Singareni Mines: సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడానికి రోజుకు 2.25 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సంస్థ సీఎండీ ఎన్ బలరాం నాయక్(CMD N Balaram Nayak) ఆదేశించారు. రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించాలన్నారు. కొత్తగూడెం(Kothagudem)లోని సింగరేణి ప్రధాన కార్యాలయం నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అన్ని ఏరియాల జీఎంలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. గత మూడు నెలలుగా కురిసిన భారీ వర్షాల వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంలో 91 శాతం ఉత్పత్తి లక్ష్యాలను, 93 శాతం రవాణా లక్ష్యాలను మాత్రమే సాధించామని, మిగిలిన ఆరు నెలల్లో ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
గత రెండు నెలల కాలంలో..
వర్షాల వల్ల కలిగిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి వీలుగా ఇకపై ఉత్పత్తి లక్ష్యాలను పెంచినట్లు వెల్లడించారు. అలాగే గత రెండు నెలల కాలంలో సింగరేణి సంస్థ మనుగడకు, ఉజ్వల భవిష్యత్ కు దోహదపడే పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా కీలక ఖనిజాల అన్వేషణ రంగంలోనూ కంపెనీ అడుగు పెట్టిందని గుర్తుచేశారు. బొగ్గు బ్లాక్ల, ఇతర ఖనిజాల వేలంలోనూ పాల్గొనేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని పేర్కొన్నారు. అదే సమయంలో సింగరేణి అంతర్జాతీయ కార్యాలయం నిర్మాణం కోసం ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read: Asia Cup Trophy Row: ఆసియా కప్ ట్రోఫీ ఇవ్వకపోవడంపై నక్వీని నిలదీసిన బీసీసీఐ!
ప్రతీ షిఫ్ట్ లో 8 గంటలు..
సింగరేణి బహుముఖ విస్తరణకు వెళ్తున్న నేపథ్యంలో ఉద్యోగులందరికీ కంపెనీ ఆర్థిక స్థితిగతులు, విస్తరణ ప్రణాళికలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ప్రతీ ఒక్క ఉద్యోగిలోనూ పని సంస్కృతిని మరింత మెరుగుపరిచేందుకు ప్రతీ ఒక్కరూ ప్రయత్నించాలని, కంపెనీ మనుగడ కోసం ప్రతీ ఉద్యోగి ప్రతీ షిఫ్ట్ లో 8 గంటలు పనిచేయాలన్నారు. సింగరేణి అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి వీలుగా మానవ వనరుల సమర్థ వినియోగం అత్యవసరమని బలరాం వివరించారు. నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంచినప్పుడే బొగ్గు రంగంలో మన మనుగడ ఉంటుందన్నారు. ఇకపై ఏరియాల వారీగానూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ(LV Suryanarayana), వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమల రావు, హైదరాబాద్ నుంచి ఈడీ కోల్ మూవ్మెంట్ వెంకన్న, జీఎం శ్రీనివాస్, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలు హాజరయ్యారు.
Also Read: Allu Sirish: నయనికతో నిశ్చితార్థం.. అధికారికంగా ప్రకటించిన అల్లు శిరీష్