెలుపు వరకు అన్ని బాధ్యతలు కిషన్ రెడ్డిపైనే మోపడం గమనార్హం.
Also Read; Conflicts in Maoists: మావోయిస్టు పార్టీలో విభేదాలు.. చివరికి ఏం జరుగుతుందో?
ఓటర్లు మొగ్గుచూపుతారా?
ఇదిలా ఉండగా హిందువులకు కేరాఫ్, బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకునే బండి సంజయ్(Bandi Sanjay) సైతం కరీంనగర్, సిరిసిల్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. బండి సంజయ్ సైతం ఈ జెడ్పీ స్థానాలను గెలిచి తీరుతామని చెప్పడమే దీనికి నిదర్శనంగా మారింది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ పరిధి వరకే ఆయన పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా ఇదే కోవలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం ఉన్నట్లుగా తెలుస్తోంది. జగిత్యాల, నిజామాబాద్ వరకే ఆయన పరిమితమైనట్లు సమాచారం. ఈ పరిధి దాటి బయటకు వస్తే ఓటర్లు మొగ్గుచూపుతారా? లేదా? అనే భయం బీజేపీ నేతల్లో మొదలైనట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలో బీజేపీకి మంచి పట్టుంది. అయినా లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గిరి గీసుకోవడంపై శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యేందుకు తామెంతో కష్టపడ్డామని, అలాంటిది తమకోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు నిలకపోవడంపై శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి.
పాత, కొత్త నేతలకు మధ్య పోరు..
తెలంగాణ బీజేపీకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు. అలాంటిది బీజేఎల్పీ నేత ఏలేటి సైతం నిర్మల్ జిల్లాకే పరిమితమైనట్లు సమాచారం. ఆయన కొద్దిరోజులుగా సెగ్మెంట్ లోనే విస్తృతంగా పర్యటిస్తున్నట్లు సమాచారం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు.. మెదక్, సంగారెడ్డి పరిధిలో ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి(MP Konda Vishweshwar Reddy) రంగారెడ్డి, వికారాబాద్ కు పరిమితమైనట్లు వినికిడి. ఇకపోతే ఈటల రాజేందర్(Etala Rajender) ను హుజురాబాద్ కు కాకుండా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధికే పరిమితం చేస్తున్నట్లు సమాచారం. పాలమూరు ఎంపీ డీకే అరుణను సైతం ఆ పార్లమెంట్ పరిధి వరకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. ఆ పార్లమెంట్ పరిధిలో పాత, కొత్త నేతలకు మధ్య పోరు సాగుతోంది. దీంతో గిరి గీసుకోవడమే మంచిదనే భావనలో కేంద్ర మంత్రుల నుంచి మొదలు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే తమకు మంచిదనే భావనలో కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం అదే భావిస్తున్నట్లు సమాచారం. ఈ పరిధి దాటినా లోకల్ బాడీ ఎన్నికల్లో తాము సత్తాచాటలేమనే ధోరణితోనే గిరి గీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. గిరి దాటి బయటకు వెళ్లినా గెలవబోమనే భావనే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. మరి ఈ ఎన్నికల్లో పార్టీ గట్టెక్కుతుందా? లేదా? అనేది చూడాలి.
Also Read: Akshay Kumar: అలాంటి ఫొటోలను పంపుతారా? తన కుమార్తెకు ఎదురైన షాకింగ్ ఘటనను తెలిపిన అక్షయ్!
