Kadiyam Srihari: మున్సిపాలిటీ భవనం, అంతర్గత సిసి రోడ్లు, టౌన్ హాల్ మొదలైన అభివృద్ధి పనులతో స్టేషన్ ఘన్ పూర్ రూపురేఖలు మారుతాయని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ చేశానని, మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్లు తెచ్చానని వెల్లడించారు. మున్సిపాలిటీకి ఎక్కువ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Local Body Reservations: పకడ్బందీగా రిజర్వేషన్లు.. ఈ లెక్కల ప్రకారమే ప్రభుత్వ వ్యూహం
100 పడకల అస్పత్రి
మున్సిపాలిటీ కార్యాలయ భవనం, టౌన్ హల్, ఇంటిగ్రెటెడ్ మార్కెట్, సిసి రోడ్లు, డ్రైన్లు, రోడ్డు వెడల్పు వంటి పనులకు 50 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఈ పనులన్నింటిని ఏడాదిలో పూర్తి చేస్తానని వీటితో పాటు 100 పడకల అస్పత్రి, డివిజనల్ ఆఫీస్, డిగ్రీ కళాశాల ఏర్పాటుతో మున్సిపాలిటీ రూపు రేఖలు మారుతాయాన్ని పేర్కొన్నారు. దేవాదుల 3వ దశ ప్యాకేజీ 6 పనులను పూర్తి చేయాలనీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళగానే సవరించిన అంచనాలతో 1001 కోట్ల మంజూరు చేశారని తెలిపారు. దీని ద్వారా జఫర్ గడ్ మండలం ఉప్పుగల్ చెరువు, జఫర్ గడ్ పెద్ద చెరువు, థంస చెరువును రిజర్వాయర్ గా చేయనున్నట్టు తెలిపారు.
ప్రతీ ఎకరానికి సాగు నీరు
ఒక్క జఫర్ గడ్ మండలంలోనే 10వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తెలిపారు. ఏడాది కాలంలో దేవాదుల పెండింగ్ పనులు, గండి రామారం కుడి కాలువ మరియు లిఫ్ట్ పనులను పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ రైతులకు సాగు నీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే జరుగుతుందని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాని వెల్లడించారు. పనిలేని వారి మాటలు నేను పట్టించుకోనని, నా లక్ష్యం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల
సంక్షేమం మాత్రమేనని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని, ఒకే పార్టీ ప్రజా ప్రతినిధులు ఉంటే అభివృద్ధి సుగమం అవుతుందని అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం తీసుకొని సహసోపేత నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నారని అన్నారు. బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కి పంపించినట్లు తెలిపారు. బిసిలపై ప్రేమ ఓలకబోసే పార్టీలు బిసి రిజర్వేషన్లకు మద్దత్తు తెలపాలని కోరారు. బిఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలని, ఎవరైనా కోర్టుకు వెళ్లినా కేసులు ఉపసంహారించుకోవాలని కోరారు. జనాభా ప్రాతిపదికన అవకాశాలు రావాలని, అనవసరపు మెలికలు పెట్టి బిసిల అవకాశలను దెబ్బతీయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ దేవస్థాన కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ కర్ణాకర్ రావు, నాయకులు బుర్ల శంకర్, మెట్టిల్లి రమేష్, సారంగపాణి, లింగాజీ, వెంకటరెడ్డి, ఇల్లందుల బేబీ, వినయ్, రజాక్, శ్రీరాములు పాల్గొన్నారు.
Also Read: Srinivas Goud: రిజర్వేషన్ల పెంపు జీవో చెల్లదని వారికి తెలియదా.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్