Hyderabad: రుతు పవనాల ప్రభావంతో తెలంగాణలో గత వారం రోజులుగా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాబోయే రోజుల్లో నైరుతి అన్ని ప్రాంతాలకు ఆవరించి, స్థిరమైన వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది. సకాలంలో వర్షాకాలం ప్రారంభమై, సమృద్ధిగా వర్షాలు కురవడం అన్నదాతలతో బాటు అన్ని వర్గాలకూ శుభవార్తే అయినప్పటికీ భారీ వర్షాలు నగర ప్రాంతాల్లోని క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఊహించని రీతిలో అతి తక్కువ సమయంలో ఒకేచోట కుండపోతగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయనేదీ కాదనలేని వాస్తవం. ముఖ్యంగా విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్ కాస్త గట్టివాన కురిస్తే చిగురుటాకులా వణికిపోతోంది. అరగంట వానకే రోడ్లపై ఎక్కడికక్కడ వాన నీరు చేరి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి, వాహనదారులు నానా అగచాట్లు పడాల్సి వస్తోంది. నాలుగు వందల ఏళ్లనాడే డ్రైనేజీ వ్యవస్థ కలిగిన ఈ మహానగరపు జనాభా వేగంగా పెరుగుతూ వచ్చింది. అయితే, మారిన పరిస్థితులకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థలు అందుబాటులోకి రాకపోవటంతో తరచూ వరద ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోంది. నగరంలోని కుంటలు, చెరువులు, ఆట మైదానాలను, మూసీ ఆనకట్టలు, కాల్వ గట్లనూ అక్రమార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టటంతో వరద నీరు పోయే మార్గాలు ఎక్కడికక్కడే మూసుకుపోవటంతో వానాకాలంలో నగర జీవనం నరక ప్రాయంగా మారుతోంది.
గ్రేటర్‌లో 9,103 కి.మీల మేర రహదారులుండగా, 1302 కి.మీల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉంది. అభివృద్ధి చెందిన నగరాల్లో రోడ్లకు రెండువైపులా వరద నీటి ప్రవాహ వ్యవస్థ ఉండగా, మన హైదరాబాద్ నగరంలో ఆ పరిస్థితి లేదు. భాగ్యనగరంలోని వరద నీరంతా ప్రధాన, అంతర్గత రోడ్ల పక్కన నిర్మించిన వరద నీటి డ్రెయిన్లు, ప్రధాన నాలాల్లోకి వెళ్లేలా ఏర్పాటు చేసిన చిన్న కాలువల ద్వారా పోవాల్సిందే. గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ సమస్యపై అధికారులు కొంత కసరత్తు చేశారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఎన్‌డీపీ) ఫేజ్-1లో భాగంగా నాలాల అభివృద్ధి, విస్తరణకు వందల కోట్లతో పనులు చేపట్టినా, పరిస్థితిలో ఆశించిన మార్పు రాలేదు. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను సంగతి కాసేపు పక్కన పెడితే ఆర్థిక వ్యవస్థకు కీలక ప్రాంతాలుగా చెప్పుకునే సైబర్ సిటీ పరిసరాల్లోనూ పధాన రహదారులపైనా వాననీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. నగరంలో 54 కీలక రద్దీ ప్రాంతాల్లో వరద నీరు నిలుస్తుందని అధికారులు గుర్తించి, కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అవి తాత్కాలిక ప్రయోజనాలనే ఇచ్చాయి తప్ప శాశ్వతంగా వరద సమస్యను పరిష్కరించలేకపోయాయి.
సాధారణంగా వర్షం తగ్గిన గంట, రెండు గంటల్లో రహదారుల మీద చేరిన వరద నీరంతా ఎక్కడికక్కడ డ్రెయిన్ల ద్వారా వెళ్లిపోవాలి. కానీ, హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసిన తర్వాత మూడు నాలుగు గంటల వరకు వాననీరు రోడ్లపై నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు గంటల కొద్దీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజాం పాలనతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక గంట వ్యవధిలో 7 సెం.మీ.ల వర్షపాతం నమోదైనా తట్టుకునేలా వరద నీటి కాలువలను ఏర్పాటు చేయగా, వాటి నిర్వహణ, పునర్నిర్మాణం మీద తర్వాతి రోజుల్లో ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించలేదు. దీంతో ఇప్పటి నాలాలు కేవలం 2 సెంటీ మీటర్ల వర్షాపాతానికి మించి తట్టుకోలేకపోతున్నాయి. కానీ, నగర విస్తరణ, పెరిగిన జనాభా, మారుతున్న వాతావరణం కారణంగా నగరంలో ఒక్కోసారి కనిష్టంగా 10, గరిష్టంగా 20 సెం.మీ.ల వరకు వర్షపాతం నమోదైన సందర్భాలూ ఉంటున్నాయి. పైగా, క్యుములో నింబస్ ప్రభావంతో ఒకేచోట వాన ఏకధాటిగా కురవటంతో అరగంట వ్యవధిలో ప్రజారవాణా వ్యవస్థ స్తంభించి పోతోంది. ఆరు జోన్లు, 30 సర్కిళ్లుగా విస్తరించిన హైదరాబాద్ మహానగరంలో చిన్న, మధ్య, భారీ తరహా నాలాలు దాదాపు వెయ్యి కిలోమీటర్ల పైచిలుకు ప్రవహిస్తున్నాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందే అన్ని నాలాల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని కిర్లోస్కర్ కమిటీ సిఫార్సు చేసినా, ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా పూడికతీత పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేసిన దాఖల్లాల్లేవు. ఎప్పటికప్పుడు సమర్ధవంతమైన చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పటమే తప్ప ఫలితాలు ఆచరణలో కనిపించటం లేదు. 2022 నుంచి వరదలు, ముంపు నివారణకు చర్యల్లో భాగంగా రూ.వెయ్యి కోట్లతో ఎస్ఎన్‌డీపీని గత సర్కారు తెరపైకి తెచ్చి మొత్తం 36 ముంపు నివారణ పనులను ప్రారంభించగా, ఆ పనులు నేటికీ పూర్తి కాకపోవటం విచారకరం.
