Rural Health Care: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఆరోగ్య సదుపాయాలు,పల్లె దవాఖానలే ఆరంభం అంటూ హామీలు ఇచ్చినా… వాస్తవానికి మాత్రం పరిస్థితి తలకిందులుగా ఉంది. పండుగ రోజు గ్రామాల ప్రజలకు అండగా ఉండాల్సిన పల్లె దవాఖానలు తాళం వేసి మూతబడ్డాయి.దాంతో చికిత్స కోసం వచ్చిన రోగులు దవాఖాన తలుపు తట్టి తిరిగి వెనుదిరగాల్సి వచ్చిన దుస్థితి నెలకొంది.గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి జ్వరం, గాయాలు, గర్భిణీ స్త్రీల చెకప్‌ల కోసం ఆధారపడే పల్లె దవాఖానలు మూతబడ్డాయి.
పండుగ పేరుతో సిబ్బంది గల్లంతు కావడంతో దవాఖానల ముందు నిరాశగా నిలబడిన రోగులు ప్రాణాలతో ఆటలాడుతున్నారా…? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది ఎందుకని..? అత్యవసర సమయంలో కూడా తలుపులు మూసేస్తే గ్రామస్తులు ఎక్కడికి వెళ్ళాలి..? అంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దవంగర మండలంలోని అనేక గ్రామాల్లో ఇదే దృశ్యం కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.తలుపులు వేసి ఖాళీగా ఉన్న పల్లె దవాఖానలు… బాధతో వెనుదిరిగిన రోగులు… ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాల్లో ఆరోగ్యసేవలకు పండుగ పేరుతోనే గ్రహణం పట్టినట్టే అయింది.