Sheep Distribution: గొర్రెల కుంభకోణానికి సంబంధించి ఏసీబీ రెండో రోజూ విచారణలోనూ నిందితులు నోరు మెదపలేదు. పశుసంవర్ధక శాఖ మాజీ ఎండీ రామచందర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్‌లు విచారణకు సహకరించలేదు. మొదటి రోజు, రెండో రోజూ వీరు ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. ఇద్దరిని ఎదురెదురు కూర్చోబెట్టి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. రూ. 2.10 కోట్లు దారిమళ్లినట్టు భావించింది. ఈ కేసులో పది మందిని నిందితులుగా గుర్తించి పలువురిని అరెస్టు చేశారు. కాగా, రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్‌ల అరెస్టుతో ఈ స్కాం్ రూ. 700 కోట్లదని గుర్తించింది. ఇందుకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించింది. రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్‌లను కస్టడీలోకి ఇవ్వాలని కోర్టును కోరగా మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. సోమ, మంగళవారం విచారణలో నిందితులు సహకరించలేదు. వీరి నోరు తెరిస్తే పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
గొర్రెల పంపిణీలో కాంట్రాక్టర్లను ఎందుకు తెచ్చారని, బోగస్ కంపెనీతో గొర్రెలను కొని రైతులకు ఇవ్వాలని ఎవరు ఆదేశించారని, గొర్రెల స్కీమ్ యూనిట్ కాస్ట్ పెంపు, దళారుల ప్రమేయం వంటి వాటిపై ఏసీబీ ప్రశ్నలు కురిపిస్తున్నది. ఈ స్కాంలో ఇతరుల పాత్రపైనా ఏసీబీ ఆరా తీసింది. కాంట్రాక్టర్ మోయినుద్దీన్ పరారీలో ఉన్నాడు. మోయినుద్దీన్, ఆయన కొడుకు ఇక్రమ్ పై లుక్ ఔట్ నోటీసులును ఏసీబీ జారీ చేసింది. పక్కదారి పట్టిన నిధులు ఎక్కడికి వెళ్లాయనే కోణంలోనూ ఏసీబీ దర్యాప్తు చేస్తున్నారు.