Conflicts in Maoists: ప్రకటనలతో రచ్చకెక్కుతున్న అగ్ర నాయకులు
ఓవైపు ఎన్‌కౌంటర్లు… మరోవైపు లొంగుబాట్లు
ఆ పార్టీ సమస్యే కాదంటున్న పోలీసు ఉన్నతాధికారులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ‘‘మావోయిస్టు పార్టీతో ప్రస్తుతం ఎలాంటి సమస్య లేనపుడు చర్చలు అనవసరం’’… రాష్ట్ర డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మీడియాతో చెప్పిన మాటలివి. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ పరిస్థితిని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఓవైపు ముమ్మరంగా నడుస్తున్న ఆపరేషన్ కగార్… వరుస ఎన్ కౌంటర్లు… కీలక నాయకుల మరణాలు… లొంగుబాట్లతో సతమతమవుతున్న మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం అంతర్గత విభేదాలు (Conflicts in Maoists) కూడా తారాస్థాయికి చేరుకున్నాయి. పార్టీని ముందుండి నడిపించే నాయకులే పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తుండటం, ఒకరినొకరు విమర్శించుకుంటుండటం ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొని ఉన్న పరిస్థితికి దర్పణంగా నిలుస్తున్నాయి.
చిచ్చు రేపిన ప్రకటన
శాంతి చర్చల కోసం ఆయుధాలను సైతం వదిలి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ చేసిన ప్రకటన ఆ పార్టీలో చిచ్చు రగిల్చింది. దీనిపై స్పందించిన ఆ పార్టీ కేంద్ర కమిటీ అంతర్గత చర్చలు జరపకుండా ఆయుధాలను విడిచిపెడతామంటూ మల్లోజుల ఎలా ప్రకటిస్తారంటూ తీవ్ర స్థాయిలో అగ్రహం వ్యక్తం చేసింది. ఆ ప్రకటన పూర్తిగా మల్లోజుల వ్యక్తిగతమని స్పష్టం చేసింది. పీడిత ప్రజల తరపున మావోయిస్టు పార్టీ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పింది. మల్లోజుల వెంటనే తన వద్ద ఉన్న ఆయుధాలను పార్టీకి అప్పగించాలని, లేనిపక్షంలో గెరిల్లా దళం రంగంలోకి దిగి వాటిని స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది. మరో అడుగు ముందుకేసి మల్లోజులను ద్రోహిగా ప్రకటించింది. పార్టీ నుంచి ఆయనను బహిష్కరిస్తున్నట్టుగా పార్టీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామాలపై ఓ సీనియర్ పోలీసు అధికారితో మాట్లాడగా, వరుస ఎన్‌కౌంటర్లలో కీలక నేతలను కోల్పోతుండటం, కీలక స్థానాల్లో నియమించిన వారిపై అసంతృప్తి ఉన్న నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు క్రమంగా తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయని వ్యాఖ్యానించారు.
Read Also- Rohit Future: రోహిత్ శర్మ, కోహ్లీ భవితవ్యం ఏమిటి? సెలక్టర్ల మనసులో ఉన్నది ఇదేనా?
ప్రధాన కార్యదర్శి బసవరాజు ఎన్ కౌంటర్‌లో చనిపోవటం ఆ పార్టీకి తగిలిన పెద్ద దెబ్బ అని చెప్పారు. ఆయన స్థానంలో తిరుపతిని నియమించినా దీనిపై పార్టీలో చాలామంది సంతృప్తిగా లేరన్నారు. ఈ క్రమంలోనే అగ్రనాయకుల మాటకు కట్టుబడి ఉండే పార్టీ క్యాడర్ నిరసన గళం వినిపిస్తోందన్నారు. నిజానికి మావోయిస్టు పార్టీలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన 18మంది కేంద్ర కమిటీలో సభ్యులుగా ఉండేవారు. వీరిలో పలువురు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. దాంతో నాయకత్వ సమస్య తలెత్తింది. ఇటువంటి పరిస్థితుల్లో మల్లోజుల పార్టీ కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని, దీని కోసం అవసరమైతే ఆయుధాలను సైతం విడిచి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామంటూ చేసిన ప్రకటన తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై జర్నలిస్టులు, మేధావులు అభిప్రాయాలు తెలియజేయాలంటూ జీ-మెయిల్ ఐడీ కూడా ఇవ్వటం కలకలం రేపింది. పార్టీలో చర్చ జరపకుండా మల్లోజున ఏకపక్షంగా ఎలా ప్రకటన విడుదల చేస్తారంటూ కేంద్ర కమిటీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also- Viral video: మానవత్వం ఇంకా బతికే ఉంది.. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది
అభిప్రాయాలు చెప్పండి అంటూ మెయిల్ ఐడీ ఇవ్వటం అర్థరహితమని వ్యాఖ్యానించింది. పార్టీకి ద్రోహం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఆ వెంటనే మల్లోజులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటన కూడా విడుదల చేసింది. వెంటనే ఆయుధాలను అప్పగించాలని పేర్కొంది. లేనిపక్షంలో గెరిళ్లా దళాన్ని రంగంలోకి దింపాల్సి వస్తుందని హెచ్చరించింది. కాగా, విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే మల్లోజుల లొంగిపోవటానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. మరికొందరు సహచరులతో కలిసి త్వరలోనే ఆయన జనజీవన స్రవంతిలో కలవనున్నట్టు ప్రకటిస్తారని తెలిసింది. ఇప్పటికే మల్లోజులతోపాటు కొందరు మావోయిస్టు పార్టీ కీలక సభ్యులు రాష్ట్రానికి చెందిన పోలీస్ బాస్‌లతో టచ్ లో ఉన్నట్టుగా తెలియవచ్చింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కూడా ఇదే విషయాన్ని చెబుతుండటం…ఇప్పటికే మల్లోజుల పోలీసు బలగాల ఆధీనంలో ఉన్నాడని, ఏ క్షణంలోనైనా లొంగుబాటు ప్రకటన వస్తుందని పేర్కొనటం గమనార్హం.