హైదరాబాద్ మహా నగరంలో నిరుడు గుర్తించిన వాటర్ లాగిన్ పాయింట్స్ అన్నీ కూడా ఈ సీజన్‌లో కురిసిన కొద్దిపాటి వర్షాలకే నీటితో నిండిపోయాయి. మూసాపేట, మాదాపూర్, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌ల కింద, లింగంపల్లి రైల్వే అండర్ పాస్, యూసుఫ్ గూడా మెయిన్ రోడ్, రాజ్ భవన్ రోడ్, ఫిల్మ్ నగర్, బాలానగర్ బస్ స్టాప్, చింతల్ రోడ్, జీడిమెట్ల హై టెన్సన్ రోడ్, మలక్‌పేట సహా పాతబస్తీలో పలు ఏరియాల్లో నీరు నిలిచి డేంజర్ స్పాట్స్‌గా మారుతున్నాయి. ప్రతి చిన్నవానకూ జీహెచ్‌ఎంసీ అప్రమత్తమై డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్, మాన్‌సూన్ టీమ్స్ రంగలోకి దిగటం, గ్రేటర్ పరిధిలో 30 డీఆర్‌ఎఫ్ టీమ్స్, 60 సీఆర్‌ఎంపీ టీమ్స్ క్షేత్ర స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాల్సి వస్తోంది. అకాల వర్షాలు సాయంత్రంవేళ విరుచుకుపడుతూ ఉండడంతో ఆఫీసుల్లో పని ముగించుకుని ఇళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నారు. హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయ్ నగర్‌లో నాలాలపై నిర్మించిన స్లాబ్ గతంలో ఒక్క వర్షానికే కొట్టుకుపోయిన సందర్భంలో ఎస్ఎన్‌డీపీ పనుల నాణ్యత మీద కూడా అనేక అనుమానాలు వచ్చినా, తర్వాత వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గత సర్కారు హయాంలో పురపాలక శాఖలో కీలక పదవుల్లో కొనసాగిన పలువురు అధికారులు, రాజకీయ నేతల కమీషన్ల కోసమే నిధులు కేటాయించారే తప్ప, ముంపు నివారణ పనుల కోసం కాదంటూ మహానగరవాసులు అప్పట్లోనే మండిపడ్డారు. ఇక.. జీహెచ్‌ఎంసీలో విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాలలో 700 మంది డీఆర్‌ఎఫ్ సిబ్బంది వానాకాలం తర్వాత ఏ విధులు నిర్వర్తిస్తారో తెలియని పరిస్థితి. వీరికి గుంతలు పూడ్చటం, అక్రమ నిర్మాణాలు, శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చటం వంటి విషయాల్లో ఎలాంటి నైపుణ్యం, అనుభవమూ లేదని గత ఉదంతాలు చెబుతున్నాయి. వీరికి మెరుగైన శిక్షణ అవసరం అనే మాట కూడా ఉంది.
ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ.. వాతావరణ శాఖ జారీ చేస్తున్న హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని ముందుగానే తగిన జాగ్రత్తలను తీసుకోవడం తక్షణ అవసరంగా ఉంది. అలాగే, మూసీ పరివాహక ప్రాంతంలోనూ వరద నీటి నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలి. డ్రైనేజీలకు, మ్యాన్ హోళ్లకు మరమ్మతులు చేయించడంతోపాటు వర్షానికి నీరు నిల్వ ఉండిపోయే ప్రదేశాల్లో సిబ్బందిని మోహరించి ఎప్పటికప్పుడు వరద నీరు డ్రైనేజీలలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. నగరపు కూడల్లో అనుమతి లేని హోర్డింగుల తొలగింపునకు చర్యలు చేపట్టాలి. ముంబయిలో పెనుగాలులకు విరుచుకుపడిన హోర్డింగ్ 16 మంది నిండు ప్రాణాలను బలిగొన్న దుర్ఘటనను గుణపాఠంగా తీసుకుని పాలకులు తగిన చర్యలు చేపట్టగలిగితే ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చు.
గోరంట్ల శివరామకృష్ణ (సీనియర్ జర్నలిస్టు)