Nampally Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు కస్టడీలో ఉన్న నిందిత పోలీసు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. వారు ఇటీవలే నాంపల్లి కోర్టులో తమకు బెయిల్ మంజూరు చేయాలని, రాజకీయ కారణాలతోనే తమను అరెస్టు చేశారని పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, వారి బెయిల్ దరఖాస్తును పోలీసు శాఖ వ్యతిరేకింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నదని, వారికి బెయిల్ ఇవ్వరాదని కోర్టుకు విన్నవించింది. ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల బెయిల్ దరఖాస్తును కొట్టివేసింది. ప్రస్తుతం వీరు చంచల్‌గూడ్ జైలులో ఉన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మార్చి 10న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం ఆరుగురిని నిందితులుగా చేర్చిన పోలీసులు, ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు.
బెయిల్ కోసం నిందితులు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం నాంపల్లి కోర్టులో వాదనలు జరగగా, ఛార్జ్‌షీట్ విషయాన్ని వెల్లడించారు పోలీసులు. రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్టు నిందితులు వాదనలు వినిపించగా, ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది చాలా ఉంది కాబట్టి బెయిల్ మంజూరు చేయొద్దన్న పీపీ వాదించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, ఈ కేసుపై దృష్టి పెట్టింది. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి కేసు విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారంతా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే చేశామని తమ వాంగ్మూలాల్లో ఒప్పుకున్నారు.