Doctorate: కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో విద్యారంగ సంస్కరణల పేరుతో తీసుకున్న అనేక నిర్ణయాలు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నిరుపేద, సామాజికంగా వెనకబడిన వర్గాల విద్యార్థుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పరిశోధన చేయాలనుకునే ఈ వర్గాల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో అమల్లోకి వచ్చిన నిబంధన అడ్డంకిగా మారింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి దేశంలోని వివిధ యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలలో పీహెచ్‌డీ ప్రవేశాలకు జాతీయ అర్హత పరీక్ష (నెట్) నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల ఆయా యూనివర్సిటీలు ఇప్పటివరకు సొంతగా నిర్వహించే ప్రవేశ పరీక్షలు రద్దైపోయాయి. జాతీయ స్థాయిలో జరిగే నెట్ పరీక్ష మూలంగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి, ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ పీజీ వరకు చదువుకున్న బహుజన, దళిత, ఆదివాసీ, గిరిజన, మైనారిటీ వర్గాలతో బాటు ఇతర వర్గాలకు చెందిన ఆర్థికంగా వెనకబడిన నిరుపేద కుటుంబాల విద్యార్థులకు అవకాశం లేకుండా పోతోందని వారు వాపోతున్నారు. ఇది విశ్వవిద్యాలయాల స్యయంప్రతిపత్తిని నాశనం చేయటం తప్ప మరొకటి కానేకాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ ఏడాది మార్చి 13న ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ యూనివర్సిటీలు తమకు తాముగా ఎప్పటినుంచో నిర్వహించుకుంటూ వస్తున్న పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలను రద్దు చేసి, దాని స్థానంలో జాతీయస్థాయిలో నెట్ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కొత్త పరీక్ష విధానంలో నెట్‌ను 3 కేటగిరీలుగా విభజించారు. అందులోని మొదటి కేటగిరీలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత ఇచ్చారు. రెండవ కేటగిరిలో ఫెలోషిప్ ఇవ్వకుండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి మాత్రమే అర్హత ఇచ్చారు. ఇక మూడవ కేటగిరిలో ఫెలోషిప్ గాని, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి అర్హత ఇవ్వకుండా కేవలం.. పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు మాత్రమే అర్హత ఇచ్చారు. దాన్ని కూడా ఏడాదికే పరిమితం చేశారు. అంటే.. ఈ పరీక్షలో ఉత్తమ ప్రతిభను చూపిన మొదటి కేటగిరీ వారికి పీహెచ్‌డీ చేసేందుకు తగిన ఆర్థిక సాయంతో ఉద్యోగ భద్రత కూడా అందుతుంది. రెండవ కేటగిరీ వారికి ఉద్యోగార్హత చూపిస్తూ, పీహెచ్‌డీ చేసేందుకు ఆర్థికసాయం నిరాకరించారు. మూడవ తరగతి వారికి ఆర్థికసాయంతో బాటు ఉద్యోగార్హత కూడా లేకుండా చేశారు. ఈ నిర్ణయం ద్వారా కేంద్రంలోని పెద్దలు సమాజంలోని కింది వర్గాలకు చెందిన విద్యాధికులకు తీరని ద్రోహం చేశారు. ఎందుకంటే.. నెట్ పరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిర్వహిస్తారు. దీనివల్ల బాల్యం నుంచి ప్రాంతీయ భాషా మాధ్యమంలో సర్కారీ విద్యాసంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఈ నెట్ పరీక్షలో క్వాలిఫై కాలేకపోతున్నారు. దీంతో కేటగిరి-1లో వీరు ఫెలోషిప్ పొందేందుకు తలుపులు మూసుకుపోయాయి. మరోవైపు, వివిధ యూనివర్సిటీల్లో ఏటా పీహెచ్‌డీ ఖాళీలు భర్తీ చేసేందుకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలనే విధానం లేకపోవడం వల్ల యూజీసీ నెట్‌లోని 3వ కేటగిరి సాధించినా.. దాని కాలపరిమితి ఏడాదే ఉంటున్న కారణంగా ఈలోపు వారికి పీహెచ్‌డీ ప్రవేశం దక్కటం అసాధ్యంగా మారనుంది.
ఇప్పుడున్న పరిస్థితిలో అనేక రాష్ట్రాల్లో నిరుపేద వర్గాల విద్యార్థులు, బీసీ,దళిత, ఆదివాసీ, గిరిజన, మైనారిటీ విద్యార్థుల్లో నూటికి 40 శాతం మందికి కూడా తమ ప్రాంతాల్లోని ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో చదివే అవకాశం లేదు. వీరు చదివే ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల ప్రమాణాలు కూడా పెద్దగా చెప్పుకోదగినవేం కాదు. దీంతో ఇక్కడి విద్యార్థులు పట్టణ, నగర ప్రాంతాల ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో చదివే విద్యార్థులతో పోటీ పడలేని స్థితిలో ఉన్నారు. అనేక రూపాల్లో సామాజిక వివక్షలు, ఆర్థిక కష్టాలు ఎదుర్కొని అతికష్టం మీద పీజీ వరకు చదువుకున్న ఈ దిగువ వర్గాల విద్యార్థులు కేంద్ర నిర్ణయంతో ఉన్నత విద్యా సంస్థలలో పీహెచ్‌డీ చేసే అవకాశాలు ఇక లేకుండా పోయాయి. యూజీసీ ఈ కొత్త నియమాన్ని ప్రకటించిన సమయమూ అనేక అనుమానాలకు తావిస్తోంది. మార్చి 13న ఈ నిర్ణయం తీసుకున్న యూజీసీ.. దీనిని పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రకటించింది. దీంతో విద్యార్థులెవరూ దీనిని వ్యతిరేకిస్తూ రోడ్డెక్కే అవకాశం లేకుండా పోయింది.
