PC Ghosh Commission: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి రెండు రోజులుగా ఇరిగేషన్ శాఖకు చెందిన పలువురు అధికారులను ఆఫీసుకు పిలిచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. సోమ, మంగళవారాల్లో ఇంజనీర్లు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. బుధవారం సుమారు 20 మందికిపైగా అధికారులతో భేటీ అయింది. ఇందులో సీనియర్ ఇంజినీర్లు, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీలూ ఉన్నారు. వీరందరిని తమకు తెలిసిన, జరిగిన అంశాలను అఫిడవిట్ రూపంలో రాసి జూన్ 25వ తేదీలోపు సమర్పించాలని ఆదేశించింది.
కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ బీఆర్కే భవన్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. తాను ఇవాళ 20 మందికి పైగా అధికారులతో సమావేశమైనట్టు తెలిపారు. మూడు బ్యారేజీలకు సంబంధించి చాలా సమాచారం తెలుసుకున్నానని వివరించారు. సోమ, మంగళవారాల్లో ఇంజినీర్లతో భేటీ అయ్యామని, రేపు ఏం చేయాలనేది లిస్టు ప్రిపేర్ చేస్తామని తెలిపారు. త్వరలో నిర్మాణ సంస్థలనూ విచారణకు పిలుస్తామని చెప్పారు. ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారణకు పిలుస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని సూచించారు. ఇక విచారణకు వచ్చిన అందరూ 25వ తేదీలోగా అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పామని, తప్పుడు అఫిడవిట్ అని తేలితే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అధికారుల పేర్లు ఉంటే వాళ్లకు కూడా నోటీసులు ఇస్తామని, పిలిచి విచారిస్తామని జస్టిస్ పీసీ ఘోష్ చెప్పారు.
ఇక బ్యారేజీల గురించి మాట్లాడుతూ బ్యారేజీలు సరిగా పని చేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జస్టిస్ ఘోష్ అన్నారు. బ్యారేజీల వల్ల లాభమే తప్ప నష్టం లేదని అనిపిస్తున్నదని వివరించారు. ఎక్కడో ఏదో తప్పుడు లెక్క జరిగి ఉంటుందని, అందుకే ఇలా జరిగిందని అనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. మూడు బ్యారేజీల పరిధిలోకి వచ్చే ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 6వ తేదీన తెలంగాణకు వచ్చారు. 7, 8వ తేదీల్లో బ్యారేజీలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. మరమ్మతుల పనుల గురించి తెలుసుకున్నారు. బ్యారేజీల ప్రస్తుత పరిస్థితినీ ఆయన పరిశీలించారు. మరుసటి రోజు నుంచి ఆయన విచారణను ముమ్మరం చేశారు. ఇరిగేషన్ శాఖకు చెందిన పలువురు అధికారులను, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బాధ్యతల్లో ఉన్న అధికారులనూ ఆయన పిలిచారు. ఈఎన్సీ మురళీధర్ సహా పలువురిని ఆయన విచారించారు. త్వరలో మాజీ ప్రజాప్రతినిధులను కూడా పీసీ ఘోష్ కమిషన్ పిలిచి విచారించే అవకాశం ఉన్నది.