Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రేస్ పార్టీ ఎంతో ప్రాధాన్యతనిస్తుందని హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్‌లోని ఎర్రగడ్డ డివిజన్‌లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్‌లో రూ.2.16 కోట్ల వ్యయంతో నటరాజ్ నగర్, శంకర్‌లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్ వద్ద సీసీ రోడ్లకు.. నటరాజ్ నగర్, బంజారా నగర్, కమ్యూనిటీ హాల్‌ల పునరుద్ధరణకు మంత్రి శంకుస్థాపన చేశారు.
రేపటి నుంచే పనులు ప్రారంభం
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. స్థానికంగా ఉన్న ఖాళీ స్థలం ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్ ఏర్పాటు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. రేపటి నుండి పనులు ప్రారంభమవుతాయని, వాకింగ్ ట్రాక్, పిల్లల గేమ్స్ తదితర ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులను ఆదేశించామని ఆయన తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 60 వేలకు పైగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలెండర్ అందిస్తున్నామని వివరించారు. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.
Also Read- Local Body Elections: హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌లో ముసలం.. వీణవంక జెడ్పీటీసీ టికెట్ కోసం కోల్డ్ వార్!
సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా
అలాగే.. జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గంలో 70 లక్షల రూపాయల వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా అండ్ మురుగునీటి బోర్డు నుండి యూసుఫ్ గూడా డివిజన్‌లోని శ్రీ కృష్ణ నగర్ ఎ బ్లాక్‌లోని 600MM మురుగునీటి ప్రధాన లైన్‌పై దెబ్బతిన్న మ్యాన్‌హోల్‌ల పునర్నిర్మాణం.. కృష్ణ నగర్ బి అండ్ సి బ్లాక్‌లో దెబ్బతిన్న 200MM మురుగునీటి పైపులను భర్తీ చేయడం, మాధురి హాస్పిటల్ లేన్ అండ్ శాలివాహన్ నగర్ వద్ద దెబ్బతిన్న 200MM DIA మురుగునీటి లైన్‌ను భర్తీ చేయడం, చర్చి లేన్ నీటి సరఫరా లైన్‌తో భర్తీ చేయడం, యెల్లారెడ్డిగూడ సెక్షన్, లక్ష్మీనరసింహ నగర్ అండ్ యూసుఫ్ గూడా బస్తీ ప్రాంతాల్లో దెబ్బతిన్న పైప్ లైన్ పునః నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లుగా ఆయన తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పరుగెత్తిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మీర్జా రహమత్ బెగ్ ఖాద్రి, మీర్జా రియాజ్ హాల్ హాసన్ ఎఫండీ, ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, డైరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, జోనల్ కమిషనర్ హేమంత్, ఇంకా ఇతర అధికారులు, రాజకీయ నేతలు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