దేశంలోని అల్పసంఖ్యాక వర్గాల వారి వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి 2005లో నాటి యూపీఏ సర్కారు దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రాజీందర్ సచార్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2006లో సమర్పించిన నివేదికలో ముస్లింలు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా ఇతర మతాలవారితో పోలిస్తే బాగా వెనుకబడి ఉన్నారని తేలింది. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 20 యేండ్లకు పైబడిన ముస్లింలలో 7 శాతం మంది ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. ఆ కమిటీ సిఫారసు మీద 2009లో నాటి ప్రభుత్వం మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జాతీయ ఉపకార వేతనాల పథకాన్ని తెచ్చింది. ఇది ముస్లింలతో బాటు బౌద్ధులు, జైనులు, సిక్కులు వంటి ఇతర అల్పసంఖ్యాక వర్గాలకూ వర్తిస్తుంది. పీజీ పూర్తి చేసి ఎంఫిల్, పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఆర్థిక సాయం అందించటమే ఈ పథకం లక్ష్యం. అయితే, ఈ పథకం కింద లబ్ది పొందుతున్న వారు వేరే స్కాలర్‌షిప్ పొందుతున్నారనే కారణం చూపుతూ కేంద్రం తాజాగా ఈ పథకాన్ని రద్దుచేసేసింది. నిజానికి ఈ పథకం కింద రెండు స్కాలర్ షిప్‌లు అందుకోవటాన్ని ప్రభుత్వం నిరోధించేలా సవరణ చేయొచ్చు. కానీ, ఏకపక్షంగా మొత్తం పథకాన్నే లేకుండా చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2018-19లో మౌలానా ఆజాద్ పేరిట తీసుకొచ్చిన ఈ పథకం లబ్దిదారుల్లో ప్రతి 1000 మందిలో 733 మంది ముస్లింలే కావడమే బహుశ: కేంద్ర సర్కారుకు నచ్చకనే దీనిని రద్దు చేశారనే అభ్యంతరాలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్నా, దీనిపై ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కొందరు విద్యార్థులు చేసిన ధర్నాలు, రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, బీఎస్పీ ఎంపీ డానీష్ అలీ, మజ్లిస్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ వంటివారు లేవనెత్తినా ఈ అంశం ప్రధాన స్రవంతి మీడియాలో ఎలాంటి చర్చకూ నోచుకోలేకపోయింది.
మరోవైపు.. నూతన విద్యా విధానం-2020 అమలులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్న యూజీజీ ఉనికి సైతం నేడు ప్రమాదంలోనే ఉంది. కొత్త విద్యా విధానంలోనే యూజీసీని రద్దు చేసి దాని స్థానంలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే ఉన్నత విద్యా మండలి (హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా – హెచ్‌ఈసీఐ)ని ఏర్పాటు చేయటానికి రంగం సిద్ధం అవుతోంది. దీనిమూలంగా ఇక యూనివర్సిటీల్లో ఫీజుల పెంపు, పాలనా పరమైన అధికారాలన్నీ కేంద్రం చేతికే చిక్కనున్నాయి. దీంతో ఉన్నత విద్య అందుకునే వారి సంఖ్య మరింత తగ్గిపోనుంది. నూతన విద్యావిధానం పేరుతో మోదీ సర్కారు తీసుకొస్తున్న ఈ సంస్కరణల్లో మానవీయ కోణం అనేది రవ్వంత కూడా కానరాని దుస్థితి కింది వర్గాల విద్యార్థులను కుంగదీస్తుంటే.. దీనిని విపక్షాలు సైతం జాతీయ స్థాయిలో ప్రశ్నించలేకపోవటం లేదు. ప్రస్తుతం దేశ జనాభాలో 14.2 శాతంగా ముస్లిం వర్గం నుంచి కేవలం 5.5 శాతం విద్యార్థులు మాత్రమే కళాశాలలు, వర్సిటీ విద్యను అందుకోగలుగుతున్నారు. దేశ జనాభాలో 16.5 శాతంగా ఎస్సీ కులాల విద్యార్థుల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారు 14.7 శాతం మాత్రమే. ఇకపై ఈ మాత్రం వాటా అయినా.. దక్కుతుందా అంటే అనుమానమే. ఇప్పటికే జాతినిర్మాణం, జాతీయ భద్రత పేరిట తెస్తున్న చట్టాలు ముస్లింలలో భయాందోళనలు కలిగిస్తుండా, ఇక విద్యారంగంలోనూ ముస్లింలు మరింత వెనకబాటుకు గురయ్యే పరిస్థితులు తలెత్తటం దురదృష్టకరం.
– మహమ్మద్ సమద్, పాత్రికేయుడు