Suchitra land dispute: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డికి రెవెన్యూ శాఖ షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని సుచిత్ర వద్ద గల వివాదంలోని 33 గుంటల భూమి మల్లారెడ్డిది కాదని తేల్చింది. సర్వే నెంబర్ 82లో ఉన్న 33 గుంటల భూమికి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధం లేదని మేడ్చల్ కోర్టుకు నివేదిక అందించారు. ఈ సర్వే రిపోర్టును సైబరాబాద్ పోలీసులకూ పంపించారు.
కాగా, మల్లారెడ్డి దశాబ్ద కాలంగా ఈ భూమి తనదేనని కబ్జాకు ఉన్నారు. సర్వే నెంబర్ 82లో ఉన్న భూమి తమదని 15 మంది బాధితులు అభ్యంతరం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయాక.. మంత్రి పదవీ మల్లారెడ్డి కోల్పోయాక బాధితులు బయటకు వచ్చి అభ్యంతరం తెలపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సుచిత్ర ఏరియాలో వందల కోట్ల విలువ చేసే 2.10 ఎకరాల భూమిపై వివాదం జరుగుతున్నది. ఈ భూమి తనదేనని చెబుతూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులతో వచ్చి మే 18న హల్‌చల్ చేశారు. భూమి చుట్టూ నిలిపిన రేకులను కూలదోసే ప్రయత్నం చేశారు. ఆ భూమి తమదేనని చెబుతున్నవారూ అక్కడే ఉండటంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసులు నమోదు చేశారు.
దీంతో రెవెన్యూ శాఖ రంగంలోకి దిగి విచారణ చేసింది. ఈ దర్యాప్తులో 33 గుంటల భూమి మల్లారెడ్డిది కాదని తేలింది.
మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్ కూలదోసే ప్రయత్నం చేశాక బాధితులూ మీడియా ముందుకు వచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో శ్రీనివాస్ రెడ్డి, బషీర్‌లు మాట్లాడుతూ.. ఐదు సార్లు సర్వే జరిగినా తమకే అనుకూలంగా వచ్చిందని, 2016లో భూమిలో ఎలాంటి షెడ్లు లేవని, మల్లారెడ్డి మంత్రి అయ్యాకే ఆ భూమిని వారు అధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. 82 సర్వే నెంబర్‌లో 17 ఎకరాల 31 గుంటల భూమి ఉంటే అందులో ఓనర్ సుధామ పేరు మీద 4 ఎకరాల 24 గుంటలు ఉన్నదని, అందులో 1.29 ఎకరాలు మాత్రమే మల్లారెడ్డిదని వివరించారు. 2016లో తాము ఎకరం నాలుగు గుంటల భూమి కొన్నామని, హైకోర్టు ఆర్డర్ ప్రకారమే రెవెన్యూ అధికారుల సర్వే తర్వాత భూమిలో ఫెన్సింగ్ వేసుకుని పొజిషన్‌లో ఉన్నామని చెప్పారు.